ఎదురుదాడిలో మమతే సరిజోడీ | Shekhar Gupta Article On Mamata Banerjee | Sakshi
Sakshi News home page

ఎదురుదాడిలో మమతే సరిజోడీ

Published Sat, May 4 2019 1:29 AM | Last Updated on Sat, May 4 2019 1:29 AM

Shekhar Gupta Article On Mamata Banerjee - Sakshi

ఈ దఫా సార్వత్రిక ఎన్నికల ప్రచారం  అన్ని విషాల్లో కంటే భయంకరమైన విషంగా మారుతోందంటే కారణం బీజేపీ నిందాత్మక ప్రచారమే. కాంగ్రెస్‌ పార్టీ తన ప్రత్యర్థిగా బరిలో ఉన్న పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎదురుదాడే లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. కానీ మోదీ–షాల ఈ నిందాత్మక ప్రచార శైలి పశ్చిమబెంగాల్‌లో మమతా దీదీ ముందు పనిచేయడం లేదు. కారణం మోదీ–షాలకు మల్లే అసలైన వీధిపోరాట యోధురాలు మమత. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్, ప్రియాకలతో సహా ఏ ఒక్క నేత కూడా స్ట్రీట్‌ ఫైటర్‌ కాదు. అందుకే తన బెంగాల్‌ గురించి, తన గురించి మోదీ–షా ద్వయం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మమత అంతే స్థాయిలో సవాలు విసురుతున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలి... వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నది మన సమాజంలో బాగా వ్యాప్తిలో ఉన్న సామెత. దీన్ని విషానికి విషమే విరుగుడు అని కూడా మీరు ఇంకాస్త పొడిగించి చెప్పవచ్చు. అయితే ప్రస్తుత ఎన్నికల ప్రచారం అన్ని విషాల్లో కన్నా భయంకరమైన విషంగా ఉంటోందని మనం చెప్పుకుంటున్నందున పై సామెతల్లో మూడోది మరింత సందర్భోచితంగా ఉండవచ్చు. ఈ విషప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ తనదైన భూమికను ఏర్పర్చిపెట్టారు. ప్రత్యర్థులను నిదించడంలో ఆయన సాధించిన ఈ విశిష్టతను ఏ ఒక్కరూ తోసిపుచ్చలేరు. ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులనీ, పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యారని, వారసత్వ కుటుంబాలు బెయిల్‌పై ఉంటూ త్వరలో జైలుకు వెళ్లనున్నారనీ.. ఇలా మోదీ దేన్నీ వదిలిపెట్టలేదు. కాగా మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. వీరిలో ఒకరు ముస్లిం శరణార్థులను చెదపురుగులుగా వర్ణిస్తే, మరొకరు బజరంగబలి వర్సెస్‌ ఆలీ మధ్య పోలిక తెచ్చి విషం చిమ్ముతారు.

దేశంలోని విస్తృత ప్రాంతాల్లో, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఈ తరహా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ కూడా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ  ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉన్న  అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఈ పంథానే సాగిస్తోంది. తనపై ఈ ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ దీటుగానే ఎదుర్కొంటోంది. ఇందిరా గాంధీ పాకిస్తాన్‌నే రెండు ముక్కలు చేసి ఉండగా మా కుటుంబ దేశభక్తిని ఎలా శంకిస్తారు? మా నాన్న, మా నాన్నమ్మ ఇద్దరూ ఉగ్రవాదుల చేతిలో బలైనప్పుడు మేం ఉగ్రవాదం పట్ల మెత్తగా వ్యవహరిస్తున్నారని ఎలా ఆరోపించగలరని రాహుల్‌ బీజేపీని నిలదీస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ వాదనలో ఆత్మరక్షణ ధ్వనిస్తోంది. పైగా దాని శ్రుతి కూడా సరిగా లేదు. ఎందుకంటే విషాన్ని కొబ్బరినీటితో కడిగేయలేం కదా. దేశం మొత్తం మీద ఎక్కడా జరగనంత హింసాత్మకమైన ఎన్నికల ప్రచారం పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది. మాటల తూటాలు, భౌతిక దాడులు అక్కడ సహజమైపోయాయి. మోదీ, షాలు  తనపై చేస్తున్న విమర్శలకు మమతా బెనర్జీ ఏ సందర్భంలోనూ వెనుకడుగు వేయలేదు. మీరు ఆమెను పరిహసిస్తే, ఆమె మిమ్మల్ని అదే స్థాయిలో హేళన చేస్తారు.

మోదీ, షాల బీజేపీ బెంగాల్‌ని గత అయిదేళ్లుగా లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. అధికార సాధనకు హిందూ–ముస్లింల విభజనే వారికి ఆధారం అయితే, ఉత్తరప్రదేశ్‌ కంటే బెంగాల్‌ వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అస్సాంలాగే బెంగాల్లోనూ ముస్లిం జనాభా 30 శాతం మేరకు ఉంది. అస్సాంలో కాంగ్రెస్‌లాగే పశ్చిమబెంగాల్లోనూ పాలకులు మొదట వామపక్షాలు, ప్రస్తుతం మమతా బెనర్జీ ముస్లింలను ఓట్ల కోసం దువ్వుతున్నారని, బుజ్జగిస్తున్నారనే అభిప్రాయం ఆ రాష్ట్రంలో ఉంది. అస్సాంలో ఇది బీజేపీకి విజయం సాధిం చిపెట్టినప్పుడు, బెంగాల్‌లోనూ ఇది పనిచేస్తుంది. అందుకే బీజేపీ నాయకులు పశ్చిమబెంగాల్‌లో ఈ దఫా ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లకు గాను 22 స్థానాలను కొల్లగొడతామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారు.

2014లో తనకు అత్యధిక మెజారిటీని ఇచ్చిన ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఈసారి తనకు కలగనున్న నష్టాలను పశ్చిమబెంగాల్‌లో అధిక విజయాల ద్వారా పూడ్చుకోవచ్చన్నది బీజేపీ అంచనా అయితే పార్టీ ఈ అంశాన్ని పునరాలోచించుకోవాలి. బెంగాల్లో ప్రధాని మోదీ ర్యాలీలు ఉత్సాహకరంగానూ, భారీస్థాయిలోనూ సాగుతున్నది నిజమే. కానీ బీజేపీకి ఈ రాష్ట్రంలో పునాది తక్కువగా ఉన్నందున సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించడం అనేది కాంచన్‌జంగా పర్వతాన్ని ఎక్కినంత పనే అవుతుంది. ఎన్నికల ప్రచారంలో షాక్‌ కలిగించి భయపెట్టే తరహా బీజేపీ ఎత్తుగడల పట్ల మమత ఏమాత్రం జంకడం లేదు. కారణం రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్‌ నేతల్లాగా కాకుండా.. మమత నిజమైన వీధి పోరాట యోధురాలు. వామపక్ష నిర్బంధ శిబిరంగా ఉన్న రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటంలో గెలిచి వచ్చిన మమత, ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే కళలో ఆరితేరిపోయారు. దుర్గా పూజ జరుపుకోవడం కూడా బెంగాలీలకు కష్టంగా మారిపోయిందంటూ మోదీ మమత పాలనపై ఆరోపిస్తున్న సందర్భంలోనూ ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. ఆమె తాజా ఎన్నికల ప్రచార ర్యాలీలలో ఒకదాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ‘కొల్‌కతా శివారులోని భటాపరా (బారక్‌పూర్‌), రాజర్హాట్‌ ప్రాంతాల్లో దుర్గామాతకు పూజలు సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. మోదీ బాబూ, మా బెంగాలీల ఎదుట అలా గొంతు చించుకునే ముందు కాస్త హోమ్‌ వర్క్‌ సరిగా చేసుకుని రండి’ అని మమతా మాట్లాడుతుంటే క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా అంత వేగంగా మాట్లాడలేడనిపిస్తుంది. 

‘హోమ్‌ వర్క్‌ చేయకుండానే పాఠశాలకు వెళ్లినప్పుడు టీచర్లు కూడా పిల్లలను మందలిస్తారు. మరి మీరు పచ్చి అబద్ధాలు చెబుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీరు బెంగాల్‌ వచ్చి ఇక్కడి ప్రజల ముందు నిల్చుని మీ రాష్ట్రంలో దుర్గా పూజలు జరగడం లేదని చెప్పండి చాలు...’ అంటూ మమతా వేదికలపై ఆవేశంగా మాట్లాడుతూ ‘మీరే చెప్పండి అమ్మలారా, అక్కలారా.. మనం దుర్గాపూజలు చేస్తున్నామా లేదా’ అంటూ నేరుగా తన సభలకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తుండగా జనం ‘అవును, పూజలు చేస్తున్నాం’ అంటూ వంతపాడుతున్నారు. దుర్గా పూజ చేయకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా.. గట్టిగా చెప్పండి అంటూ మమత అడుగుతున్నప్పుడు జనం లేదు లేదు అంటూ ముక్తకంఠంతో సమాధానమిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో లక్ష్మీపూజ, సరస్వతీ పూజ, క్రిస్టమస్‌ పర్వదినం, రమజాన్, చాట్‌ పూజ అన్నీ చేసుకుంటున్నాం కదా అని రెట్టించి అడుగుతుంటే జనం వంతపాడుతున్నారు. అందుకే బెంగాల్‌లో మోదీ మాటలు, బీజేపీ అసత్యాలు పనిచేయడం లేదు. వ్యక్తుల శీలహరణం చేసే దాని ఎత్తుగడలు పనిచేయడం లేదు అంటూ మమత స్పష్టత నిస్తున్నారు. 

అందుకే మీరు హోమ్‌ వర్క్‌ సరిగా చేయండి. దాన్ని మీ టెలిప్రాంప్టర్‌లో పొందుపర్చండి. అప్పుడే మిమ్మల్ని మీరు మూర్ఖులుగా ప్రదర్శించుకోలేరు మోదీ బాబూ అంటూ మమత హేళన చేస్తున్నారు. రాహుల్‌ను షాజాదా అంటూ మోదీ పరిహసిస్తున్న దానికంటే, మోదీని దొంగ అని రాహుల్‌ ఎద్దేవా చేస్తున్నదానికంటే మమత వందరెట్లు ఎక్కువగా మోదీ పనిపడుతున్నారు. మోదీకి అసలు సరస్వతీ మంత్రం అనేది ఒకటుం దని తెలుసా, దాన్ని సంస్కృతంలో జపిస్తారని తెలుసా అంటూ ఆమె దాడి చేస్తుంటే బహిరంగ సభలకు హాజరవుతున్న వందలాది ముస్లింలు సంతోషంతో పొంగిపోతుంటారు.

ఆ వెంటనే మమత ఆహార వైవిధ్యం గురించి ప్రస్తావిస్తారు. ‘మోదీ బాబూ, మేం గుజరాత్‌ వచ్చినట్లయితే డోక్లా ఆరిగిస్తాం, తమిళనాడులో ఇడ్లీ, కేరళలో ఉప్మా, బిహార్‌లో లిట్టీ–చొఖ్కా, గురుద్వారాలో హల్వా, పంజాబ్‌లో లస్సీ ఇలా అన్ని రకాల ఆహారాన్నీ మేం తీసుకుంటాం. కానీ మీరు ప్రజలకు చేపలు, మాంసం, గుడ్లు తినవద్దని ఆదేశిస్తారు. గర్భిణి స్త్రీలు గుడ్లు తినవద్దంటూ ఆంక్షలు పెడతారు. చెప్పండి భాయీ, మహళ ఏం తినొచ్చో, ఏం తినగూడదో చెప్పడానికి నువ్వెవరు?’ అంటూ ఆమె మోదీని నిలదీస్తున్నారు. అంతేకాదు. ‘మోదీ ఏం తింటే అదే తినాలని దేశానికి చెబుతున్నారు.. ఆయన వాడే సూట్‌నే అందరూ కొనాలంటున్నారు.  రోజు పొడవునా టీవీలో ఆయన ముఖాన్నే చూడాలని చెబుతున్నారు. నేను మోదీని గతంలో స్వార్థం లేని ఆరెస్సెస్‌ ప్రచారక్‌ అని భావించేవాడిని. కానీ కాఖీ నిక్కర్లతో పెరేడ్‌ చేసే ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ మనుషులు షాపింగ్‌ మాల్స్‌లో ప్యాంట్లతో తిరుగుతూ, బ్రీఫ్‌కేసులు మోసుకుంటూ కోట్లరూపాయలు సాధిస్తూ సంపదలతో విర్రవీగుతున్నారు’ అంటూ మమత ముక్తాయిస్తున్నారు.

ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు, వెంటనే రఫేల్‌ వ్యవహారం గురించి ప్రస్తావిస్తారు. చివరగా బీజేపీని పిడుగుపాటుకు గురిచేస్తారు. ‘ఇటీవల వరకు ఆకలి బాధతో ఉన్న పార్టీ, ఒకే బీడీని రోజులో మూడుసార్లు కాల్చి పీల్చుతూ వచ్చిన పార్టీ ఇప్పుడు వందల కోట్లకు యజమాని అయిపోయింది చూడండి’ అంటూ వ్యంగ్యబాణాలు సంధిస్తారు. ‘అయినా వారు తామింకా చౌకీదార్లమే అంటుంటారు’ అని మమత చెబుతుంటే కిందనుంచి జనాలు చౌకీదార్‌ చోర్‌ హై (కాపలాదారే దొంగ) అంటూ నినదిస్తారు. రాహుల్‌ ప్రసంగాల్లో ఒక్కదానికి కూడా జనం ఇలా స్పందించడం మీరు చూసి ఉండరు. రాహుల్‌ బెంగాల్లో మమత ప్రత్యర్థే కానీ ఆమె రాహుల్‌ నినాదాన్ని నేర్పుగా తన సొంతం చేసేసుకున్నారు. 

కాంగ్రెస్‌ కనిపెట్టిన చౌకీదార్‌ చోర్‌ హై నినాదాన్ని ఒక రాష్ట్ర స్థాయి నేత అత్యత సమర్థవంతంగా ప్రయోగిస్తే దేశమంతా అది ఎలా మార్మోగుతోందన్నది ప్రశ్న. దీనికి క్లుప్త సమాధానం ఏదంటే మోదీ–షాల వ్యవహారాన్ని కాంగ్రెస్‌ ఇంకా అర్థం చేసుకోవడం లేదన్నదే. వాజ్‌పేయి, అడ్వాణీల్లా కాకుండా మోదీ–షాలు వీధిపోరాట యోధులు. వీరు తమకు అనుగుణంగానే బీజేపీ డీఎన్‌ఏను మార్చిపడేశారు. స్ట్రీట్‌ ఫైట ర్లతో పోట్లాడాలంటే మీకూ స్ట్రీట్‌ ఫైటర్లు కావాలి. ముల్లును ముల్లుతో తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం, విషానికి విషంతోనే విరుగుడు కనిపెట్టడం అని ఈ వ్యాసం మొదట్లో నేను చెప్పిన దాని సారాంశ మిదే. 2019 ఎన్నికల్లో విషపూరితమైన, ప్రజలను విభజించే తరహా ప్రచారాన్ని మాత్రమే మోదీ–షాలు తమ బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటే, మమత దాని పరిమితులను ఎత్తి చూపుతున్నారు. లేక 42 మంది ఎంపీలున్న తమ రాష్ట్రంలో అది చెల్లదు అని ఆమె తేల్చిచెబుతున్నారు.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement