విద్యుత్ చార్జీల వాతకు ‘కేంద్రం’ దారులు!
* ఇకపై నేరుగా వినియోగదారులపై సుంకాలు, పన్నుల భారం
* వ్యాపారవర్గాలకు అనుకూలంగా టారిఫ్ పాలసీకి సవరణలు
* కాంపిటీటివ్ బిడ్డింగ్ ఒప్పందాల విద్యుత్ ధరలను పెంచుకోడానికి అనుమతి
* పెదవి విరుస్తున్న విద్యుత్ రంగ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల వాతలకు కేంద్రం మార్గం సుగమం చేసింది. సుంకాలు, లెవీలు, సెస్‌లు, పన్నుల రూపంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ఆస్కారం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. విద్యుత్ చార్జీల నిర్ణయానికి ప్రామాణికమైన ‘జాతీయ విద్యుత్ టారిఫ్ విధానం-2006’కు బుధవారం కేంద్ర కేబినెట్ చేసిన సవరణలు పూర్తిగా వ్యాపారవర్గాలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2012లోగా దేశంలో ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా చేస్తామనే లక్ష్యంతో 2006లో యూపీఏ ప్రభుత్వం టారిఫ్ పాలసీని తెచ్చిం ది. అయితే ఇప్పటికీ ఇది సాకారం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ సర్కారు 2018-19లోగా దేశంలో అందరికీ నిరంతర విద్యుత్ పేరుతో పాత పాలసీకి సవరణలు చేసింది. ఈ హామీని ఏ మేరకు సాధ్యం చేస్తారో కానీ.. ఈ సవరణలను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలు మాత్రం అడ్డుగోలుగా చార్జీలు పెంచుకోడానికి ఆస్కారం కలి గిందని నిపుణులు అంటున్నారు.
అదేవిధంగా బహిరంగ పోటీ (కాంపిటీటివ్ బిడ్డింగ్) లేకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు జరపడానికి వీలు కలిగింది. పాలసీ సవరణల్లో కొన్ని ముఖ్యాంశాలను బుధవారం కేంద్రం బహిర్గతం చేసింది. ఈ సవరణల ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతుందోనన్న దానిపై ప్రముఖ విద్యుత్‌రంగ నిపుణులు ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలివీ...
* పన్నులు, సుంకాలు పెరిగినప్పుడల్లా ఆ భారాన్ని కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో విద్యుత్ విక్రయిస్తున్న ప్రైవేటు కంపెనీలే భరిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలకు సానుకూల వ్యాపార వాతావరణం కల్పించడానికి ఇకపై ఆ భారాన్ని వినియోగదారులపై బదలాయించేందుకు కేంద్రం అనుమతించింది. గతంలో విదేశీ బొగ్గు వినియోగించి తక్కువ ధరకు విద్యుత్ అమ్ముతామని ఒప్పందాలు చేసుకున్న కొన్ని కంపెనీలు ఆ తర్వాత ఇండోనేసియాలో బొగ్గుపై పన్నులు అసాధారణంగా పెరిగాయని.. ఆ భారం ఇక్కడి ప్రభుత్వాలే భరించాలని పట్టుబట్టాయి. దీనిపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి.
* ఈ భారమంతా ప్రజలే భరించాలని నిర్ణయించడంతో భవిష్యత్తులో చార్జీలు పెంచక తప్పదు.
* ఏదైనా ప్రాజెక్టు నుంచి 10 శాతం కన్నా అధిక విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే చార్జీలను నిర్ణయించే అధికారాన్ని ఇకపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కి కట్టబెట్టడం మంచి నిర్ణయమే. దీంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే విద్యుత్ చార్జీలను రాష్ట్రాల ఈఆర్‌సీలు ఇష్టారాజ్యంగా పెంచే ప్రమాదం తప్పనుంది. ఉదాహరణకు.. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ కొనుగోలు చేయనున్న 1,000 మెగావాట్ల విద్యుత్ ధరలకు పాత విధానం ప్రకారమైతే ఛత్తీస్‌గఢ్ ఈఆర్‌సీ నిర్ణయించేది. తాజా సవరణతో ఆ అధికారం సీఈఆర్‌సీ పరమైంది.
* జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు 2022 ఆగస్టు వరకు ‘కాంపిటీటివ్ బిడ్డింగ్’ నిబంధనను సడలిస్తూ తీసుకున్న నిర్ణయం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. భారీ జల విద్యుత్‌ప్రాజెక్టులతో భారీగా గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీంతో పర్యావరణంపైనా దుష్ర్పభావం పడనుంది.
* దక్షిణ-ఉత్తర భారత దేశం మధ్య కారిడార్ సమస్య ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కారిడార్ అభివృద్ధి చేస్తామని నిర్ణయించడం మంచిదే.
* దేశంలో ఇప్పటికే 40 వేల మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టులు విద్యుత్ అమ్ముకోలేక వృథాగా మూలన పడిపోయాయి. ఆ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వారు లేకపోవడం, ధరలు అధికంగా ఉండడం, కారిడార్ లేకపోవడం ఇందుకు కారణం. వీటిని వినియోగంలోకి తీసుకురావడాన్ని పక్కనపెట్టి .. తెలంగాణ, ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను కట్టుకుంటూపోతున్నాయి. వృథా ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టిపెట్టడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం.
* 2022లోగా దేశ విద్యుత్ వినియోగంలో 8 శాతం సౌర విద్యుత్ ఉండాలని లక్ష్యంగాా పెట్టుకోవడం మంచిదే. వాస్తవానికి ఇటీవల కాలంలో సౌర విద్యుత్ ధరలు థర్మల్ విద్యుత్ ధరలతో సమాన స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తగ్గించి సౌర విద్యుత్‌ను పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.