
జాతిహితం
2014 తరువాత రాజకీయాలు మైనారిటీ ఓటు పరిమితులను బహిర్గతం చేశాయి. అలాగే దీనినే సెక్యులర్ ఓటుకు పర్యాయపదంగా పరిగణించే తెలివిమాలిన తనం కూడా మొద లైంది. ముస్లిం ఓట్లే తమకు విజయాన్ని చేకూర్చి పెట్టలేవన్న వాస్తవం నిన్నటి కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే వారు విస్తృత స్థాయిలో ప్రధానమైన కులాలతో, సామాజిక సమూహాలతో సంబంధాలు నెరపేవారు. ఇప్పుడు ఈ సంకీర్ణాలు బద్దలయ్యాయి. మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాలలో ఉన్న అగ్రకులాలను బీజేపీ తన పరం చేసుకుంది.
ఈ మధ్య జరిగిన ‘ఇండియా టుడే’ పత్రిక సమావేశంలో సోనియా గాంధీ ఒక మాట అన్నారు. ముస్లిం పార్టీగా ముద్ర పడడం వల్ల కాంగ్రెస్ మూల్యం చెల్లించవలసి వచ్చిందని ఆమె అన్నారు. దీనితో భారతీయ ముస్లింలు, వారి సంస్కృతి, రాజకీయాలు, వీటి పట్ల సాధారణ ప్రజల స్పందన ఎలా ఉన్నది అనే అంశాల గురించి చర్చకు తెర లేచింది. మేధావులు ఈ అంశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో హర్ష్ మందిర్, రామచంద్ర గుహ వంటి వారి స్పందనలు వెలుగు చూడడం ఇందులో భాగమే. మనం ఈ వ్యాఖ్య వెనుక రాజకీయ అర్థాన్ని శోధించవలసి ఉంది.
నిజానికి ఈ వాదనను సంస్కృతి, జీవనశైలి, మత చిహ్నాలు– ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముస్లింతనం’ అనే అంశానికి కనుక పరిమితం చేస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది. ముస్లింలు కావచ్చు, లేదా ఇతర మత విశ్వాసాలు కలిగిన వారు ఎవరైనా కావచ్చు, వారు కోరుకున్న మేరకు చిహ్నాలను ఎంచుకోవచ్చు. అయితే ఈ చిహ్నాలే వారికి రాజకీయ సాధి కారతను కల్పిస్తాయా? ఇదొక ప్రశ్న. తన పార్టీ చర్యలు, ముస్లింల బుజ్జగింపు గురించి అధిక సంఖ్యాకులైన హిందువులలో భయాలు పెంచడానికీ, హిందువులకు సాధికారత లేకుండా చేయడం గురించీ బీజేపీ ప్రచారం తోడ్పడడం, ఉగ్రవాదం ఇలాంటివన్నీ సోనియా గాంధీ పశ్చాత్తాపంలో కనిపిస్తాయి. తప్పో ఒప్పో – 2014 నాటికి ఆ దృశ్యం ఒక వాస్తవమే.
తాము తీసుకున్న గోతిలో తామే...
విస్తృతంగా ఉన్న మెజారిటీ హిందువులు మైనారిటీల పట్ల ఆందోళన పడడమనే అసంబద్ధ వైఖరి 1989 మండల్–మందిర్ దశ నుంచి భారతదేశంలో కనిపిస్తుంది. ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్ రాజేసినదేనని మరోసారి నిరసన ప్రకటించవచ్చు. మరొకవైపున మీకూ నిరసన సెగ తగులుతుంది. ఇదంతా రాజకీయం. ఒకవైపున మైనారిటీల అభద్రతా భావాన్ని వాడుకుంటూ ఉంటే, మరొకవైపు అదే నిజమని భావించేటట్టు మెజారిటీని నమ్మిస్తారు. 1985లో షాబానో తప్పిదం బద్దలయ్యేవరకు కాంగ్రెస్ ఒక వైపున నిలబడి ఈ క్రీడను చాలా తెలివిగా సాగించింది. అంతదాకా కాంగ్రెస్‌కు వెన్ను దన్నుగా ఉన్న విశాల హిందూ మెజారిటీ ఓటర్ల దగ్గరకు వెళ్లడానికి ఇదే పరిణామం బీజేపీ/ఆరెస్సెస్‌లకు మార్గం చూపించింది.
దీని ఫలితం ఏమిటంటే, అప్పటి నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ముస్లిం ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో (పదిశాతానికి మించి) ఉన్న రాష్ట్రాలలో అయినా మళ్లీ అధికారంలోకి రావ డానికి, పూర్వ వైభవం సాధించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తంటాలు పడు తూనే ఉంది. తాను మాట్లాడుతున్న విషయం ఏమిటో సోనియాగాంధీకి తెలుసు. క్రూరమైన మైనారిటీ వాదాన్ని పట్టుకున్నందువల్ల ఆమె పార్టీ దారుణమైన మూల్యం చెల్లించింది. అయితే ఇందులో చేదు నిజం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వాదం వల్ల ముస్లింలకు ఒనగూడిన ప్రయోజనం ఏమీ కనిపించదు. దీనిని వారు కపటత్వం అద్దాల నుంచి చూశారు.
కలకాలం మోసగించలేరు కదా!
ఈ పరిణామాన్ని ఒక ముస్లింగా గమనించండి! ఒక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌ను జరిపిస్తుంది. ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించిన అధికారికి మరణానంతర పురస్కారంగా అశోక చక్ర కూడా ఇప్పిస్తుంది. ఆ తరువాత పెద్ద గొంతు ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్‌కౌంటర్ నకి లీదని ఆక్రోశిస్తాడు. అంతేకాదు, ఈ పరిణామం సోనియాను కంటతడి పెట్టించిందని చెబుతారు. యూపీఏ–1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్)ను రద్దు చేస్తుంది. ఎందుకంటే ఆ చట్టం ముస్లింలను బలి పశువులను చేస్తున్నదని చెబుతారు.
తరువాత ఆ చట్టానికే కొన్ని మార్పులు చేస్తారు. అది పాత చట్టం రద్దును మాయం చేస్తుంది. ఆ ప్రభుత్వమే సచార్ కమిటీని నియమిస్తుంది. కానీ ఆ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో విఫలమవుతుంది. వీటన్నిటినీ తలదన్నేది మన్మోహన్ సింగ్ ప్రకటన. అదేమిటంటే, జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలదేనని ఆయన అంటారు. ఇది పైకి ఆదర్శవంతంగా కనిపించవచ్చు. కానీ రాజకీయంగా తప్పిదం. ఉద్యమకారుల మాదిరిగా మాట్లాడడం లేదా, వ్యవహరించడం రాజకీయవేత్తలకు సాధ్యం కాదు. ఇలాంటి ప్రకటన కూడా యథాప్రకారం అమలుకు నోచుకోదు. కాబట్టి ఇదంతా బూటమని ముస్లింలు భావించక తప్పదు.
తప్పుడు రాజకీయాల ఫలితం
అలాగే హిందువుగా కూడా ఈ పరిణామాన్ని గమనించండి! ఇదంతా ఎంత ప్రమాదకర మైనారిటీ బుజ్జగింపు ముఠా? ఉగ్రవాదులను వాళ్లే హత మారుస్తారు. వారు బలైపోతున్నారని అదే నోటితో మళ్లీ అంటారు. ఇదంతా ఓట్ల కోసమే. ఈ భాగోతం ఇంక చాలు అనిపిస్తుంది. దీనితో కాంగ్రెస్ రెంటికీ చెడిన రేవడి అయింది. ముస్లింలందరూ బలంగా ఉన్న స్థానిక నాయకుల వెనుక చేరిపోయారు. సోనియా గాంధీ చెప్పినట్టు కాంగ్రెస్‌ను హిందువులు ముస్లిం పార్టీగా పరిగణించారు. కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి తోడు ఈ తప్పుడు రాజకీయంతో వచ్చిన మరొక వాదన కూడా ఉంది. ముస్లింలను రాజకీయ హక్కుకు దూరంగా నెట్టివేయడమన్న వాదన అది.
భారత రాజ కీయ చరిత్రలో ఇలాంటి సందర్భం ఏదీ ఇంతకు ముందు లేదు: లోక్‌సభలో మెజారిటీ పార్టీ తరఫున ఒక్క సభ్యుడు కూడా లేరు. కేంద్రంలో ఎలాంటి కీలక మంత్రిత్వ శాఖలోను (కేంద్ర మంత్రిమండలిలో ఉన్న ఏకైక ముస్లిం– మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక్కరే) వారు లేరు. ఏ కీలక మంత్రిత్వ శాఖలోను కార్యదర్శి స్థాయి అధికారిగా కూడా వారు కనిపించరు. రక్షణ, నిఘా వ్యవస్థలలోని ఏ రకమైన ఉన్నత స్థానంలోను వారికి స్థానం లేదు. అలాగే జమ్మూకశ్మీర్‌లోని మాయా సంకీర్ణ ప్రభుత్వానికి తప్ప, దేశంలో ఎక్కడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో 20 శాతం ముస్లింలు ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దించకుండా బీజేపీ 80 శాతం సీట్లను సొంతం చేసుకుంది.
నిన్నటి తరం కాంగ్రెస్ నేతల దృష్టిలో...
ఇదంతా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు. ముస్లింలలో నెలకొన్న భయం ముస్లిం నాయకులు అసదుద్దీన్ ఒవైసీ, బద్రుద్దీన్ అజ్మల్ వంటివారి విన్న పాలలో బయటపడుతూ ఉంటుంది. అయితే భారత్–పాక్ విభజన నుంచి కనిపిస్తున్న ధోరణికి ప్రస్తుత వాతావరణం చాలా భిన్నమైనది. ఇంతకు ముందు రాసిన జాతిహితం శీర్షికలో (2015, నవంబర్, 13) దానిని పేర్కొ న్నాను. జిన్నా భారతదేశాన్ని వీడి వెళ్లిపోయిన తరువాత, భారత ముస్లింలు ఎవరూ కూడా తమ నాయకునిగా పొరుగు ముస్లింను నమ్మడం లేదు. అంతకంటే ఒక హిందువును విశ్వసిస్తున్నారు. 2014 తరువాత రాజకీయాలు మైనారిటీ ఓటు పరిమితులను బహిర్గతం చేశాయి.
అలాగే దీనినే సెక్యులర్ ఓటుకు పర్యాయపదంగా పరిగణించే తెలివిమాలినతనం కూడా మొద లైంది. కేవలం ముస్లిం ఓట్లే తమకు విజయాన్ని చేకూర్చి పెట్టలేవన్న వాస్తవం నిన్నటి తరం కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. అందుకే వారు విస్తృత స్థాయిలో ప్రధానమైన కులాలతో, సామాజిక సమూహాలతో సంబంధాలు నెరపేవారు. ఇప్పుడు ఈ సంకీర్ణాలు బద్దలయ్యాయి. మధ్య భారతదేశం లోను, పశ్చిమ రాష్ట్రాలలో ఉన్న అగ్రకులాలను బీజేపీ తన పరం చేసుకుంది. బీజేపీని కూడా నిలువరించడానికి చాలినన్ని కులపు ఓట్లు ఉన్న ఓబీసీ నేతల వెనుక ముస్లింలు చేరిపోయారు. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారని, అందుకే వారు ప్రభుత్వం ద్వారా దేశాన్ని ఏలుతున్నారని గతంలో బీజేపీ తీవ్రంగా ఆరోపించేది. అయితే అదే పార్టీకి చెందిన మోదీ–షా ద్వయం దీనిని తారుమారు చేసింది. అంటే చాలినంత మంది హిందువులను వెనుక ఉంచు కోగలిగితే ముస్లింలను పట్టించుకోనక్కరలేదు. సెక్యులరిజం, మైనారిటీ ఓటు తమ రాజకీయాలను మళ్లీ దారిలో పెడతాయని చెప్పుకునే వారు ఉన్నం తవరకు ఇది మారదు. మెజారిటీల దన్ను సాధించేవరకు వారికి ఎలాంటి అవకాశం ఉండదు.
అందరి అండతోనే గెలుపు సాధ్యం
కాబట్టి ఇప్పటి చర్చ బురఖా, హిజబ్, ముస్లింల టోపీ, గెడ్డాలు, తలాక్ లేదా హజ్ రాయితీ గురించి కూడా కాదు. దీనివల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. ఇది ముస్లింలలోని పీడన భావాన్ని పెంచవచ్చు. ఇంకా సెక్యులర్ పార్టీలలోని గందరగోళాన్ని, తమను చూసి తాము జాలి పడే పరిస్థితిని పెంచవచ్చు. ఇలాంటి వారంతా తమ రాజకీయ విధానం నుంచి వారికి వారే బయ టపడకపోతే అదే గతి తప్పదు కూడా. వారు బతికి బట్టకట్టడం కష్టం.
ఉదారవాద భావాలున్న కొన్ని ప్రాంగణాలు, గోష్టుల బృందాలు, అభిప్రాయ తయారీ కేంద్రాలు దీనిని నిరోధించవచ్చు కానీ, జాతీయ రాజకీయాల విషయం వరకు మోదీ, షా ద్వయం సెక్యులరిజాన్ని పునర్ నిర్వచించిందన్న మాట నిజం. ఏదైనా ఒక పార్టీ, అంటే కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే అది యూపీఏ హయాంలో వామపక్షాలు తీసు కువెళ్లిన కేంద్రబిందువు దగ్గరకు కాదు, అసలైన సెక్యులర్ కేంద్రబిందువు దగ్గరకు చేరడం అవసరం. ఇష్టం ఉన్నా లేకున్నా రాహుల్‌గాంధీ ఆలయాల సందర్శన ఇచ్చే సందేశం ఇదే. కాంగ్రెస్‌ను ప్రజలు ముస్లిం పార్టీగా చూశారంటూ సోనియా వ్యక్తం చేసిన భావంలోని సందేశం కూడా అదే.
- శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment