హైకోర్టు విభజనే పరిష్కారం
- వాస్తవాలను కేంద్రానికి వివరించండి
- గవర్నర్ నరసింహన్‌కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తక్షణమే హైకోర్టు విభజన చేపట్టేలా వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హైకోర్టు విభజన వివాదం... న్యాయాధికారుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం అరగంట సేపు గవర్నర్‌తో సమావేశమయ్యారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనకు ముందే న్యాయాధికారుల కేటాయింపులు చేయటంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు.
తెలంగాణకు 95 మందిని, ఏపీకి 110 మంది న్యాయాధికారులను కేటాయించగా... తెలంగాణకు ఇచ్చిన 95 మందిలో 58 మంది ఏపీకి చెందిన వారే ఉన్నారని వివరించారు. న్యాయాధికారులు, జూనియర్ జడ్జీలు, సీనియర్ జడ్జీలు.. అన్ని కేడర్లలో ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించినట్లు చెప్పారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణకు చెందిన న్యాయాధికారులు తీవ్రంగా నష్టపోతారని.. అందుకే ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని గవర్నర్‌కు నివేదించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తాను రాసిన లేఖ ప్రతిని, గతంలో హైకోర్టు విభజనను చేపట్టాలని పలుమార్లు కేంద్రానికి రాసిన లేఖలను, ప్రస్తుత వివాదం పూర్వాపరాలపై సిద్ధం చేసిన నివేదికను నరసింహన్‌కు సమర్పించారు.
హైకోర్టు విభజన చేపడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. అప్పటివరకు కేటాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడను కలసిన సందర్భంలో ఆయన గవర్నర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో సంప్రదింపులు జరిపినా.. న్యాయమంత్రి మాట్లాడినా.. వాస్తవాలను వివరించి, హైకోర్టు విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా జంట నగరాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నడం, అనుమానితులను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అదుపులో తీసుకున్న సంఘటనపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.