జాతిహితం
సామాజిక మాధ్యమాలు సమాచార వాహికలుగా, చర్చకు, తిట్టిపోయడానికి వేదికలుగా ఉండటం నుంచి పరిపాలనకు, ప్రజా రాజకీయాలకు, దౌత్యానికి సాధనాలుగా వ్యవహరించే అర్హతను సాధించాయి. అవి పరిపాలన నుంచి ఓపికను, దౌత్యం నుంచి గోప్యంగా చర్చలు జరిపే శక్తిని, తెర వెనుక సంభాషణలను హరించేశాయి. అంతే కాదు, ప్రజా రాజకీయాల నుంచి జవాబుదారీతనాన్ని దూరం చేశాయి. సామాజిక మాధ్యమాల పాలన, రాజకీయాలు విరాజిల్లే ప్రమాదకర నూతన ప్రపంచానికి స్వాగతం.
సామాజిక మాధ్యమాలు లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే ట్వీటర్ గొప్ప శక్తిగానూ, వాట్సాప్ వృద్ధి చెందుతున్న శక్తిగానూ ఆవిర్భవించడాన్ని గత రెండు వారాల్లో చూశాం. అమెరికా, మెక్సికోల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఎన్రిక్ పరెనా నీటోలు ట్వీటర్ ముచ్చట్లతోనే ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(నాఫ్తా) నాశనం చేయడం మొదలెట్టారు. అమెరికా నిర్మిస్తున్నానంటున్న గోడ వ్యయం 1,500 కోట్ల డాలర్లను ఎవరు భరించా లనే దానిపై ఆ ఇద్దరు దేశాధినేతలు 280 అక్షరాల్లోనే చరిత్రను సృష్టించారు, సృష్టించ లేదు కూడా.
ఇక మన వేపు చూడండి. జల్లికట్టు ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించింది, పెంచి పోషించింది, అదుపు తప్పిపోయేలా చేసింది పూర్తిగా సామాజిక మాధ్యమాలే. కేవలం ట్వీటర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారానే ఆ ఆందోళ నలు వ్యాపించాయి. సాధారణంగా నోరు తెరవని చదరంగం చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ క్రీడాకారులు రవిచంద్రన్ అశ్విన్, మెగాస్టార్ కమల్ హాసన్, మరీ ఆశ్చర్యకరంగా ఏఆర్ రెహమాన్‌ల వంటి వారు సైతం నోళ్లు విప్పారు. ఆ ఉద్యమానికి నాయకులూ లేరు, అధికారిక ప్రతినిధులూ లేరు, చర్చలు జరపడానికి వెళ్లేవారూ లేరు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఆజ్యం పోసిన ఈ ప్రజా వెల్లువకు, అరబ్బు వసంతానికి పోలికే లేదు.
ఇక ట్వీటర్ దౌత్యమేనా?
ఇదే సమయంలో భారత్, అమెరికాల మధ్య ఏమి జరిగిందో చూడండి. మన అధికార వ్యవస్థ ప్రపంచంలోని అతి పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన అమె జాన్‌ను బెదిరించి చరిత్రను సృష్టించింది. ఆ సంస్థ కెనడియన్ విభాగం మన జాతీయ జెండా రంగులను డోర్ మ్యాట్లపై చిత్రించినందుకుగానూ మన విదేశాంగ శాఖ దానితో క్షమాపణ చెప్పించింది. అంతేకాదు అటావాలోని మన దౌత్యకార్యాలయాన్ని ట్వీటర్‌లో దాని సంగతి తేల్చుకోమని ఆదేశిం చింది. దౌత్య వ్యవహారాల్లో ఎంత వెనుకబడిన దేశమైనా పద ప్రయోగంలో విచక్షణను చూపుతుంది, గోప్యతను ప్రదర్శిస్తుంది. సాధారణంగానైతే మన విదేశాంగశాఖలోని ఒక విభాగపు కార్యదర్శి అమెజాన్ అమెరికా ఖండాల జాయింట్ సెక్రటరీ పేరిట ఆ సంస్థకు ఒక ‘వర్తమానాన్ని’ పంపుతారు. అంతేగానీ ‘‘నీ నెత్తురు కళ్ల చూస్తా’’ అన్నట్టుగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శస్త్రం సంధించడం జరగదు. అతిగా జాగ్రత్త పాటించే మన అధి కార యంత్రాంగం ఇలా స్పందించడం కొంత విప్లవాత్మకమైనదే. పైగా కొద్ది నెలల్లో ఖాళీ అయ్యే సెబీ చైర్మన్ పదవికి అతి క్లుప్తమైన దరఖాస్తుగా కూడా ఇది ప్రశంసనీయమైనది.
సామాజిక మాధ్యమాల గురించి కొన్ని నిర్ధారణలకు రావడానికి తగి నన్ని తాజా ఆధారాలు మనకు అమెరికా, మెక్సికో, చెన్నై, ఢిల్లీల నుంచి అందాయి. ఒకటి, సామాజిక మా«ధ్యమాలు ఒక సమాచార వాహికగా, చర్చకు, తిట్టిపోయడానికి సైతం వేదికగా ఉండటం నుంచి పరిపాలనకు, ప్రజా రాజకీయాలకు, దౌత్యానికి సా«ధనంగా వ్యవహించే అర్హతను పొందాయి. రెండవది సామాజిక మాధ్యమాలు పరిపాలన నుంచి ఓపికను, దౌత్యం నుంచి గోప్యంగా చర్చలు జరిపే శక్తిని, దొడ్డి దారులను, తెరవెనుక చర్చలను హరించేశాయి. అంతేకాదు ప్రజా రాజకీయాల నుంచి జవాబు దారీతనాన్ని దూరం చేశాయి. తమిళనాడు ఆందోళనలు నిజంగానే చేయి దాటిపోతే ఎవర్నని నిందించగలం? ప్రపంచంలోని అతి పెద్ద అగ్రరాజ్యపు అధ్యక్షుడు... గత కాలపు తెగ నాయకునిలా పొరుగువారు పంపిన దూత తలను నరికి పంపినట్టు ప్రవర్తిస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసువాలి? లేదా అతి వేగంగా అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తరింపజేసుకుంటున్న అగ్రశ్రేణి దేశపు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు హఠాత్తుగా నడి రాత్రి ప్రపంచంలోని అతి పెద్ద ఈ–వాణిజ్య సంస్థను దెబ్బతీస్తే ఏం చేయాలి? సామాజిక మాధ్యమాల పాలన, రాజకీయాలు విరాజిల్లే ప్రమాదకర నూతన ప్రపంచానికి స్వాగతం.
ఫర్మానాలు, ఆజ్ఞలు అన్నింటికీ అవే వేదికలా?
సాధారణంగా బాగా ఆచితూచి వ్యవహరించే దేశాధినేతలు, దౌత్యవేత్తలు, ప్రజా జీవితంలోని ప్రముఖులే ఈ తుఫానుకు కొట్టుకుపోతే, సాంప్రదాయక మీడియా దీన్ని అనుసరించకుండా ఉండాలనుకోవడం అసమంజసం. సోమరి పాత్రికేయ వ్యాసంగానికి గొప్ప, మరింత ఎక్కువ సమర్థనను కల్పిం చే విగా సామాజిక మాధ్యమాలు ఆవిర్భవించాయి. ప్రైమ్ టైమ్‌లో మీ అభిమాన టీవీ చానళ్లనుగానీ, డిజిటల్ వార్తా వేదికలనుగానీ, చివరికి విసుగెత్తించే పాత చింతకాయ పచ్చడి వార్తా పత్రికలైనాగానీ చూడండి. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో వారు ఇలా, వీరు అలా అన్నారు అనే వాటిపై పలు చర్చా కథనాలు కనిపించే అవకాశాలే ఎక్కువ. అగ్రరాజ్యానికి ఖలీఫా లాగా ఫర్మానాలను లేదా పోప్‌లాగా ఆజ్ఞలను జారీ చేయడానికి ట్రంప్ ట్వీటర్‌ను వాడుతున్నారు. దీంతో ఈ ధోరణి ఇప్పుడు ఇంకా తీవ్రమైనదిగా మారుతోంది. సామాజిక మాధ్యమాల తీరే అంత. అయితేనేం, వాటి ద్వారా తోటి పాత్రికేయుల వ్యాఖ్యలపై కథనాలు, చర్చలు కూడా కనిపిస్తుంటాయి.
మీడియాదీ అదే దారి
పైన పేర్కొన్న పరిణామాల దృష్ట్యా గత కొన్ని రోజులుగా నేనీ విష యాన్ని గురించి బాగా ఆలోచిస్తున్నాను. లెబనాన్‌కు చెందిన కార్టూనిస్ట్ వేసిన అద్భుతమైన ఓ వ్యంగ్య చిత్రాన్ని కూడా చూశాను. అందులో ట్రంప్, వైట్ హౌస్‌లో డెస్క్ వద్ద కూచుని ఉంటాడు. దాని మీద 'ట్వీటర్', 'అణు బాంబు' అని రాసి ఉన్న రెండు స్విచ్‌లు ప్రముఖంగా కనిపిస్తుంటాయి. అయితే సామాజిక మాధ్యమాల గురించిన నా ఈ వాదనకు సంబంధించి తక్షణమైన నిప్పు రవ్వ వచ్చి పడింది మాత్రం ఈ ఉదయమే. విజయ్ మాల్యా అప్పు, తప్పించుకుపోవడాలపై ప్రముఖ బయోటెక్ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్, నేనూ స్వల్ప విభేదాలతో కూడిన ప్రమాదరహితమైన ట్వీట్లను ఒకరిపై ఒకరం వేసుకున్నాం. మధ్యాహ్నానికల్లా రెండు ప్రముఖ వ్యాపార చానళ్లు సహా మూడు వార్తా సంస్థలు నాకు ఫోన్ చేసి... 'మీ ట్వీటర్ చర్చను కొనసాగించడానికి' మా షోకు రండి అని పిలిచాయి. మిత్రుడు కిరణ్‌కు కూడా చేసే ఉంటారు. ప్రస్తుతం సాగుతున్న చర్చలపై వ్యాఖ్యానిం చడానికి ఈ మాధ్యమాన్ని వాడుకోవచ్చని అప్పుడు అనుకున్నాం.
'ఎకో ఛాంబర్' అనే వ్యక్తీకరణను సోషల్ మీడియా విమర్శకులు చాలా కాలంగా వాడుతున్నారు (ఒకరు ట్వీట్ చేసిన దాన్ని మరొకరు ట్వీట్ చేయడం ద్వారా మన సందేశం ఎంతో మందికి ప్రతి«ధ్వనిలా చేరుతుందని అర్థం. ఆ క్రమంలో చివరికి మొదట మనం చెప్పిన దానికి పూర్తిగా భిన్నమైనదిగా మారుతుందని విమర్శ). ఈ ఎకో చాంబర్ లేదా అలాంటిదే ఇంకేదో మన ప్రభుత్వాలను, రాజకీయాలను, ప్రజాభిప్రాయాన్ని, చర్చను ముంచెత్తేసి అశక్తం చేస్తోంది. సోషల్ మీడియా ఎకో చాంబర్ పుణ్యమాని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ అణు దాడి బెదిరింపును నిజమైనదిగా పొరబడి... తమ అణ్వస్త్రాలతో బదులు చెబుతామని హెచ్చరించారు. పాక్ రక్షణ మంత్రులకు తమ అణ్వస్త్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియవని మనకు తెలిసిందే. అలాగే హఫీజ్ సయీద్ నకిలీ ట్విటర్ హ్యాండిల్‌తో ఎవరో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై చేసిన వ్యాఖ్యపై ఎప్పుడూ జాగ్రత్త గానూ, సరిగ్గానూ ఉండే రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహంతో స్పందించారు.
ఇదేమీ సామాజిక మాధ్యమాలపై ఖండనగానీ లేదా సంప్రదాయవాద విలాపంగానీ కాదు. నాకా నైతిక ఆర్హత లేదు కూడా. ఏళ్లతరబడి చులకనగా చూసి తిరస్కరించిన తర్వాత నేను కూడా ఈ మాధ్యమాల ప్రలోభానికి లొంగిపోయాను. రెండేళ్ల క్రితమే ఇందుకు కారణాలను సైతం నా జాతిహితం కాలంలో వివరించాను (http://indianexpress.com/ article/opi-nion/ columns/national-interest-8618/). 8,618 అక్షరాల్లో (ఈ వ్యాసంలోని అక్షరాల సంఖ్య) చెప్పిన దాన్ని 140 అక్షరాల్లో ఎలా చెప్పగలననేదే ఇందులో ఉన్న తిరకాసు. నాకు మద్దతుగా నేను హాలివుడ్ స్టార్ జార్జ్ క్లూనీ అన్న మాటలను అరువు తెచ్చుకున్నాను: "140 అక్షరాల కోసమని నేను నా వృత్తి జీవితంలో సాధించినదానికంతటికీ ముప్పును తెచ్చుకోలేను". కానీ మూడు అంశాలు నా ఆలోచనను మార్చుకునేలా చేశాయి. ఒకటి, సామాజిక మాధ్య మాలు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాయని మీరు దానికి దూరంగా ఉంటారు. కానీ కనీసం మీరు చెప్పదలచుకున్న దేమిటో చెప్పడానికైనా దాన్ని ఉప యోగించుకోవడమే మెరుగు కావచ్చు. తిప్పికొట్టకపోయినా రెచ్చగొట్టవచ్చు. రెండు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల పాత్రికేయులకు ఇప్పడు కొత్త శక్తి సమ కూరిందని కూడా నేను గుర్తించాను. మనం మన వేదికలను మార్చుకున్నా మన పాఠకులను, శ్రోతలను మనతో పాటూ తీసుకుపోగలుగుతాం. ఎందు కంటే బ్రాండు కాదు, వారే రాజులు. మూడవది నన్ను మరింత ఎక్కువగా ఆకట్టుకున్నది.
ఫేస్‌బుక్ అకౌంటైనా లేకపోతే...
2015లో మెల్‌బోర్న్ నుంచి ఓ సుదీర్ఘ విమాన ప్రయాణం చేస్తూ "బర్డ్ మ్యాన్" ఆనే సినిమాను చూశాను. అందులోని హీరోను అతని కుమార్తె "నాన్నా! నువ్వు కావాలని పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి... నువ్వు బ్లాగర్లను ద్వేషిస్తావు. ట్వీటర్‌ను ఎగతాళి చేస్తావు. నీకు కనీసం ఫేస్‌బుక్ అకౌంటైనా లేదు. నువ్వు అసలు అస్తిత్వంలోనే లేని మనిషివి" అని మందలిస్తుంది.
నన్ను లొంగదీసేసుకోవడానికి అవసరమైన ఆఖరి కుదుపు అదే అయింది. రెండేళ్ల క్రితం నా శ్రోతల సంఖ్య పది లక్షలు దాటినప్పుడు నేనా వ్యాసం రాశాను. వారికీ, అంత తక్కువ కాలంలో అంత పెద్ద సంఖ్యలోని శ్రోతలను చేరుకుని, వారితో సామూహికంగానూ, ఎంపిక చేసిన స్థాయి లోనూ అంత నాటకీయంగా సంభాషించడానికి తోడ్పడ్డ వేదికలను అందిం చినవారికీ రుణపడి ఉన్నాను. అయితే, మన పిల్లలను, మన పిల్లల భవి ష్యత్తును నియంత్రించగల ముఖ్య వ్యక్తులు ఈ సామాజిక మాధ్యమాల పట్ల వెర్రి వ్యామోహాన్ని ప్రదర్శిస్తుండటం, లేదా పాత కాలపు రాజకీయాలకు, పాలనకు, వాస్తవాల ఆధారంగా జరిగే ముఖ్య చర్చలకు సులువైన ప్రత్యా మ్నాయంగా చూడటం ఆందోళన కలిగిస్తోంది.
twitter@shekargupta
శేఖర్ గుప్తా