వేదిక కోసం తండ్లాడుతున్న రాహుల్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అవినీతికి సంబంధించి తన వద్ద పక్కా సమాచారం ఉందని ఆరోపించి సంచలనానికి తెరతీశారు రాహుల్‌గాంధీ. ఇంతకు ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి, దానిని వెల్లడించడానికి రాహుల్ ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారు, అన్న చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా రాహుల్ నాటకీయరీతిలో చేసిన ఆరోపణల గుట్టు తేల్చాలని, ఆ సమాచారమేదో బట్టబయలు చేయాలని ఒత్తిడి తెస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తన వద్ద ఉన్న సమాచారాన్ని బయటపెట్టడానికి సరైన వేదిక కోసం రాహుల్‌గాంధీ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఉన్నత స్థాయి విలేకరుల సమావేశంలో వెల్లడించాలా? లేక ఇతర వేదికలను ఆశ్రయించాలా? అని ఆయన ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పెద్దనోట్ల రద్దుతో మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తనవద్ద ఉండటంతో దానిని లోక్‌సభలో వెల్లడించకుండా అధికారపక్షం అడ్డుకుంటున్నదని రాహుల్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తనను అడ్డుకుంటుండటంతో సభ బయటే ఈ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో తన ముందున్న వివిధ వేదికల్లో దేనిని ఎంచుకోవాలనేది రాహుల్ యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బహిరంగ సభలో వెల్లడించాలా? లేక వివరణాత్మక పత్రికా ప్రకటన చేయాలా? లేక మీడియా సమావేశంలో వెల్లడించాలా? అన్నది రాహుల్ తర్జనభర్జన పడుతున్నారని, అత్యంత ప్రభావవంతమైన వేదిక కోసం ఆయన వెతుకుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.