గవర్నర్‌కు ఏపీ సీఎం విందు
- అంతకు ముందు హోటల్‌లో ముఖాముఖి
- పలు కీలక అంశాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. గవర్నర్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ స్వాగతం పలికారు. అంతకు ముందు విజయవాడలోని ఓ హోటల్‌లో గవర్నర్‌తో చంద్రబాబు 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురూ ఒకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇటీవల గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు తన నివాసానికి విందుకు రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. దీనికి స్పందించిన గవర్నర్ తాను విజయవాడ వస్తానని హామీనిచ్చారు.
అందులో భాగంగానే చంద్రబాబు నివాసానికి విందుకు వెళ్లారని టీడీపీ, అధికారవర్గాల సమాచారం. వీరిద్దరి విందు భేటీలో తాజాగా ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన కేసు విషయం ప్రస్తావనకు వచ్చింది. తాము ఎలాంటి పొరపాటు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు వివ రించినట్లు సమాచారం. హైకోర్టు విభజన అంశం కూడా వారిమధ్య ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకుసమయం పడుతుందని, మరో ఎనిమిదేళ్లు ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో పనిచేసే అవకాశం ఉన్నందున విభజన అంశాన్ని కొద్ది రోజులు పక్కన పెడితే మంచిదని చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
తాము ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలంటే విభజన చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుందని అన్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రతిపాదించగా తాను ఇద్దరి మధ్య భేటీ జరిగేలా చూస్తానని గవర్నర్ హమీ ఇచ్చినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని, తరువాత మంగళ గిరిలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని సాయంత్రానికి తిరుమల చేరుకుంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు.