అమ్మ పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందులు
చిట్టి చేతులతో ఊయల ఊపుతూ బుజ్జగిస్తున్న చిన్నారులు
బురద, చెత్తతో నిండిన ఇళ్లు, సామగ్రి శుభ్రం చేసుకునే పనిలో పెద్దలు
అమ్మానాన్నల కోసం దీనంగా ఎదురుచూస్తూ పిల్లల గగ్గోలు
ఉడికీ ఉడకని అన్నం మెతుకులే పరమాన్నంగా తినాల్సిన దుస్థితి
విషజ్వరాలతో బాధపడుతున్న యువకులు.. విరేచనాలతో అవస్థపడుతున్న వృద్ధులు
ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్‌కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.
గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్‌కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.
ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు.
బిక్కుబిక్కుమంటూ గడుపుతూ..
వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్‌లీలా ఫంక్షన్ హాల్‌లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అమ్మా ఎప్పుడొస్తావ్!
‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్‌ఫోన్‌లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్‌లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు.
అలా తినాలంటే ఎలా?
తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.
కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.
నా ఖమ్మం కోసం నేను!
వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్‌లు.. కలెక్టర్ వినూత్న ఆలోచన
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment