
వైఎస్సార్‌సీపీ అభిమానుల్లో సడలని ఆత్మస్థైర్యం
ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా మద్దతు
సోషల్ మీడియా వేదికగా పోటెత్తిన పోస్టులు
టీడీపీ కవ్వింపు చర్యలకు చలించని నాయకులు, కార్యకర్తలు
సాక్షి, అమరావతి: ఏం జరిగిందో.. ఎలా జరిగిందో కూటమి గెలిచింది. వైఎస్సార్‌సీపీ అత్యల్ప స్థానాలనే దక్కించుకుంది. అయితేనేం ఆ పార్టీ క్యాడర్‌లో ఇసుమంత ఆత్మస్థైర్యం కూడా సడలలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం కించిత్తయినా తగ్గలేదు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కోటి ఆశలతో రేయింబవళ్లు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే అర్థమైపోయింది. అయినా ఏ మాత్రం సంయమనం కోల్పోలేదు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చి టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలతో కవ్వింపు చర్యలకు పాల్పడినా చలించలేదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, అధినేత జగన్ ఆదేశం కోసం సాయంత్రం వరకూ ఎదురుచూశారు. సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడాక వారిలో కొండంత ధైర్యం వచ్చింది. ‘ఓడినా.. గెలిచినా ప్రాణం ఉన్నంతవరకూ మా ప్రయాణం నీతోనే జగనన్న’ అంటూ ముక్తకంఠంలో వారు చేసిన నినాదం సోషల్ మీడియాలో మిన్నంటింది. వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల్లో జగన్‌కు అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తాయి.
ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా జగన్, వైఎస్సార్‌సీపీకి అభిమానులు మద్దతు ప్రకటించారు. తమకు పదవులతో పనిలేదని, కడవరకూ మీ వెంటే మేమంతా ఉంటామని కామెంట్లు పెట్టారు. కొందరు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. మరికొందరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోటుపాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటలకు కన్నీళ్లు ఆగడం లేదంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఈ చర్యలతో స్పష్టమైంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వారంతా అండగా నిలవడాన్ని బట్టి సీఎం జగన్ జనం మనసులను గెలుచుకున్నారని రుజువైంది.