ఎదుళ్లచెరువు రేషన్ షాపు వద్ద ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయి పడిగాపులు కాస్తున్న ప్రజలు
తిరుమలాయపాలెం : రేషన్ దుకాణాల్లో ఆన్‌లైన్‌లో ఈ పాస్ విధానంతో సరుకులు ఇచ్చే ఇంటర్‌నెట్ సౌకర్యం సరిగాలేకపోవడం, డీలర్లకు ఆన్‌లైన్ నమోదులో సరైన అవగాహన లేని ఫలితంగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. రేషన్ కార్డు దారుల వేలిముద్ర ఆన్‌లైన్‌లో నమోద యితేనే బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలు రోజులతరబడి రేషన్ షాపుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలాయపాలెం మండలంలో 28 పంచాయతీల పరిధిలో 38 రేషన్ షాపులు ఉన్నాయి. ఆయా షాపుల పరిధిలో 19302 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ఈపాస్ విధానాన్ని చేపట్టి రేషన్ వివరాలను ప్రజల ముంగిట్లో ఉంచేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆలైన్ వ్యవస్థను నడి పించేందుకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది.
ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఆయా గ్రామాలలో సరైన ఇంటర్‌నెట్ సౌకర్యం ఉందా! లేదా? అనే విషయాన్ని తెలుసుకోకుండానే మిషన్లను అందజేసింది. రేషన్ డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు అందజేసి ఈ పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు మిషన్లను పర్యవేక్షిస్తున్న సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. దీంతో ఆయా గ్రామాలలో మిషన్లు పనిచేయక రేషన్ కార్డు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీడీఎస్ విధానం ద్వారా రేషన్ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే భయంతో కార్డు దారులు ఈ విధానంలో నమోదు చేయించుకుని బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు వస్తున్నారు. ఈ పాస్ మిషన్లలో కొందరు కార్డుదారుల వేలిముద్రలు పడడంలేదు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడంలేదు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment