వైఎస్ జగన్ పాలన వైపు మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాల మొగ్గు
వైఎస్సార్‌సీపీ తన ఓటు శాతాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కాపాడుకుంది
94 –104 సీట్లు వైఎస్సార్‌సీపీకి.. 71 – 81 సీట్లు టీడీపీ కూటమికి
వైఎస్సార్‌సీపీకి 13–15 ఎంపీ స్థానాలు.. టీడీపీ కూటమికి 10–12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు
బీజేపీ 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 7–8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం
ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా సర్వే రిపోర్టు ఇచ్చానన్న ఆరా మస్తాన్
సాక్షి, నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా సృష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ శనివారం తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 49.41 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 94–104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55 శాతం ఓటు షేర్‌తో 71–81ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లు పడవచ్చన్నారు. లోక్‌సభ ఫలితాలలో వైఎస్సార్‌సీపీ 13–15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10–12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆరా మస్తాన్ ఇంకా ఏం చెప్పారంటే..
షర్మిలకు కనీసం డిపాజిట్ దక్కదు
కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఓడిపోవడంతోపాటు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్సార్‌సీపీ 3 ఎంపీ స్థానాలను కోల్పోతుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో ఓడిపోతున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి గతంలో కంటే కొంత ఓటు శాతం పెరిగినప్పటికీ అధికారం మాత్రం దక్కడం లేదు.
తెలంగాణలో బీజేపీకే ఎక్కువ ఎంపీలు
తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌కు 7–8 ఎంపీలు, ఎంఐఎంకు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం పొందిన బీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు 38.43 శాతం, బీజేపీకి 36.65 శాతం, బీఆర్‌ఎస్‌కు 18.99 శాతం ఓట్లు నమోదవుతాయి. మా సర్వే ఫలితాలు వంద శాతం నిజం కావాలని కోరుకుంటున్నా. గతంలో మా అంచనా ఫలితాలు నిజమయ్యాయి.
ఈసారి కూడా అదే జరగనుంది. పార్టీల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తిని వృత్తిగా భావించి ఫలితాలను వెల్లడించాను. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మార్చడం కొన్ని చోట్ల మేలు చేసింది. పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న జగన్ మాటలు పని చేశాయి. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల పరంగా నష్టపోయినా, పోల్ మేనేజ్‌మెంట్ పరంగా టీడీపీకి ఉపయోగపడింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం కూటమికి ఇబ్బందిగా మారింది.
వైఎస్సార్‌సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన వైపు మహిళలు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలింది. కరోనా వల్ల కొంత సమయం వృథా అయినా, పాలనలో నూతన విధానాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 71 శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందింది. పింఛన్‌దారులు సంతోషంగా ఉన్నారు. మహిళల ఖాతాల్లో ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలి్పంచడంతో రాష్ట్రంలో 56 శాతం మహిళలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారు.
కూటమికి మహిళలు కేవలం 42 శాతం మాత్రమే మద్దతిచ్చారు. పురుషులు కూటమికి 51.56 శాతం, వైఎస్సార్‌సీపీకి 45.53 శాతం ఓటు వేశారు. మహిళలు పురుషుల కన్నా సుమారు 4.7 లక్షల మంది అధికంగా ఓటు వేయడం, అందులోనూ 56 శాతం మంది వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వడంతో మరోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవడంతో 2019లో వచ్చిన ఓటు శాతాన్ని వైఎస్ జగన్ నిలుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment