అన్ని దానాల కంటే గొప్పదానం అన్నదానం కాదు విద్యాదానం అనే చెప్పాలి. మొత్తం సమాజ శ్రేయస్సు, అభివృద్ధి ఒక్క విద్య, విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలను, మానవ సంబంధాలను గురించి అవగాహన కలుగని రీతిలో విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్‌లెట్లు లేకపోవడమే అంటే మన దేశంలో ఈనాటికీ బాలికా విద్యకు ఎన్ని ఆటంకాలున్నాయో అర్థమవుతుంది.
సమాజ శ్రేయస్సు విద్యా విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. అన్నిటి కంటే గొప్పదానం విద్యాదానం. విద్య విద్యార్థి మనసును వికసింపచేయాలి. సత్యాన్ని శోధించేటట్లు, తెలుసుకునేటట్లు చేయాలి. విద్యార్థుల ఆలోచనలను సరైన దిశలో పెంపొందేటట్లు చేయాలి. విద్య, విద్యార్థులను మానసికంగా, శారీరకంగా దృఢమైన వారిగా తయారు చేయాలి. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలు, మానవ సంబంధాలు లేకుండా విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు.
ప్రభుత్వం సమాజ అవసరాలను అంచనా వేయాలి. ప్రస్తుతానికి, కనీసం ఇంకా 5 ఏళ్ళ వరకు ఎంత మంది డాక్టర్లు కావాలి? ఎంత మంది నర్సులు కావాలి, ఎంత మంది వ్యవసాయ అధికారులు, ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఇలా ఒక స్పష్టమైన ముందు చూపు ఉంటే, సమాజ అవసరాలను పూర్తి చేయడానికి ఇప్పుడున్న పాఠశాలలు, సాంకేతిక కళాశాలలు సరిపోతాయా, ఇంకా అదనంగా పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక కళాశాలలను నెలకొల్పాలా?అనే వివరాలు తెలుస్తాయి.
నేటి బాలబాలికలే మన రేపటి భవిష్యత్తు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. అవసరమైతే ముఖ్యమైన పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్ని అమ్మి అవసరమైన డబ్బు సేకరించాలి. ఆర్థిక నిపుణులతో చర్చించి ప్రజలకు లాభం కలిగేటట్లు, ఏ చర్యల వల్ల ఆదాయం సమకూరుతుందో నిర్ణయించి కచ్చితమైన చర్యలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇలా వచ్చిన ఆదాయంలో అత్యధిక శాతం పేద విద్యార్థులకు విద్య కోసం, హాస్టల్ సౌకర్యాల కోసం వినియోగించాలి. పేదవారైనప్పటికీ తమ పిల్లలను చదివిం చాలని అనేకమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి ఆదాయంలో ఎంతో భాగం పిల్లల విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. ఉన్నత విద్యను అందించడానికి విదేశాలకు పంపడానికి ఆస్తులు అమ్ముకున్నవారు ఉన్నారు.
అందుకనే ప్రభుత్వాలు చేయాల్సిన తక్షణ కర్తవ్యాలను సూచిస్తున్నాను. పాఠశాలలు లేని గ్రామాలను, తండాలను గుర్తించి ఆ గ్రామాలలో, తండాలలో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో కాలేజీల్లో కనీస వసతులు కల్పించడం, టాయ్‌లెట్ సౌకర్యాలను కల్పించడం, టాయ్‌లైట్ల నిర్వహణ ఖర్చు లేకుండా ఆధునిక పద్ధతిలో లేదా నిరంతరం శుభ్రపరిచే విధంగా టాయ్‌లెట్లను ఏర్పరచాలి. (అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్‌లెట్లు లేకపోవడమే). ప్రభుత్వ పాఠశాలలో, హైస్కూళ్లలో, కాలేజీల్లో అవసరమైన మరమ్మత్తులు చేయించాలి. అవసరమైన చోట అదనపు గదులు నిర్మించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ఆవరణలో మొక్కలు నాటేటట్లు చేయాలి. ప్రతి స్కూలుకు, హైస్కూళ్లకు, కాలేజీలకు ఆట స్థలాలు ఉండాలి. వీలైనంత త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను, లెక్చరర్ల, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి.
ప్రతీ స్కూళ్లో/ కాలేజీల్లో ఉదయం టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. (ఎందుకంటే అనేక మంది పేద పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే స్కూలుకు వస్తారు. మధ్యాహ్న భోజనం కోసమే వచ్చేవారు కూడా ఉన్నారు.) వీలైతే సాయంత్రం పూట తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఎత్తూ బరువు తక్కువ. ఇవి సాధారణంగా పేద పిల్లల్లో కనబడతాయి. విచారణ జరిపి శాంపిల్ లెక్కలు తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఇంగ్లిష్ మీడియంకు లేదా ఇంగ్లిష్ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే పిల్లలు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగాలి. కంప్యూటర్ విద్య, అధునాతన టెక్నాలజీ విద్యార్థులకు అందేటట్లు చూడాలి. ఒకసారి ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మధ్యతరగతి వారు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివించాలన్న వాతావరణం ఏర్పడాలి.
బాగా పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కలిగించే విధంగా సర్టిఫికెట్లు, బహుమతులు, ఆర్థిక రివార్డులు ఇవ్వాలి. 3 సం‘‘ల వరకు ప్రతీ సంవత్సరం వరుసగా మంచి రికార్డు సాధించిన ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. వీలైనన్ని చోట్ల ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహించాలి. అత్యంత పేద కుటుంబాల నుండి వచ్చిన వారు కష్టపడి ఎలా ఉన్నతస్థాయికి వెళ్ళారో ఉదాహరణలతో వివరించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై పట్టు త్వరగా రాదు. వారికి ప్రత్యేక కోచింగ్‌లు ఏర్పాటు చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ హాస్టళ్ళను ఏర్పాటు చేసి ఏ పేద విద్యార్థి, పేదరికం కారణంగా, తిండికి లేక, కనీస అవసరాలు తీరక విద్యను మధ్యలో ఆపేసే పరిస్థితి ఉండని విధంగా చూడాలి. అటువంటి పేద కుటుంబాల వారికి వారి పిల్లలను మధ్యలో బడి మాన్పించి ఏదో పనిలో పెట్టకుండా కొంత ఆర్థిక ప్రోద్బలం ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను గుర్తించి, వారిలోని ప్రావీణ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలి. ఒక విద్యార్థి పాడగలిగే వాడైతే అతనికి సంగీత విద్యను అందించే ఏర్పాటు ఉండాలి. వ్యాసరచన, ఉపన్యాస మొ‘‘ పోటీలను నిర్వహించాలి. కథలు, కవితలు వ్రాసేవారిని ప్రోత్సహించాలి. ఇవన్నీ ఇప్పుడే చేయడం సాధ్యంకాక పోవచ్చు. కానీ గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనకు మార్గాలను రూపొందించుకొని పట్టుదలగా ముందుకు సాగితే అనుకోని సహాయం అందుతుంది. ఆదా యం తక్కువగా ఉన్నదనే కారణంతో ప్రజలకు అందించాల్సిన విద్యా వైద్య సహకార విషయాల్లో వెనుకడుగు వేయగూడదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయం పెంచుకోగలిగితే అన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయాన్ని పెంచుకోవాలి. భయం, పిరికితనమే అన్ని అనర్థాలకు కారణం. భగవంతుని సహాయం మనకు అందుతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి.
జస్టిస్ బి. చంద్రకుమార్
వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి
మొబైల్ : 89783 85151
Comments
Please login to add a commentAdd a comment