కాశీ పునర్వికాసం.. మొదటికే మోసం? | Shekhar Gupta Article On Varanasi | Sakshi
Sakshi News home page

కాశీ పునర్వికాసం.. మొదటికే మోసం?

Published Sun, May 12 2019 12:30 AM | Last Updated on Sun, May 12 2019 12:32 AM

Shekhar Gupta Article On Varanasi - Sakshi

గత 15 సంవత్సరాలుగా  భారత్, దాని పొరుగుదేశాల్లో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు గోడమీది రాతలు అనేది ఒక అన్యాపదేశక పదబంధంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఎందుకంటే అతిపెద్ద పండుగల కంటే ఎన్నికల సమయంలోనే ఉపఖండంలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రజల మనస్సుల్లో ఏముంది? వారి ఆశలు, ఆకాంక్షలు, సంతోషాలు, ఆందోళనలు, భయాలు ఏమిటి అనే అంశాలు అన్నీ ఎన్నికల సమయంలో గోడమీది రాతలను చదవడం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అది గోడమీది బొమ్మలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ఆకాశంలో వేలాడే బొమ్మలు, ఇంటి ఆవరణలు, లేదా రాళ్లూ రప్పలపై గీసే బొమ్మలు.. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయానికి అసలైన సంకేతంలా కనిపిస్తుంటాయి.

ప్రస్తుతం వారణాసిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. తాజాగా అక్కడ పోగుపడిన రాళ్లపై నడుస్తున్నప్పుడు ఒక బుల్‌డోజర్‌ కొన్ని గజాల దూరంలో ఆ ప్రాంతాన్ని చదును చేస్తూండటాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఉన్న గోడల్ని కూడా పరిశీలించవచ్చు. అక్కడి రాతల్ని మీరు చదవలేరు. ఎందుకంటే అక్కడ మీరు చదవడానికి ఏమీ లేదు. గతంలో ఉపయోగంలో ఉండి ఇప్పుడు శిధిలాలుగా మారిన అక్కడి దృశ్యాలకేసి చూడండి. వాటిపై నా సహోద్యోగి షోహమ్‌ సేన్‌ గీసిన చిత్రాలు చూడండి. లేదా వాటిపై మేం తీసిన వీడియోలను మా వెబ్‌సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటులో చూడండి.

ఇవి నిన్నటివరకు అక్కడ కనిపించిన తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, కప్‌బోర్డులు వంటి వాటి అవశేషాలకు సంబంధించిన చిత్రాలు. ఇవన్నీ అక్కడి గోడలపై ఏదో జిగురుతో అతికించి మళ్లీ అక్కడినుంచి మొరటుగా లాగిపడేసిన చందాన కనిపిస్తాయి. మిమ్మల్ని ఎవరైనా ఆకాశం నుంచి కిందికి వదిలినట్లయితే, ఒక వింతైన కళాచిత్రాల మధ్యలోకి మీరు ఊడిపడుతున్నట్లు మీకనిపించవచ్చు. లేక, అది మరొక మ్యాడ్‌ క్యాప్‌ ఫెవికోల్‌ యాడ్‌ చిత్రణగా కూడా ఉండవచ్చు: ఫెవికోల్‌తో మీరు రెండు ఇళ్లను కలపండి, వాటిని బుల్‌డోజర్‌తో కూల్చివేయండి. ఇళ్లు మొత్తంగా కూలిపోయినా మా జాయింట్లు మాత్రం నిలబడే ఉంటాయి.

వారణాసి గతం ఇక చరిత్రేనా?
వారణాసిలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగింది. కేవలం 4.6 హెక్టార్ల (11.4 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో 300 ఇళ్లు, ఆలయాలు, ఇతర భవనాలు ఉండేవి. వీటిలో చాలావరకు ఎంత సన్నిహితంగా ఉండేవంటే, ఏకకాలంలో ఇవన్నీ కలిసి నిర్మించినట్లుగా కనబడుతుండేవి. వీటి కింది భాగంలో వారణాసికే పేరు తెచ్చిన లేదా అపఖ్యాతి తెచ్చిన బైజాంటైన్‌ గల్లీలు (సందులు) ఉండేవి. ఇవి ఎంత ఇరుకుగా ఉండేవంటే ఇద్దరు మామూలు ఆకారంతో ఉండే మనుషులు మాత్రమే నడవగలిగేటంత సన్నగా ఉండేవి. ఇదంతా ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది.

హిందూమతానికి చెందిన అతి పవిత్రమైన, పురాతనమైన కాశీ విశ్వనాథాలయాన్ని ఇన్నాళ్లుగా కనుమరుగు చేస్తూ వచ్చిన ఆశ్రమాలను కూల్చివేశారు కాబట్టి హిందూ ప్రపంచం మొత్తంగా ఆలయాన్ని గంగా ఘాట్‌ల నుంచి నేరుగా తిలకించవచ్చని మోదీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా సాపేక్షంగా నిరాడంబరంగా కనిపించే ఆలయాన్ని సగటు హిందువులు వీక్షిస్తున్నప్పుడు ఔరంగజేబు 1669లో అక్కడే నిర్మించిన జ్ఞాన్‌వాపి మసీదు కూడా వారికి కనబడుతుంది. కాశీ విశ్వనాథుని మూల ఆలయాన్ని ధ్వంసం చేసి మరీ ఔరంగజేబు ఆనాడు నిర్మించిన మసీదు ఇది. ఇది ఇప్పుడు అందరికీ కనబడుతుంది కాబట్టి మిలిటెంట్‌ హిందువుల కళ్లకు ఇది కంటగింపుగా మారి వారు తదుపరి కూలగొట్టే లక్ష్యంగా మారవచ్చు కూడా.

కాశీలో మసీదు చెక్కుచెదరదు
అయితే ఈ ప్రమాదం జరిగే అవకాశం తక్కువేనని నాకు అనిపిస్తోంది. ఈ మసీదును ఇప్పటికే 30 అడుగుల ఎత్తు ఉన్న భారీ ఉక్కు స్తంభాలతో, ఆటోమేటిక్‌ రైఫిళ్లు ధరించిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కాపాడుతూ వస్తున్నామని కాశీ విశ్వనాథాలయం అభివృద్ధి సంస్థ సీఈఓ విశాల్‌ సింగ్‌ తదితర అధికారులు చెప్పడం వల్ల నేను ఈ అభిప్రాయానికి రాలేదు. నాది అధికారుల వర్ణనకు మించిన వాస్తవిక దృక్పథం. ప్రస్తుత పాలకులు హింసాత్మకమైన మెజారిటీ ముసుగులోని నిరంకుశ అసంతుష్టిపరులే అయినప్పటికీ, మన వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఏమాత్రం పరిరక్షించలేనంత బలహీనంగా మారిపోయి ఉన్నప్పటికీ కనుమరుగు ప్రదేశంలో ఉండకుండా అందరూ చేరగలిగిన, చూడగలిగిన భవంతికి ఎవరైనా హాని కలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నా అభిప్రాయం.కాబట్టి ఆలయాన్ని ఘాట్ల నుంచి నేరుగా చూసేందుకు అవకాశం కల్పిస్తూ, గంగానదికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో పునరభివృద్ధి పనులు చేస్తున్నందువల్ల అక్కడున్న మసీదుకు ప్రమాదం కలిగే అవకాశం ఏమాత్రం లేదు. అంజుమాన్‌ ఇంతెజామియా మస్జిద్‌ తరపున ఇలాంటి భయాలను వ్యక్తంచేస్తూ కొందరు స్థానిక ముస్లిం నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది.

అయితే అంతకుమించిన వ్యతిరేకత వాస్తవానికి వారణాసి హిందూ సంప్రదాయవాదుల నుంచి ఎదురవుతోంది. ఆలయ ఆవరణలోని నీలకంఠ గేటునుంచి పవిత్రమైన మణికర్ణిక ఘాట్‌ (అంత్యక్రియలు జరిగే చోటు) వరకు కనెక్ట్‌ అయి ఉన్న ఇరుకు సందు గుండా నడుస్తూ అక్కడున్న స్థానిక రచయిత, జర్నలిస్టు, మేధావి త్రిలోచన్‌ ప్రసాద్‌ను కలిశాం. ఆయన ఆగ్రహంతో దహించుకుపోతున్నారు. మార్పుకు వీల్లేని దైవసంకల్పిత స్థలంతో మార్పుకు ఎవరు సాహసిస్తున్నారు? మా వారసత్వాన్ని, పవిత్రమైన ప్రతి అంశాన్ని వారు ధ్వంసం చేస్తున్నారు. దీనికోసం వందలాది కోట్ల రూపాయలను వృధా పరుస్తున్నారు. ఒక జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు అన్నది త్రిలోచన్‌ ఆగ్రహానికి కారణం.

ప్రమాదాలను స్వాగతించే ప్రధాని
మీరు ఇష్టపడండి లేక వ్యతిరేకించండి, ప్రధాని నరేంద్రమోదీ ప్రమాదాలను ఆహ్వానించే వ్యక్తి. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో 296 భవనాల కూల్చివేతతో ముడిపడివున్న 4.6 హెక్టార్ల ప్రాంత పునర్వికాస కార్యక్రమం మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే అటు ఉదారవాదులే కాదు.. కాశీ ఆలయ శాశ్వతత్వం, శతాబ్దాలుగా మార్పుకు గురికాని దాని విశిష్టత పట్ల గర్వంగా ఫీలయ్యే బ్రాహ్మణ ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో చాలామంది సంప్రదాయకులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నివాస స్థలాల కూల్చివేతకు ప్రభావితమవుతున్న వారిలో దాదాపు 90 శాతం మంది బ్రాహ్మణులే. దాని పూజారుల్లాగే కాశీలో రాజకీయాలతో సంబంధమున్న పండితుల జనాభానే అత్యధికంగా ఉంటోంది. మోదీ–యోగీలు కాశీ ఆలయ ఆవరణలో తలపెట్టిన ఈ దుస్సాహసిక చర్య వల్ల 60 వేల నుంచి 75 వేల మంది ఓటర్లు వారికి దూరమవుతారని వీరిలో చాలామంది ఢంకా భజాయిస్తున్నారు.

దీనికి ముందు,వెనకా జరిగిన ఘటనలను అర్థం చేసుకోవడానికి కాశీ ఆలయ అభివృద్ధి సంస్థ సీఈఓ ఆఫీసులోని చార్టులు, ప్లాస్టిక్‌ నమూనాల కేసి మనం చూడాలి. ఈయన మేరీల్యాండ్‌ యూనివర్శిటీ నుంచి పాలనా రంగంలో మాస్టర్‌ డిగ్రీ పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీలో నూతన చట్టం తీసుకొచ్చాక ఆలయ అభివృద్ధి సంస్థకు, పాత భవనాల కొనుగోలుకు రూ. 600 కోట్లు కేటాయించారు. ఆ ప్రాంతంలో భూములకు ఉన్న రేట్లకు రెట్టింపు మొత్తాన్ని యజమానులకు చెల్లించారు. వారు బాగానే సంతోషిస్తున్నట్లు కనబడుతోంది. భూ యజమానులకు రూ. 200 కోట్లు చెల్లించారు. ఇక భవనాలపై యాజమాన్యం లేకున్నప్పటికీ కిరాయి హక్కులు తమకే ఉన్నాయని ప్రకటించిన వారికి మరో రూ. 15 కోట్లు చెల్లించారు. ఇక ఆలయ ఆవరణ ప్రాంతంలో 12 మంది యజమానులు మాత్రమే ఇంకా హక్కు కలిగి ఉన్నారు.

ఆ ప్రాంతంలోని గృహ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. ఆలయ ప్రాకారాన్ని కొత్తగా నిర్మించడానికి మార్చి 8న మోదీ భూమి పూజ కూడా నిర్వహించారు. మరో సంవత్సరంలో ఇక్కడ పని పూర్తవుతుంది. గతంలో ఇళ్ల మరుగున దాగివుండిన 43 ఆలయాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. ఇవి దాదాపు ఆక్రమించిన ఆలయాలే. ఇక్కడ నిర్మాణాలు పూర్తయ్యాక, ఆలయ సముదాయం పాత వారణాసి ప్రకటించుకుంటున్నదానికి ఏమంత భిన్నంగా కనబడదు. వారణాసి ఎంపీగా మోదీ అయిదేళ్లు ఉన్నప్పటికీ పరిశుభ్రత, ఆధునికత, అందరికీ అందుబాటులోకి రావడం అనే లక్షణాలకు ఈ పట్టణం ఇంకా దూరంగానే ఉంటోంది. మరి దీనికోసం ఇంత రిస్క్‌ తీసుకోవలసిన అవసరం ఉందా?

నగర అంతర్భాగాన్ని అభివృద్ధి చేయడం భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మన నాయకుల్లో చాలామంది ఈ యుద్ధరంగానికి దూరంగా ఉండిపోయారు. నగరాల్లో అభివృద్ధి అనే చిక్కుముడిని మొదటగా ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంజయ్‌ గాంధీ. నన్ను ప్రశ్నించవద్దు అనే  రకం పచ్చి నియంత అయిన సంజయ్‌ టర్క్‌మన్‌ గేట్, జామామసీదు విషయంలో ఏం చేశాడో తెలిసిందే. ఇక రెండో వ్యక్తి కూడా ప్రశ్నించడానికి వీల్లేని మతబోధకుడు మహమ్మద్‌ బర్హానుద్దీని సయద్నా. ఈయన ఇప్పుడు సెంట్రల్‌ ముంబైలోని రూ. 4,000 కోట్ల విలువైన బెందీ బజార్‌ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక మూడో వ్యక్తి నరేంద్రమోదీ. తేడా ఏమిటంటే, మోదీ చట్టాలను ఉపయోగించి, ప్రజలను ఒప్పించే తత్వంతో ఈ పని చేస్తున్నారు.

హిందూ ఛాందసత్వానికి మోదీ సవాలు
లౌకికవాదం పట్ల మోదీ నిబద్ధతను ప్రశ్నిస్తూనే, ఆయన ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్‌’ నినాదం బోలుతనాన్ని ఎండగడుతూనే కొన్ని ముఖ్యమైన అంశాల్లో మోదీ హిందూయిజం సామాజిక ఛాందసత్వాన్ని సవాలు చేస్తున్నారని అంగీకరించక తప్పదు. స్వచ్ఛ భారత్, బహిరంగ స్థలాల్లో మల విసర్జనకు వ్యతిరేక ప్రచారాలు వాటిలో ఒకటి. మరొక అంశాన్ని అందరూ ఇప్పుడు మర్చిపోయి ఉండవచ్చు. అదేమిటంటే, గుజరాత్‌లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన అనేక ఆలయాలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం. ఈ చర్య విశ్వహిందూ పరిషత్తు నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక కాశీ విశ్వనాథ కారిడార్‌ వల్ల వారణాసిలోని సాంప్రదాయకుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసివస్తోంది.

వారణాసి గురించి చాలామంది విజ్ఞులు, సుప్రసిద్ధ వ్యక్తులు శాశ్వత ప్రభావం కలిగించేలా మాట్లాడారు. వారిలో మార్క్‌ ట్వైన్‌ ప్రశంస మరీ గుర్తించుకోవలసి ఉంది: ‘బెనారస్‌ చరిత్ర కంటే పురాతనమైంది, సాంప్రదాయం కంటే ప్రాచీనమైంది, పురాణాల కంటే పాతది, ఈ అన్నింటినీ కలిపినప్పటికీ రెండు రెట్లు పురాతనమైంది’. కానీ అలాంటి వారణాసి నేటికీ ఇరుకు, మురికితనం విషయాల్లో రెండు రెట్లు మించిన స్థాయిలో కొనసాగాల్సిందేనా? నిజంగానే హిందూయిజం దాని పవిత్రమైన, మోక్షాన్ని కలిగిస్తుందని చెబుతున్న పురాతన నగర వైభవానికి అర్హమైందే. ప్రస్తుతం కొత్తగా ఉన్న ఆలయంలో బుల్‌డోజర్‌తో చదును చేయడం ద్వారా ఏర్పడిన శూన్యత చుట్టూ ఉన్న గోడరాతలను చూస్తే మార్క్‌ ట్వైన్‌ సైతం ఆశ్చర్యపడతాడు.

వారణాసి ఆలయ పరిసరాలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నాయి. వారణాసి నుంచి మరోసారి మోదీ ఎన్నికవుతారా అని కొద్దిమంది సందేహిస్తున్నారు. వారణాసిలోని సాంప్రదాయిక బ్రాహ్మణ పండితులకు చెందిన వేలాది ఓట్లను మోదీ కోల్పోనున్నారా అనేది మే 23న మాత్రమే మనం అంచనా వేయగలం. కానీ ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టును మోదీ పూర్తి చేసినట్లయితే, తన జాతీయవాద హిందూ నియోజకవర్గంలో అది ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు పట్ల నేనెంతో ఉద్వేగపడుతున్నానని చెప్పడానికి సంతోషపడుతున్నాను. దేశంలోని ఇతర నగరాలకు వారణాసి పునర్వికాసం ఒక పూర్వ ప్రమాణంగా మిగిలి ఉంటుంది. ఢిల్లీలోని చాందినీ చౌక్‌కు పూర్వ వైభవం తేవడానికి ఇది దోహదపడవచ్చు కూడా. ప్రధాని నరేంద్రమోదీ ‘హిందూ హృదయ సామ్రాట్‌’గా కొనసాగాలంటే మధ్యయుగాల నాటి మసీదులను కూల్చివేయడం కన్నా పురాతన ఆలయాలను పునరుద్ధరించడమే ఆయన చేయగలిగే ఉత్తమ కార్యక్రమంగా ఉంటుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement