ఖమ్మం వరద ముంపు కాలనీల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే..
బురదలోనే బతుకు పోరాటం.. సాయం కోసం ఎదురుచూపులు
గుక్కెడు మంచి నీళ్లు, ఒక్కపూట తిండి కోసమూ ఇబ్బందులు
అటువైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూపులు
బురద, చెత్త, దుర్వాసనతో అవస్థలు..
ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదంటూ ఆవేదన
ఇంకా వెంటాడుతున్న ‘వరదల’ భయం
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.
బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..
ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..
వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్‌యార్డ్‌లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్‌వైజర్ చందు తెలిపారు.
అధికారుల జాడే లేదంటూ..
వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్‌లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.
‘పండుగ’కూ వరద ముంపు
ఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.
‘పాత సామాన్లు కొంటాం’!
కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment