
కశ్మీర్ నుంచి తిరుపతికి చేరుకున్న గోమాత పాదయాత్ర
గోరక్షణతో భరతభూమి సంరక్షణ, దేశ సుభిక్షత
బాలకృష్ణ గురుస్వామి వెల్లడి
తిరుపతి కల్చరల్: గోరక్షణ, భూ సంరక్షణ, దేశ సుభిక్షతను కాంక్షిస్తూ బాలకృష్ణ గురుస్వామి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోమాతతో పాదయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తొలిత మంగళం రోడ్డులోని బొంతాలమ్మ ఆలయం వద్ద స్థానికులు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సభ్యులు గోమాత పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. గోమాత పాదయాత్ర దారుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ భూ సంరక్షణ గోమాత రక్షణతోనేనని, భరతభూమి రక్షణతో దేశం సుభిక్షతతో వరి్థలిల్లుతుందన్నారు.
గోమాతను సంరక్షించి తద్వారా భారతభూమి సారవంతమైన భూమిగా పర్యావరణం పరిమళించడంతో దేశం, మానవాళి సుభిక్షతగా ఉంటారనే నినాదంతో గోమాతతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పది రాష్ట్రాల మీదుగా 3710 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతికి నగరానికి చేరుకున్నామన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదయాత్రను కన్యాకుమారికి కొనసాగిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం గోమాతను రక్షించాలని కోరుతూ చేపడుతున్న ఈ పాదయాత్ర పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం, అలిపిరి వరకు గోమాత పాదయాత్ర సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment