ప్రతి మహిళ ఖాతాలో 25వేలు వేయాలి!
- నగదు విత్‌డ్రా ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి
- 25లక్షలకు మించి డిపాజిట్ అయిన ఖాతాల వివరాలు వెల్లడించాలి
- ఉపాధి హామీ వేతనాలు పెంచాలి.. పన్నులు తగ్గించాలి
- ప్రధాని మోదీకి రాహుల్ అల్టిమేటం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దారిద్ర రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ ఖాతాలోనూ రూ. 25వేలు డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో నిరుపేద కుటుంబాలే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 131వ స్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. నోట్ల రద్దుకు రెండునెలల ముందే రూ. 25లక్షలకు మించి డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాల వివరాలన్నింటినీ వెల్లడించాలని ప్రధాని మోదీకి అల్టిమేటం జారీచేశారు. నోట్లరద్దు కష్టాలపై ప్రధాని మోదీ చెప్పిన 50రోజుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ముందు రాహుల్ పలు డిమాండ్లు పెట్టారు.
నోట్ల రద్దు నేపథ్యంలో ఉపాధి హామీ వేతనాలు రెట్టింపు చేయాలని, చిన్న వ్యాపారులు, దుకాణందారులకు ఆదాయపన్ను, అమ్మకం పన్నులో మినహాయింపు ఇవ్వాలన్నారు. కేవలం 50 కుటుంబాల కోసమే ప్రధాని మోదీ నోట్లరద్దు యజ్ఞాన్ని చేశారని, ఈ యజ్ఞంలో సామాన్యులే సమిధలుగా మారారని, కాబట్టి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం వెలుగులోకి వచ్చింది? ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోయింది? ఎంతమంది చనిపోయింది? వెల్లడించాలన్నారు. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ పరిమితి రూ. 24 వేలును ఎత్తివేయాలని, విత్‌డ్రాపై పరిమితులు విధించడం ప్రజల ఆర్థిక స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల రైతులు ఎంతోగానో నష్టపోయారు, కాబట్టి రుణాలన్నీ మాఫీ చేయాలని, అంతేకాకుండా కనీస మద్దతు ధరను 20శాతం పెంచాలని రాహుల్ డిమాండ్ చేశారు.