ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు
ఖమ్మం మయూరిసెంటర్ : ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రెండు వారాల క్రితం మందకొడిగా సాగిన పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తి కావడం.. ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు రబీలో వరి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన పనులు ఉండడంతో అటువైపు వెళ్లేందుకు మక్కువ చూపారు. ప్రస్తుతం సాగు పనులన్నీ పూర్తికావడంతో కూలీలు ఉపాధి పనులను ఆశ్రయించారు. జిల్లాలో ఉపాధిహామీ పనులను రోజుకు లక్ష మంది కూలీలు వినియోగించుకుంటున్నారు.
కందకాలు తవ్వడం, సైడ్ కాల్వలు, ఫాం పాండ్స్, పొలాల గట్లు చదును చేయడం, రోడ్లు వేయడం, మిషన్ కాకతీయ వంటి పనులు చేపడుతున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలపాటు వీరు ఆయా పనులు చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా అధిక సంఖ్యలో పనులను వినియోగించుకుంటున్నారు. ఎటువంటి పనులు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ సమయంలోనే కూలీలు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిదినాలు పెంచింది. ఈ మేరకు కూలీలకు పనిదినాలు అందుబాటులో ఉండడంతో ఒకే కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురి వరకు పనులకు వెళ్తున్నారు.
ఎండలు లెక్కచేయకుండానే..
నిన్న, మొన్నటి వరకు ఉపాధి పనులను కూలీలు అంతగా వినియోగించుకోలేదు. ఒకవైపు వ్యవసాయ పనులు.. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో ఉపాధి పనులు జిల్లాలో నత్తనడకన సాగాయి. దీంతో లక్ష్యం మేరకు పనిదినాలు పూర్తి కావని అధికారులు భావించారు. దీనికి తోడు ఉపాధి పనులకన్నా ఇతర కూలి పనులకు వెళ్తే డబ్బులు ఎక్కువగా వస్తుండడంతో ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక.. ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు పనులకు వెళ్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు పనులకు వెళ్తే కుటుంబం గడుస్తుందనే ఉద్దేశంతో
ఇల్లు గడవాలంటే..
ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన విద్దిగాని వెంకన్న కుటుంబం మొత్తం ఉపాధి పనులకు వెళ్తోంది. గతంలో వెంకన్న కల్లు గీత కార్మికుడిగా కుల వృత్తి చేసుకునేవాడు. అయితే ఆయనకు ఓ ప్రమాదంలో కాలు విరగడంతో పూర్తిగా తొలగించారు. ఇక తాటిచెట్టు ఎక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఉపాధిహామీ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఉపాధి పథకంలో వికలాంగులకు ప్రత్యేకంగా పనులు ఉండడంతో వాటిని వెంకన్న ఉపయోగించుకుంటున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉపాధిహామీ పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పొట్ట నింపుకోవడానికి పనులు చేస్తున్నామని, తమకు వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని కూలీలు కోరుతున్నారు.
రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు
వేసవి తాపం నుంచి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. అయితే ఆ సౌకర్యాలు ఇప్పటివరకు అంతంత మాత్రంగానే అమలు జరిగాయి. ప్రస్తుతం కూలీలు కూడా పనులకు పోటీపడి వస్తుండడంతో అధికారులు రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. స్థానిక ఉపాధిహామీ సిబ్బంది కూలీలకు నీడ కోసం పట్టాలు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. దీంతో కూలీలు కూడా ఉపాధి పనులను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు.
సౌకర్యాలు కల్పిస్తున్నాం..
జిల్లాలో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య పెరిగింది. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా కూలీల సంఖ్య మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తిగా ముగియడంతో కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కూలీల రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఈ వారం కూలీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా రాష్ట్రంలోనే ఉపాధి పనుల్లో మెరుగైన స్థానాన్ని సంపాదించుకుంది.
– బి.ఇందుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
ఉద్యోగం దొరికే వరకు..
డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. చిరుద్యోగం కూడా దొరకకపోవడంతో ఖాళీగా ఉండలేక ఉపాధి పనులకు వెళ్తున్నా. ఉపాధి పనికి వెళ్లడం వల్ల ఇంట్లో ఖర్చులకు కొంత ఆసరా దొరుకుతుంది. ఈ ఏడాది పని ప్రదేశాల్లో సౌకర్యాలు పెంచడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి పనులకు వెళ్తున్నా. ఉద్యోగం దొరికే వరకు ఉపాధి పనులకు వెళ్తాను. – నరేందర్, నిరుద్యోగి
Comments
Please login to add a commentAdd a comment