మన్మోహన్‌ కంటే ఘనుడు మోదీ! | Shekhar Gupta Article On Narendra Modi And Manmohan Singh | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 12:57 AM | Last Updated on Sat, Feb 2 2019 12:57 AM

Shekhar Gupta Article On Narendra Modi And Manmohan Singh - Sakshi

యూపీఏ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కంటే ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోదీనే ఎక్కువ మార్కులు కొట్టేశారన్నది ఏరకంగా చూసినా వాస్తవమే. బడా రుణ ఎగవేతదారుల వంచనకు అడ్డుకట్టలు వేయడం, ఆహార ధరలను కనీస స్థాయికి తగ్గించడం, ప్రభుత్వ రాబడిని మౌలిక వసతుల కల్పనపై పెట్టి స్థూలదేశీయోత్పత్తిని వృద్ధి చెందించడం వంటి అంశాల్లో గతంలోని ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వం మెరుగ్గా వ్యవహరించింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పెద్దనోట్ల రద్దు వంటి అకాల చర్యలు చేపట్టడంతో విమర్శలు చెలరేగినప్పటికీ, వినియోగదారుల సంతృప్తి వంటి కొన్ని అంశాల్లో నరేంద్ర మోదీ మంచి మార్కులే సాధించారు.

మీ ఓటింగ్‌ ప్రాధాన్యతలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నాయి అనే అంశం ఆధారంగా చూసినట్లయితే, మోదీ ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థను మరీ గొప్పగా నడిపిందీ లేదు, అలాగని పూర్తిగా విధ్వంసకరంగా నిర్వహించారని చెప్పడానికీ లేదు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ డేటాను చూసి మాట్లాడమని ఆయన అభిమానులు చెబుతుంటారు. మోదీ విమర్శకులు కూడా ప్రతివాదం చేస్తూ డేటానే చూడాల్సిందిగా చెబుతుంటారు. కానీ అభిమానులుగా మీరు రూపొందిస్తున్న డేటా అబద్ధాలకుప్ప అయినప్పుడు దాన్ని మేం ఎలా అంచనా వేయాలని అడుగుతారు? ఈ అంశంపై ఇరుపక్షాల నిపుణులనూ యుద్ధం చేసుకోనిద్దాం. తర్వాత మోదీ హయాంలో అయిదేళ్లపాటు సాగిన రాజకీయ అర్థశాస్త్రం తీరుతెన్నుల గురించి విస్తృతస్థాయిలో పరిశీలిద్దాం. 

త్వరలో మోదీ అయిదేళ్ల పాలన ముగియనున్నందువల్ల, ఈ అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహారాలను నడిపిన అయిదు అంశాలను జాబి తాకు ఎక్కిద్దాం. ఈ అంశాన్ని రాజకీయాలు లేక రాజ కీయ అర్థశాస్త్రానికి చెందిన సులోచనాల నుంచే చూస్తున్నాను తప్ప కేవలం అర్థశాస్త్ర దృక్పథం నుంచి మాత్రం కాదని నేను మళ్లీ నొక్కి చెబుతున్నాను. కాబట్టి ఈ కోణంలో ఈ వ్యాసంలో కనిపించే అతి పెద్ద సానుకూలాంశం ఏదంటే ఐబీసీ అమలు. అంటే దివాలా, అప్పుల ఎగవేత కోడ్‌కి చెందిన ప్రక్రియను ఎలా అమలు చేస్తారన్నదే. 

ఇంతవరకు 12 మంది రుణ ఎగవేత దారుల్ని మాత్రమే రుణ ఎగవేత వ్యతిరేక విచారణ ప్రక్రియలో నిలబెట్టారన్నది వాస్తవం. కానీ ఈ 12 మంది దేశంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతులైన వ్యక్తులు. అయితే దేశంలోని చాలామంది శక్తివంతులైన రాజకీయనేతలు, స్పీడ్‌ డయల్‌పై బతికేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రుణ ఎగవేతల నుంచి ఎంత  పోగు చేసుకున్నారనేది తర్వాతి అంశంగా మిగులుతుంది. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి తమ అపరాధాలనుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. చివరకు బలవంతులైన  రూయాలు, ఎస్సార్‌లకు కూడా ఇది సాధ్యం కాలేదు. ఇది నిజంగా దేశంలో సరికొత్త రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనం అనే చెప్పాలి. 

ఈ అంశాన్ని ఇలా చూద్దాం. ఒక ఫ్రెండ్లీ ఫోన్‌ కాల్‌ చేయడం ద్వారా తాము చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పుకునే లేక వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. భారతీయ పెట్టుబడిదారీ విధానంలో మీరు ఇప్పుడు ఒక కొత్త శకంతో వ్యవహరిస్తున్నట్లు తెలుసుకోవాలి. మీ వ్యాపారం విఫలమైనట్లయితేనే దివాలా తీస్తారు. కొత్త శకంలోకి రావాల్సింది పెట్టుబడిదారీ విధానమే కావచ్చు కానీ వ్యాపారంలో వైఫల్యం చెందడం ద్వారా మీరు ఎదుర్కొనవలసిన చేదు నిజాన్ని ఆమోదించాలని సమాజం నేర్చుకోవలసి ఉంది. భారత్‌లో దివాలా తీయడం అనే అంశాన్ని దాచిపెట్టవలసిన కుటుంబ అవమానంగా చూస్తూ్త వస్తున్నారు.

బాహాటంగా వామపక్ష–సోషలిస్టు స్వభావంతో ఉన్నప్పటికీ, ’’ఫోన్‌ బ్యాంకింగ్‌’’ తరహా రాజ్యవ్యవస్థకు ఈ నేరంలో భాగముంది. నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి ముగింపు వాక్యం పలికింది. బడా బాబుల వలువలు ఊడిపోతున్నాయి. ఈ తరహా కార్పొరేట్‌ డాంబికాలు, ఆడంబరాలు మంటల్లో కాలి పోయిన తర్వాత నూతన భారతీయ పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించగలదు. ఈ పరిణామాన్ని నేనయితే స్వాగతించదగిన తప్పనిసరి అవసరమైన రాజ కీయ, సాంస్కృతిక మార్పుగానే చూస్తున్నాను. 

ఒకవైపు ముడిచమురు ధరలు పడిపోతున్నప్పటికీ పెట్రోలు ధరలను అధికస్థాయిలో ఉంచినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా విమర్శలను ఎదుర్కొంది. కానీ అది యూపీయే హయాంలో ప్రజలు పెట్టిన పెనుకేకల వంటిది కాదు. ఎందుకంటే వినియోగదారు నెల చివరలో తన షాపింగ్‌ బిల్లు ఎంతయింది కూడా గమనిస్తాడు. మోదీ పాలనాకాలంలో చమురుధరలు బాగా పెరిగాయి కానీ మొత్తం మీద చూస్తే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటూ వచ్చింది. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఇది మరీ స్పష్టం. మోదీ హయాంలోని ద్రవ్యోల్బణం డేటా అబద్ధాల కుప్ప అని ఎవరూ ఇంకా ఆరోపించడం లేదు. అలాగని జీడీపీ లెక్కల్లాగా దాన్ని మార్చి చూపారని కూడా ఎవరూ ఆరోపించడం లేదు. కాబట్టి మనం న్యాయమైన పోలికను పోల్చవచ్చు.

మోదీ ప్రభుత్వం 2014 వేసవిలో ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు, అంతవరకు దేశాన్ని పాలించిన యూపీఏ–2 ప్రభుత్వం.. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 8.33 శాతం వరకు పెరిగిన ఆర్థిక వ్యవస్థను మోదీ చేతిలో పెట్టింది. కానీ ఈరోజు అది 2.19 శాతంగా మాత్రమే ఉంది. కాబట్టే చమురుధరలు అధికంగా పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్న విధానం మోదీ ప్రభుత్వానికి రెండో అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టింది. గతంలో చాలా ప్రభుత్వాలు చమురుధరలను తగ్గుముఖం పట్టించే విషయంపై ఆపసోపాలు పడుతూ నోటి బలం ఉన్న నగర కులీనులనుంచి శాంతిని కొనుక్కునేవారు. 

ధరల రాజకీయం తన సొంత మార్మికతను కలిగివుంది. యూపీఏ–1 హయాంలో వ్యవసాయ పంటలకు కనీస మద్ధతుధరలు పెంచినందున, రైతు, రైతుకూలీ ఇరువురూ సంతృప్తి చెందారు. దీంతో యూపీఏ రెండో దఫా కూడా సులభమైన విజయం సాథించేసింది. కానీ దాని రెండో దఫా పాలనలో వినియోగదారు ఆహార ధరలు చుక్కలనంటాయి, దీంతో వీధుల్లో బలమైన అశాంతి పెరిగింది. చివరకు అదే యూపీయే మనుగడను ధ్వంసం చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వినియోగదారు ఆహార ధరలను బాగా తగ్గించివేసింది. కొన్నింటికి గరిష్ట మద్దతు ధరను పెంచకపోవడంద్వారా, కొన్నిం టిని బాగా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఆహార ధరలను తగ్గించగలిగింది. ఈ క్రమంలో మార్కెట్‌ శక్తులను కేంద్ర పట్టించుకోలేదు. 

ఫలితంగా, రైతు నిండా మునిగాడు, వ్యవసాయ కూలీల కూలీలు పడిపోయాయి. గత మూడు పంట కాలాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం గరిష్ట మద్దతు ధరను పెంచడం ప్రారంభించింది. కాని ఇది కూడా త్వరలోనే తనదైన ప్రభావాన్ని చూపుతుంది. అందుచేత మోదీ అయిదేళ్ల పాలనలో రైతు సర్వం కోల్పోయాడంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య తప్పే. అటు వినియోగదారు, ఇటు రైతు ప్రయోజనాలు పరస్పరం విభేదించినంత కాలం.. అధిక ధరలు, పంట ధరల తీవ్ర పతనం కారణంగా ప్రభుత్వం అధికారం కోల్పోవడం అన్నది క్రూరమైన రాజకీయ వాస్తవంగానే ఉంటుంది. ఈ చక్రవ్యూహం నుండి ప్రభుత్వాలు బయటపడాలంటే వ్యవసాయ సంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టడమే ఏకైక మార్గం. ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది.

ఇంధన పన్నుల కింద వసూలు చేసిన అదనపు నగదునంతా మోదీ ప్రభుత్వం ఏం చేసినట్టు? ఇలా వచ్చిన భారీ మొత్తాల్లో వేలాది కోట్ల రూపాయలను ఓటర్లకు నజరానాలుగా ఇచ్చేకంటే ఆర్థిక లోటును పూడ్చడానికి వినియోగించడం సరైనదని అనుకుంటాం. జాతీయ రహదారులపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టే బదులు, ఓడరేవులు, సాగర మాల ప్రాజెక్టులు, రైలు మార్గాలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే, వీటి నుంచి వచ్చిన ఆదాయం కారణం గానే మన స్థూల దేశీయోత్పత్తి గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.  

ఐదు విజయాలలో నాలుగోదైన పన్నుల చెల్లింపు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తిలో 9 నుంచి 12 శాతం పన్నుల నుంచే లభిస్తోంది. ఉన్నత స్థాయిలో చెల్లింపుదారుతో కఠినంగా వ్యవహరిస్తు న్నట్టు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు అనిపించినా; కింది, మధ్య స్థాయిల్లోని వారికి సంబంధించి పన్ను విధానం చాలా బాగుంది. చాలావరకు మధ్యవర్తుల ప్రమేయం లేదు. నిషేధించాల్సిన వ్యాపారాలు లేనట్టయితే, ఏజెన్సీలు ప్రత్యేకంగా దృష్టిసారించనట్లయితే, రాజకీయ బాధితులు కాకపోతే పన్ను చెల్లింపుదారుడికి సమస్యలేమీ లేనట్టే. ఐదవది, చివరిదీ జీఎస్‌టీ. బీజేపీ సొంత కూటమిలోనే దాని సా«ధక బాధకాలు దానికి ఉన్నాయి. అయినా, అది కొనసాగుతూనే ఉంది. 

చాలా విషయాల్లో వైఫల్యాలు కూడా ఉన్నాయి. వ్యవసాయం నుంచి ఎగుమతుల వరకు, తయారీ రంగం నుంచి ఉపాధి కల్పన వరకు, పీఎస్‌యూలను ఆధునీకరించకపోవడం నుంచి సమాచారాన్ని వక్రీకరిస్తున్నారనే చెడ్డపేరు ఉండనే ఉన్నాయి. వీటితోపాటు పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలాంటి డీమోనిటైజేషన్‌ లాంటి చర్యలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక అంశాలపై మనం ఫిర్యా దులు చేయొచ్చు. ఈ వారం ఒక ప్రభుత్వం అరుదుగా ప్రదర్శించిన మంచి ఆర్థిక విధానాలను గుర్తిద్దాం.. కేవలం చెత్త రాజకీయాలనే కాదు.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement