సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు | CAA backlash: Congress Mamata slams Modi government | Sakshi
Sakshi News home page

సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు

Published Mon, Mar 11 2024 9:07 PM | Last Updated on Mon, Mar 11 2024 9:10 PM

CAA backlash: Congress Mamata slams Modi government - Sakshi

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని​ పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.


‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. 


‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం  టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్‌ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్‌ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి  వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు.

ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్‌పీఆర్‌-ఎన్‌ఆర్‌సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement