అక్కడ మోదీ.. ఇక్కడ మినీ మోదీ | rahul gandhi fires on cm kcr | Sakshi
Sakshi News home page

అక్కడ మోదీ.. ఇక్కడ మినీ మోదీ

Published Sat, May 16 2015 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అక్కడ మోదీ.. ఇక్కడ మినీ మోదీ - Sakshi

అక్కడ మోదీ.. ఇక్కడ మినీ మోదీ

రైతులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పీఎం, సీఎంలపై రాహుల్  ధ్వజం

 
నిర్మల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఢిల్లీలో మోదీ, తెలంగాణలో మినీ మోదీ. దేశ రూపురేఖలను మారుస్తామని ఎన్నికలకు ముందు ఢిల్లీ మోదీ చెప్పారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని హైదరాబాద్ మోదీ(ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉద్దేశిస్తూ) కూడా ఎన్నికలకు ముందు చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే నేను ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని కొరటికల్, లక్ష్మణచాంద, పొట్టుపల్లి, రాచాపూర్, వడ్యాల గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ శుక్రవారం పరామర్శించారు. ఈ గ్రామాల మీదుగా సుమారు 15 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం వడ్యాల గ్రామం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హిందీలో సాగిన రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. దేశాభివృద్ధి కోసం ప్రతి పౌరుడు కృషిచేస్తాడని, రైతులు మాత్రం రక్తమాంసాలను చెమటగా మార్చి దేశానికి తిండిపెడుతున్నాడని రాహుల్ అన్నారు.

తాను ఒక్క రోజే ఎండలో  పాదయాత్ర చేశానని, రైతులు మాత్రం ప్రతిరోజూ మండుటెండల్లోనే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. హరిత విప్లవం తర్వాత వ్యవసాయోత్పత్తి పెరిగినా వాతావరణ మార్పులు రైతులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. విద్యుత్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు వంటి సమస్యలను ఏటా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. యూపీఏ హయాంలో ఆరున్నరకోట్ల మంది రైతులకు రూ.8 లక్షల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందించామన్నారు. అంతకుముందే రూ. 70 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామన్నారు.

రైతు కుటుంబాలకే లబ్ధి కలగాలి
కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన భూ సేకరణ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉందని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ‘భూముల ధరలు పెరిగితే ఆ మేలు రైతు కుటుంబానికే చెందాలి. యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టం రైతులకు ఉపయోగపడే విధంగా ఉంది. రైతు అంగీకారం లేకుండా భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. నిర్దేశించిన అవసరాల కోసం ఐదేళ్లలో వినియోగించుకోకుంటే ఆ భూమిని రైతుకే తిరిగివ్వాలి. భూసేకరణపై సామాజిక తనిఖీ జరగాలన్న పలు నిబంధనలు తాము తెచ్చిన చట్టంలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీయే తెచ్చిన భూ సేకరణ బిల్లులో సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)ని ఎత్తేశారు. 10-15-20 ఏళ్లు ఆ భూమిని వాడుకోకపోయినా పారిశ్రామికవేత్తలకే కట్టబెడతారు.

బలవంతంగా భూమిని తీసుకునేలా రూపొం దించిన బిల్లును ఆమోదింపజేసుకోడానికి ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారు. మీ(రైతుల) కాళ్ల కింద ఉన్న బంగారాన్ని దోచుకోడానికి బిల్లును తెస్తున్నారు’ అని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా సెజ్‌లకు కేటాయిం చిన 40 శాతం భూములు ఇంకా ఖాళీగా ఉన్నాయన్నారు. తనకు సన్నిహితంగా ఉండే కొం దరు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే మోదీ భూసేకరణ బిల్లును తెస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో దేశానికి కాకుండా మోదీకే మంచిరోజులు వచ్చాయన్నారు. 10 లక్షల విలువైన సూటు, బూటు ఒక్క మోదీ మాత్రమే వేసుకుంటున్నారని, అందుకే ఆయన ప్రభుత్వాన్ని సూటు-బూటు ప్రభుత్వం అంటున్నామని రాహుల్ విమర్శించారు.

తెలంగాణలో రుణమాఫీ జరిగిందా అని సభికులను ప్రశ్నించారు. దీనికి లేదు.. లేదు.. అన్న సమాధానం వచ్చింది. ఇక్కడ రుణమాఫీ లేదు, అక్కడ కనీస మద్దతుధర లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతులను పరామర్శించే తీరిక కూడా లేకుండా విదేశీ పర్యటనలో మోదీ, ఆచరణ సాధ్యం కాని మాటలతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రైతుల కోసం పార్లమెంటు లోపలా, బయటా పోరాడుతానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, ఆర్.సి.కుంతియా, రాజ్‌బబ్బర్, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జైపాల్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement