శేరిలింగంపల్లి బహిరంగ సభలో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ.. అబద్ధాలు చెప్పడంలో వారిద్దరిదీ ఒకటే స్టైల్.. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెబితే, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇవి రెండూ నెరవేరేవి కావు. రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తుంగలోకి తొక్కారు..’’అంటూ ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉంటే 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని అటకెక్కించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, తెలంగాణలో ప్రస్తుతం ప్రతి కుటుంబంపై రూ.2.66 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. సాయంత్రం శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇచ్చిన హామీలేవీ పట్టించుకోని కేసీఆర్ కనీసం.. రాష్ట్ర విభజన హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయారని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వని కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి పెద్ద నోట్ల రద్దు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి అంశంలోనూ బీజేపీకి కేసీఆర్ మద్దతిచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏమీ చేయనప్పుడు కేంద్రానికి ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతిపై ఇంటింటికి వెళ్లండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. కేంద్రంలో రాఫెల్ కుంభకోణంతోపాటు కేసీఆర్ చేస్తున్న అవినీతి, అబద్ధాలపై ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌లో మొదట్నుంచీ ఉండి పోరాటం చేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని, వారినే చట్టసభలకు పంపుతామని చెప్పారు. ఎన్నికల సమయంలో పైనుంచి ప్యారాషూట్లలో వచ్చి టికెట్లు అడిగే వారి సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
విభజన హామీలన్నీ నెరవేరుస్తాం
‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. నా రికార్డు చూడండి.. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా... నేను ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను..’’అని రాహుల్ అన్నారు. ‘‘రుణమాఫీ చేస్తామని చెప్పి కర్ణాటకలో రూ.70 వేల కోట్ల రైతుల అప్పులు రద్దు చేసి చూపించాం. భూసేకరణ చట్టం అమల్లోకి తెచ్చాం. నేను అబద్ధాలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. ప్రధానిలా ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పను. చందమామను భూమిపైకి తెస్తానని చెప్పను. ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రిలాగా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ సభ నుంచి చెబుతున్నా. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. అది ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా అయినా... తెలంగాణకు ఇచ్చిన హామీలయినా.. అన్నింటిని నెరవేర్చి తీరుతాం’’అని స్పష్టం చేశారు.
మోదీ చేసినా చేయకపోయినా ఆ హామీలను నెరవేర్చడం తమ బాధ్యతగా తీసుకుంటామన్నారు. పునర్విభజన హామీలు తెలంగాణ, ఆంధ్రా ప్రజల హక్కు అని, వాటిని కాపాడతామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రేణుకా చౌదరి, మల్లు రవి, వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి భిక్షపతి యాదవ్, రవియాదవ్‌లతో పాటు భారీసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మోదీ.. చర్చకు వస్తావా?
వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు స్కాంపై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. అది పార్లమెంటు ప్రాంగణంలో అయినా.. ఇంకెక్కడయినా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రూ.562 కోట్ల విలువైన విమానాలను రూ.17 వేల కోట్లు పెట్టి ఎలా కొన్నారని పార్లమెంటులో మోదీని అడిగితే దాని గురించి ఒక్క మాటా మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. రాఫెల్ విమానాల ధరలు బయటకు చెప్పకూడదని కేంద్రం చెబుతోందని, దీనిపై తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారన్నారు. దీనిపై పార్లమెంటులో 56 అంగుళాల ఛాతీ ఉన్న కాపలాదారుడిని నిలదీస్తే కనీసం నా కళ్లలోకి చూడలేకపోయారని వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో తొలిసారి పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని, వాస్తవాలను రాసేందుకు కూడా మీడియా వెనుకాడుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment