3లక్షల మందికి..రూ.75కోట్లు బకాయి..!  | Rs 75 crore due to 3 lakh people | Sakshi
Sakshi News home page

3లక్షల మందికి..రూ.75కోట్లు బకాయి..! 

Published Sat, Jan 12 2019 4:30 AM | Last Updated on Sat, Jan 12 2019 4:30 AM

Rs 75 crore due to 3 lakh people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకపు సొమ్ముకు బ్రేక్‌ పడింది. ఎనిమిది నెలలుగా సొమ్ము అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో పాడి రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రోజువారీ పాలకు ఇచ్చే బిల్లుల సొమ్ము కూడా నిలిచిపోయింది. ఒకవైపు ప్రోత్సాహకపు సొమ్ము రాకపోవడం, రోజువారీ పాల బిల్లు కూడా ఇవ్వకపోవడంతో సంక్రాంతికి పస్తులుండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

మొత్తం సొమ్ము రూ. 145 కోట్లు... 
విజయ , ముల్కనూరు , రంగారెడ్డి–నల్లగొండ, కరీంనగర్‌ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 వంతున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఇది అందుతోంది.మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడింటికీ వర్తింప చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు రూ. 75 కోట్లు నిలిచి పోయాయని విజయ డెయిరీకి చెందిన అధికారులు అంటున్నారు.మరోవైపు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు గత నెల (డిసెంబర్‌) ఒకటో తేదీ నుంచి రెగ్యులర్‌ పాల బిల్లు నిలిపివేశారు. ఈ డైయిరీకి సుమారు రెండు లక్షల మంది రైతులు నిత్యం పాలు పోస్తారు. వీరికి చెందిన రూ. 70 కోట్లు రాకపోవడంతో ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక రైతులకు పండుగ లోపు బిల్లు చెల్లించకపోతే పాల కేంద్రాల నిర్వహణ చేయలేమని అక్కడి అధికారులు,యూనిట్‌ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీకి ప్రతిరోజు నాలుగు లక్షల లీటర్లకు పైగా పాలు వస్తోంది. రైతులకు పది రోజులకోమారు ఈ బిల్లు చెల్లిస్తారు. డెయిరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి చెల్లించలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.  

రుణానికి వెనుకంజ... 
గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యే క్రమంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని సర్దుబాటు చేసేవారు. కానీ ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు అందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పాల అమ్మకాల నుంచి బిల్లులు చెల్లించాలని భావిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణం తీసుకోకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు అంటున్నారు. నిధుల కొరత కారణంగా ఈనెల ఉద్యోగుల వేతనాలు కూడా వారం రోజుల తర్వాత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆవు పాల మిక్సింగ్‌తో ఆసక్తి చూపని వినియోగదారులు... 
విజయ డెయిరీకి 90 శాతం ఆవు పాలు, 10 శాతం మాత్రమే బర్రె పాలు వస్తుండటంతో పాలలో పసుపు శాతం అధికంగా కనిపిస్తుండటంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది గమనించిన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఇటీవల సమీక్ష జరిపి బర్రె పాల సేకరణ పెంచాలని కోరినా పురోగతి లేదు. ప్రైవేట్‌ డెయిరీలతో పోల్చితే బర్రె పాలకు గాను రైతులకు ఇచ్చే రేటు తక్కువ ఉండటంతో ఆ పాలు రావడంలేదని ఒక అధికారి అన్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement