ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్
డిచ్‌పల్లి: ఉన్నత లక్ష్యంతో పట్టుదలగా ముందుకు సాగితే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తిరుమల ఇనిస్టిట్యూట్‌లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో గొప్ప పేరు సాధించిన ఇంజనీర్లు, నర్సుల జీవితాల గురించి విద్యార్థులకు వివరించారు. సామాన్యురాలైన జిజియాబాయి తన కొడుకు శివాజీకి చిన్నతనం నుంచి ఇచ్చిన స్ఫూర్తి, నేర్పిన విద్యల ద్వారా ఆయన చక్రవర్తి స్థాయికి ఎలా ఎదిగారో వివరించారు.
పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యమైనా అందుకోవచ్చని సూచించారు. విద్యార్థులుగా ఉన్నప్పుడే ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నారు. జీవితంలో ఏదైనా సాధించి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయమూర్తి షమీం అక్తర్ మాట్లాడుతూ నర్సింగ్ విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు రోగులకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు.