
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగాపూర్ మండలం చించోలి (బి)వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం మొదటిది కాగా, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం గమనార్హం. రూ.2.25 కోట్ల అటవీ శాఖ నిధులతో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఏం చేస్తారు?
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్ థియేటర్, డాక్టర్స్ రెస్ట్ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. 2017లో దీని నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment