నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! | Bad Consequences Of False Stories | Sakshi
Sakshi News home page

నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!

Published Sun, Mar 24 2024 9:57 AM | Last Updated on Sat, Aug 3 2024 12:44 PM

Cover Story: Bad Consequences Of False Stories - Sakshi

నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్‌ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.

అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.

పత్రికలు సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్‌ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.

‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్‌సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.

అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్‌సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.

కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..
► గత ఏడాది రంజాన్‌ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్‌ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్‌స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్‌లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.

► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్‌–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్‌–19’కు కారణమైన కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.

‘కోవిడ్‌’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్‌ అని, చైనా ఇంటెలిజెన్స్‌ అధికారి దీనిని లీక్‌ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్‌పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్‌ పత్రిక 2019లో ఫిలోవైరస్‌పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.

ఒక టీవీ చానల్‌ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్‌ను కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్‌ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్‌ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్‌’ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్‌ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్‌’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.

► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.

ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.

► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్‌’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్‌ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్‌ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ డిప్యూటీ డైరెక్టర్‌ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.

నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్‌ కమిటీ డైరెక్టర్‌ ఓలావ్‌ ఎన్జోస్తాద్‌ ఈ కథనాలను ఖండించారు.

► పాకిస్తాన్‌లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్‌కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్‌లోని సంతోష్‌ నగర్‌ దరాబ్‌జంగ్‌ కాలనీ మస్జిద్‌ ఏ సలార్‌ ముల్క్‌కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.

► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్‌ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.

ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్‌ చానల్‌ 1962 నాటి భారత్‌–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్‌’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.

ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్‌ చానళ్లు తైవాన్‌ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్‌ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.

► పాకిస్తాన్‌ పార్లమెంటు 2020 అక్టోబర్‌ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్‌.. ఓటింగ్‌’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్‌ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.

అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్‌ సబ్‌ కుఛ్‌ హోగా, సబ్‌ కుఛ్‌ హోగా, సబర్‌ రఖియే ఆప్‌’ (ఓటింగ్‌ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్‌ ఏమిటంటే ‘మోదీ కా జో యార్‌ హై, గద్దార్‌ హై, గద్దార్‌ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్‌ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.

పత్రికల ‘పచ్చ’కామెర్లు
► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్‌ న్యూస్‌’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్‌ న్యూస్‌’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్‌ డిజార్డర్‌’– సమాచార జాడ్యం, ‘మాల్‌ ఇన్ఫర్మేషన్‌’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్‌ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.

అప్పట్లో అమెరికాలో విలియమ్‌ రాండాల్ఫ్‌ హర్ట్స్‌ నడిపే ‘న్యూయార్క్‌ జర్నల్‌’లో రిచర్డ్‌ ఔట్‌కాల్ట్‌ ‘యెల్లో కిడ్‌’ కార్టూన్‌ స్ట్రిప్‌ వేసేవాడు. ‘న్యూయార్క్‌ జర్నల్‌’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్‌’ కార్టూన్‌ స్ట్రిప్‌ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.

ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి
► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!

ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్‌ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.

గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్‌’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్‌లోని ‘తొలి వాట్సాప్‌ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్‌’ మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.

వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్‌ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్‌బుక్‌ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.

ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్‌ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్‌బుక్‌’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్‌’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్‌ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.

ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్‌లైన్‌ రాక్షసులు..!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement