వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది.
2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు.
ఏమిటీ చట్టం...
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది.
వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది.
► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు.
► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు.
► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి.
► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది.
ఎందుకు వ్యతిరేకత...
ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్‌తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు.
దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు.
దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి.
ముస్లింలలోనూ ఆందోళన...
ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన.
పాకిస్తాన్‌లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి.
సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది.
ఎన్‌ఆర్‌సీ రగడ...
సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment