ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్లు, వాచ్‌మెన్ పోస్టులు ప్రతిభావంతులకు వస్తాయా.. పైసలు ఉన్నవారికేనా.. అనేది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. అన్ని అర్హతలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇస్తామని ట్రాన్స్‌కో అధికారులు చెపుతున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలువురు దళారులు నిరుద్యోగుల నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఉద్యోగాలు ఎవరికి వస్తాయో అర్థం కాక ప్రతిభావంతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తమ అనుచరులకే ఉద్యోగం ఇవ్వాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఆపరేటర్ పోస్టులకు పెరిగిన పోటీ..
సబ్‌స్టేషన్ ఆపరేటర్లు, వాచ్‌మెన్‌గా చేరితే ట్రాన్స్‌కోలో ఇతర ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందనే ఆలోచనతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం డివిజన్ల పరిధిలో మొత్తం 53 ఆపరేటర్ పోస్టులకు 2,350 దరఖాస్తులు, 13 వాచ్‌మెన్ పోస్టులకు 877 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ భర్తీ ప్రక్రియలో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల వారీగా రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంఘాలు పట్టుబట్టాయి. దీంతో భద్రాచలం, కొత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్న 15 పోస్టులకు 1:4 నిష్పత్తి ప్రకారం 60 మంది ఎస్టీలను, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని ఏజన్సీ ప్రాంతంలో ఉన్న తొమ్మిది పోస్టులకు 36 మందిని, మైదాన ప్రాంతంలో ఉన్న ఐదు పోస్టులకు 20 మందిని, ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న 23 ఉద్యోగాల్లో నాలుగు ఎస్టీ పోస్టులకు గాను 16 మందిని, 19 గిరిజనేతరుల పోస్టులకు 76 మందిని ఎంపిక చేశారు.
వీరిలో భద్రాచలం, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 27న, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు 28న, ఖమ్మం డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు 30న పోల్ క్లెయిమ్(స్తంభాలు ఎక్కే పరీక్ష) నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇంతవరకు అభ్యర్థుల విద్య, ఇతర టెక్నికల్ పరీక్షల్లో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేశారు. ఇక పోల్ క్లెయిమ్‌లో మెరిట్ సాధించిన వారికే ఉద్యోగాలు లభిస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకొని పలువురు దళారులు తమకు తెలిసిన అధికారులతో ప్రాక్టికల్ మార్కులు అధికంగా వేయిస్తామంటూ నిరుద్యోగుల వద్ద రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఓ అధికారి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారని సదరు దళారులు నిరుద్యోగులకు చెపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఉన్న నిరుద్యోగులు.. దళారుల రంగ ప్రవేశంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రతిభావంతులనే నియమించాలని కోరుతున్నారు.
అనుచరుల కోసం నాయకుల ఆరాటం...
గతంలో తమకు నచ్చిన వారికి ఉద్యోగం ఇప్పించే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఎంపిక విధానం మార్చడంతో తమ అనుచరుల పరిస్థితి ఏమిటని పలువురు అధికార, ప్రతిపక్ష నాయకులు డైలామాలో పడ్డారు. ఎలాగైనా తమ అనుచరులనే ఆపరేటర్లుగా నియమించాలని వారు ట్రాన్స్‌కో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గతంలో సబ్‌స్టేషన్ పరిధిలో ఉండే నాలుగు ఆపరేటర్ పోస్టుల నియామకంలో స్థానిక ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, సర్పంచ్, విద్యుత్‌శాఖ అధికారులకు అనువైన వారిని నియమించేవారు. కానీ ఇప్పుడు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. సీఎండీ కఠినమైన ఆదేశాల విషయం చెప్పినా వినకుండా పలువురు ప్రజాప్రతినిధులు ‘మా అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలి.. ఏం చేస్తావో తెలియదు. ఎంత డబ్బులు కావాలో తీసుకో.. లేకపోతే నియమించిన ఉద్యోగి ఎలా పనిచేస్తాడో మేము, మా కాంట్రాక్టర్లు చూస్తారు’ అని అధికారులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, మరోవైపు అధికారుల ఆదేశాలతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.
పారదర్శకంగానే ఎంపిక చేస్తాం
సబ్‌స్టేషన్ కాంట్రాక్టు ఆపరేటర్లు, వాచ్‌మెన్ నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తాం. ప్రతిభావంతులకే ఉద్యోగం వస్తుంది. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు.
- తిరుమలరావు, ఎస్‌ఈ
పైసా..? ప్రతిభా..??
Published Tue, Dec 24 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement