ఖమ్మం ముంపు ప్రాంతాల్లో బాధితుల ఆవేదన
తమ ఇళ్లకు సర్వే సిబ్బంది ఎవరూ
రాలేదంటూ పలువురు ఆందోళన
కేవలం పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకే ‘సర్వే’ పరిమితం
తాము కోల్పోయిన ఇళ్లు, సామగ్రి నష్టం పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
పేర్లు నమోదు చేయడం లేదంటూ..
మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏ అధికారి కూడా.. రాలేదు..
వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.
– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మం
సర్వే లేదు.. సాయం లేదు..
రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment