న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీని పేపీఎం (PayPM) అంటూ అభివర్ణించారు. తన 2-3 బిలియనీర్ స్నేహితుల కోసం ఉద్దేశపూర్వకంగా మోదీ తీసుకొచ్చిన చర్య అంటూ మండిపడ్డారు.
‘చిన్న, మధ్యతరహా వ్యాపారాలను సమూలంగా తుడిచిపెట్టి.. తన 2-3 బిలియనీర్ స్నేహితులకు భారత ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం అందించడం కోసం PayPM ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన చర్య ఈ నోట్ల రద్దు’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు విఫల చర్య అని సమర్థించేలా ఉన్న పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలను ఆ వీడియోలో చూపించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. మరోవైపు.. స్వతంత్ర భారతంలో నోట్ల రద్దు అనేది అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ అంటూ ఆరోపించింది కాంగ్రెస్. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. భారత్‌ను డిజిటల్, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది.
2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది కేంద్రం. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడంతో పాటు అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే నోట్ల రద్దు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలిపింది. అయితే, ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లతో కొత్త గరిష్ఠానికి చేరిందని, ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 72శాతం ఎక్కువని ఇటీవల నివేదికలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Demonetisation was a deliberate move by ‘PayPM’ to ensure 2-3 of his billionaire friends monopolise India’s economy by finishing small & medium businesses. pic.twitter.com/PaTRKnSPCx
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022
ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం?
Comments
Please login to add a commentAdd a comment