ఖమ్మంలో ఇంకా తేరుకోని మున్నేరు ముంపు ప్రాంతం
పలు ప్రాంతాల్లో తొలగని బురద మేటలు
ముంపు సర్వేలో తమ పేర్లు రాయలేదంటూ బాధితుల ఆందోళన
ట్యాంకర్ల నీళ్లు సరిగా అందడం లేదని.. తాగునీటికీ ఇబ్బందని ఆవేదన
నీట మునిగి చెడిపోయిన కరెంటు మీటర్లు.. అందని విద్యుత్ సరఫరా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద వచ్చి ఐదు రోజులైనా ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. బురద, దుర్వాసన ఓవైపు.. తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు దొరకక మరోవైపు బాధితులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఆర్థిక సాయం సర్వేలో.. తమ పేర్లు నమోదు చేయ లేదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగింపు, పారిశుధ్య పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని వాపోతున్నారు.
తొలగని బురద.. అందని నీరు
సుమారు 50 కాలనీల్లో బురద నిండిపోయి ఉంది. వాహనాలతో తొలగిస్తూనే ఉన్నా.. ఇంకా భారీగా పేరుకుపోయే కనిపిస్తోంది. ఇళ్లలో బాత్రూంలను వాడుకునే పరిస్థితి లేదు. ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుందామనుకునే వారికి తగినన్ని నీళ్ల అందడం లేదు. కొన్ని కాలనీలకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భోజనాల వేళ దాతలు ఇచ్చే తాగునీటి ప్యాకెట్లే తప్ప రక్షిత నీరు అందడం లేదని వాపోతున్నారు.
తమను సర్వే చేయడం లేదంటూ..
వరద సమయంలో ఆస్పత్రులు, శుభకార్యాలు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు.. ఇళ్లకు తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు రెండు వేలకుపైగా ఇళ్లు పూర్తిగా నీటమునగడంతో విద్యుత్ మీటర్లు పాడయ్యాయి. విద్యుత్ శాఖ వాళ్లు వాటి స్థానంలో కొత్తవి బిగించే పనులు చేస్తున్నా.. గోడలు తడిసే ఉండటంతో షాక్ వస్తుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ఖమ్మంరూరల్ మండలం కేబీఆర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఎల్రక్టీషియన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. దీంతో పగలంతా ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్న బాధితులు.. రాత్రికి తిరిగి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు.
భర్త ఆపరేషన్ కోసం వెళ్లి..
ఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఐతరాజు జ్యోతి, వెంకన్న కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వెంకన్నకు గొంతు ఆపరేషన్ కోసం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లారు. వరద విషయం తెలిసి ఆందోళనలో పడ్డారు. స్థానికంగా లేకపోతే సర్వేలో పేరు రాయరని, ఆర్థిక సాయం అందదేమోనని భావించిన చెందిన జ్యోతి బుధవారం రాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో నిత్యావసరాలు సహా సామగ్రి అంతా తడిసి పాడైపోయి ఉండటాన్ని చూసి కన్నీళ్లులో మునిగిపోయారు.
కిరాణం, వాటర్ ప్లాంట్ కొట్టుకుపోయి..
ఇక్కడి వెంకటేశ్వర నగర్‌లో కాటం వెంకటేశ్వర్లు కిరాణం, వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ఈ రెండూ మునిగి, సామగ్రి కొట్టుకుపోయి.. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. ముంపు సర్వే కోసం ఇంకా ఎవరూ రాలేదని, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
పదివేల సాయం ఏ మూలకు..?
కాల్వొడ్డు ప్రాంతంలో నివసించే రామిశెట్టి నాగమ ణి భర్త గతంలోనే చనిపోయారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవించే నాగమణికి.. వరదల వల్ల కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల పరిహారం దేనికీ సరిపోదని ఆమె వాపోతున్నారు.
శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి..
వెంకటేశ్వరనగర్‌లో నర్రి సుగుణ, యాదయ్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఓ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని వరద ముంచెత్తింది. ఇంట్లోని నాలు గు క్వింటాళ్ల బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిసి పాడైపోయాయి. తనను పరామర్శించేందుకు వచ్చిన పెద్దకుమార్తెని చూసి కట్టుబట్టలతో మిగిలామంటూ సుగుణ కన్నీరుపెట్టారు.
కోలుకోని ముంపు గ్రామాలు!
సాక్షి, మహబూబాబాద్/అనంతగిరి (కోదాడ): సూర్యాపేట, మానుకోట జిల్లాల్లోని ముంపు గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వరద కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లో 45 చెరువులు తెగిపోయాయి, మరో 35 చెరువులు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారమే.. చెరువులు, కుంటల కింద 27,639 ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు నిండిపోయాయి.
మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ఖమ్మం వెళ్లేందుకు సీరోలు మండలం ముల్కలపల్లి వద్ద నిర్మించిన బ్రిడ్జి భారీ వరదకు కూలిపోయింది. దానితో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వరద బీభత్సంతో చిన్నగూడూరు, ఎల్లంపేట, పురుషోత్తమాయగూడెం, తానంచెర్ల, ఉల్లెపల్లి తదితర చోట్ల పైపులైన్లు తెగిపోవడం, పగిలిపోవడం వంటి జరగడంతో.. గత ఐదు రోజులుగా 45 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురం, గోండ్రియాలలో ముంపు బాధితులు తమకు నిత్యావసరాలు, తాగునీరు అందడం లేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment