సంపూర్ణంగా విభజించండి
విభజన వివాదాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్
♦ హైకోర్టు అంశంలో చొరవ చూపండి
♦ వాస్తవ పరిస్థితులను కేంద్రానికి నివేదించండి
♦ హరితహారంపైనా చర్చ
♦ నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి.. రేపు అంతర్రాష్ట్రమండలి సమావేశం
♦ ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
♦ విభజన అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనతో పాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు.
గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గవర్నర్‌తో దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమయ్యారు. ఈ నెల 16న ఢిల్లీలో జరగనున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం శుక్రవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు విభజన వెంటనే జరిగేలా చొరవ చూపాలని, వాస్తవ పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని గవర్నర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థలకు సంబంధించిన వివాదాల పరిష్కారం, ఉద్యోగుల విభజనలో జాప్యం తదితర అంశాలతోపాటు ఏపీ ప్రభుత్వం విభజన చట్టాలను ఉల్లంఘిస్తోందని సీఎం గవర్నర్‌కు నివేదించినట్లు తెలిసింది.
విభజన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని, లేకుంటే వివిధ దశల్లో తెలంగాణకు, ఇక్కడి ఉద్యోగులు, అధికారులకు అన్యాయం జరుగుతుందని వివరించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంపై చర్చించారు. స్వయంగా గవర్నర్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ముఖ్యమంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 43 కోట్ల మొక్కలు పెంచటంతో పాటు వాటి సంరక్షణకు చేపట్టనున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.
17న పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశమవుతారు. హైకోర్టు విభజనతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తారు. రాష్ట్ర విభజన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని, తొమ్మిది, పదో షెడ్యూలుకు సంబంధించిన ఆస్తుల విభజనపైనా స్పష్టత ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేయనున్నారు.
వెంటనే హైకోర్టు విభజన ప్రక్రియను చేపట్టాలని కోరుతూ ఇప్పటికే సీఎం కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ భవన్‌ను తెలంగాణకు అప్పగించాలని, రాష్ట్రంలో కరువు తీవ్రతతో నష్టపోయిన మండలాలకు తగిన ఆర్థిక సాయం అందించాలని వరుసగా కేంద్రానికి లేఖలు రాశారు. హైకోర్టు విభజన వివాదాన్ని వెంటనే పరిష్కరించకపోతే ఏకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని సీఎం ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
మూడు రోజుల టూర్
ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరతారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలసి విందులో పాల్గొంటారు. 16న ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ప్రధానితో విడిగా భేటీ అవుతారు. మరుసటి రోజు ఆదివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి హైకోర్టు విభజన అంశాన్ని చర్చిస్తారు.
హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీఎస్ ఠాకూర్‌ను కలుసుకునేలా షెడ్యుల్‌ను రూపొందిం చారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌ను కూడా సీఎం కలుస్తారు. సోమవారం సాయంత్రం వర కు సీఎం ఢిల్లీలోనే ఉండేలా పర్యటన ప్రణాళిక ఖరారైంది. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం వెంట ఉండే ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు సీఎంవో అధికారులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.