వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి.
‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది.
ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి.
– సాక్షి, అమరావతి
నాలుగేళ్లలోఎంత తేడా!
నాడు
విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.
నేడు
ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక.
విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు.
ఆ తర్వాత కిచెన్‌షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు.
అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక
పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు.
ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది.
బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు
వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది.
కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment