ప్రధాని మోదీపై రాహుల్ సంచలన ఆరోపణలు
మెసానా: ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్ బాంబు పేల్చారు. మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. మోదీకి ముడుపులు ఇచ్చినట్టు బిర్లా కంపెనీ కూడా చెప్పిందని రాహుల్ వెల్లడించారు. 2013లో అక్టోబరు 30న 2.5 కోట్లు, అదే ఏడాది నవంబర్ 12న 5 కోట్లు, నవంబర్ 27న 2.5 కోట్ల రూపాయలను బిర్లా కంపెనీ మోదీకి ఇచ్చిందని రాహుల్ చెప్పారు. బుధవారం గుజరాత్‌లోని మెసానాలో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.
అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని రాహుల్ అన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా గాక, పేదలకు, కష్టపడి పనిచేసే వారికి వ్యతిరేకంగా తీసుకున్నదని విమర్శించారు. బ్యాంకు లోన్లు తీసుకుని రైతులు, మధ్య తరగతి ప్రజలు కట్టకపోతే జైల్లో పెడతారని, అదే ధనికులు ఈ పని చేస్తే వాళ్లను డిఫాల్టర్లు అంటారని రాహుల్ అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తామని మార్కెట్‌కు వెళితే వ్యాపారులు చెక్‌లు కానీ కార్డులు కానీ తీసుకోవడం లేదని, నగదు ఇవ్వాలని చెబుతున్నారని ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో రైతులకు అర్థంకావడం లేదన్నారు. డబ్బంతా నల్లధనం కాదని, అలాగే బ్లాక్‌మనీ అంతా నగదు రూపంలో లేదని చెప్పారు. బ్లాక్ మనీ అంతా విదేశాల్లో ఉందని రాహుల్ చెప్పారు. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మోదీ చెప్పారని, ఎంతమంది ఖాతాల్లో ఎంత డబ్బు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.