అ‘సామాన్యులు’ వైఎస్సార్‌సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు.. | YSRCP Candidates Are Financially Very Poor People | Sakshi
Sakshi News home page

అ‘సామాన్యులు’ వైఎస్సార్‌సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు..

Published Thu, Apr 25 2024 3:44 PM | Last Updated on Thu, Apr 25 2024 5:31 PM

YSRCP Candidates Are Financially Very Poor People

సొంత ఇల్లూ, ఎలాంటి నగలూలేని మడకశిర అభ్యర్థి ఈరలక్కప్ప.. శింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పరిస్థితి కూడా ఇంతే 

రంపచోడవరం అభ్యర్థి ధనలక్ష్మి ఆస్తులు రూ.53 లక్షలే 

మైలవరం అభ్యర్థి తిరుపతిరావు ఆస్తి రూ.4.27 లక్షలే.. 

పాడేరు అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు రూ.50.98 లక్షలు 

టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు 

సాక్షి నెట్‌వర్క్‌: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు. దేశంలోనే అపర కుబేర అభ్యర్థు­ల్లోని వారూ ఆ బ్యాచ్‌లో కొలువుదీరారు. ఇలా పెత్తం­దారులంతా ఒక్కటై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి తరఫున రాష్ట్ర ఎన్నికల కదనరంగంలో మోహరించారు. వీరికి దన్నుగా కోటానుకోట్ల సంపద ఉన్న ఐశ్వర్యవంతులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వారి తరఫున రాష్ట్రంలో వాలిపోయారు. వైఎస్సార్‌సీపీ అభిమానులను ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ కుటుంబానికి రూ.3–4 లక్షలు వెదజల్లయినా వారిని లోబరుచుకునేందుకు వీరంతా బరితెగిస్తున్నారు.

కానీ, ఇటుపక్క చూస్తే పేదలకు కొమ్ముకాసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గా సై అంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఈ పార్టీ బలగం. ఈ పార్టీ ఎంపిక చేసిన అనేకమంది అభ్యర్థుల ఆర్థిక స్థోమత కూడా అంతంతమాత్రమే. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులున్న వారేమీ కాదు. కేవలం కోటి రూపాయలు అంతకన్నా తక్కువ ఆస్తి ఉన్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేస్తూ రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరంటే.. 
 
► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్‌ఎల్‌ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్‌లోని వివరాలను పరిశీలిస్తే.. ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.27,883 మాత్రమే ఉంది.

గుడిబండ కెనరా బ్యాంకులో రూ.41, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ.26,950 , అగళి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.11, మడకశిర యూనియన్‌ బ్యాంకులో రూ.881 బ్యాంకు బ్యాలెన్స్‌ మాత్రమే ఉంది. అదే విధంగా అప్పు రూ.1,13,050 ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం రూ.86,100, మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ,26,950 అప్పు ఉంది. రూ.99,883 విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్పపేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో రూ.10 వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఈరలక్కప్ప పేర్కొన్నారు. 

► అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎం.వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. సెంటు స్థలం కానీ, తులం బంగారం కానీ లేదు. నామినేషన్‌లో ఈయన సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యంత పేద అభ్యర్థుల్లో ఒకరన్న విషయం స్పష్టమవుతోంది. ఈయన పేరున విలువైన చరాస్తులు రూ.1,06,478 ఉన్నాయి.

ఇందులో చేతిలో నగదు రూ.50 వేలు, అనంతపురం ఎస్‌బీఐలో రూ.11,193, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (కొత్తూరు బ్రాంచ్‌)లో రూ.10,002 నగదు నిల్వ ఉంది. అలాగే, 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది. దీని విలువ రూ.35 వేలు. ఇక ఆయన భార్య పేరున  శింగనమలలోని కెనరా బ్యాంక్‌లో కేవలం రూ.283 నగదు ఉంది.  

► పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వరరాజు పేరు మీద రూ.20,39,512లు, భార్య పేరున రూ.16,20,320లు, ఇద్దరు పిల్లల పేరున రూ.7,25,927లు, రూ.7,12,606లు కలిపి మొత్తం రూ.50,98,365ల ఆస్తులున్నాయి. రూ.1,20,000 గోల్డ్‌లోన్‌ అప్పు ఉంది. 

► రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి రూ.53,45,321లు. ఈమె చేతిలో ఉన్న నగదు రూ.2,50,000. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నది రూ.23,72,821లు. ఇన్నోవా కారు రూ.11,22,500, బంగారు ఆభరణాల విలువ రూ.16,00,000, బ్యాంకులో అప్పు రూ.1,76,223లు ఉంది. 

► కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి రూ.4,27,066లు. స్థిర, చరాస్తులు రూ.1,89,642లు. తన పేరుతో మైలవరం సెంట్రల్‌ బ్యాంకు అకౌంట్‌లో రూ.88, మైలవరం కెనరా బ్యాంకులో రూ.1000, మైలవరం మండల పుల్లూరు ఎస్‌బీఐ అకౌంట్‌లో రూ.9,823లు.. రూ.73,531 విలువ గల 2016 మోడల్‌ బైకు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల బంగారు ఉంగరం.. చేతిలో క్యాష్‌ రూపంగా రూ.50వేలు ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్‌ బ్యాంకులో రూ.1,624లు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు.. రూ.1,65,600 విలువ గల 24 గ్రాముల బంగారు చైను.. చేతిలో క్యాష్‌ రూపంగా రూ.15వేలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement