మోదీ ఫ్రెండ్స్‌పై చర్యలేవి?
భివండి: ‘నరేంద్రమోదీ స్నేహితులు వద్ద చాలా నల్లధనం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గడిచిన ఏడాదికాలంలో 15మంది పారిశ్రామికవేత్తలకు చెందిన బ్యాంకు రుణాలు రూ. 1.10 లక్షల కోట్లను మోదీ మాఫీ చేశారని, వారి సాయంతోనే ఆయన దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్రలోని భివండిలో బుధవారం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ ప్రతి పౌరుడి జేబు నుంచి డబ్బులు లాక్కొని.. తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు అందిస్తున్నారు. నల్లధనం కలిగి ఉన్న మోదీ స్నేహితులపైనా చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని రాహుల్ అన్నారు.