పోలీస్ స్టేషన్‌లో రాము, బొడ్లపాడులో గుర్తుతెలియని వ్యక్తిని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు
రాజాం సిటీ, రూరల్ : బీహార్, ఒడిశా వంటి ప్రాంతాల్లో గొంతులు కోసి డబ్బులు, బంగారం దోచుకువెళ్లే వారు జిల్లాలో సంచరిస్తున్నారన్న వదంతులు సోషల్‌మీడియాలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏది నిజమో ఏది ప్రచారమో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు.. వారు ఏం చేస్తారోనన్న భయం వెంటాడుతోంది. దీంతో కొన్ని చోట్ల భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఆదివారం జరిగాయి.
యువకుడిని వెంబడించి..
పాలకొండ మండలం కస్పావీధికి చెందిన యువకుడు ఎస్.రాము తన తాతగారి గ్రామమైన కొర్లవలస బయలుదేరాడు. మండల పరిధి గురవాం సమీపంలో గురవాం–కొర్లవలస గ్రామాల మధ్య నడుచుకుంటూ వెళ్తుండగా.. పంటపొలాల్లోని మహిళలు, రైతులు అతడిని బీహార్‌కు చెందిన దొంగల ముఠా యువకుడిగా అనుమానించారు. తన వెంట పదిమంది పైగా కేకలు వేసుకుంటూ రావడాన్ని గమనించిన రాము కూడా ఏదో జరుగుతోందని భావించి పరుగు పెట్టడం ప్రారంభించాడు.
దీంతో ప్రజలు కూడా మరింత వేగంతో అతడిని వెంబడించారు. యువకుడిని పట్టుకుని రేగిడి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసుల పరిశీలనలో ఆయన పాలకొండకు చెందిన వ్యక్తి అని తెలియడంతో పోలీసులు, గ్రామస్తులు అతడిని విడిచిపెట్టారు.
మరింత ఆందోళన
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి సమయాల్లో ఆరుబయట నిద్రిస్తుంటారు. దొంగలు సంచరిస్తున్నారనే వదంతులు ప్రచారంలోకి జోరుగా వస్తుండటంతో వీరు బయట పడుకునేందుకు భయపడుతున్నారు.
మతిస్థిమితంలేని వారు, గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుంటే దొంగలు, హంతకులన్న అనుమానంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్న రాజాం మండలం కంచరాంలో దొంగలు పడ్డారని, నిన్న రేగిడి మండలంలో చిన్నారులను ఎత్తుకుపోయేవారు వచ్చారని ప్రజలు ఆందోళన చెందారు.
అవగాహనా కార్యక్రమాలేవి?
ఇంత జరుగుతున్నా పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలుగాని, ప్రజలకు దైర్యం చెప్పే చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు రోజురోజుకు ఏదో ఒక గ్రామంలో ఇలాంటి వార్తలు రావడంతో ప్రజలకు భరోసా లేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి గస్తీ పెంచడంతోపాటు అవగాహన కార్యక్రమాలు ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
వదంతులు నమ్మొద్దు
ఇటీవల వైరల్ అవుతున్న వార్తలకు ప్రజలు నమ్మొద్దు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు. ఎక్కడా ఎటువంటి గ్యాంగ్‌లు తిరగడంలేదు. కొత్తవ్యక్తులు సంచరించినట్లు భావిస్తే సమాచారం అందించాలి. పట్టణ ప్రాంతంతోపాటు గ్రామాల్లో కూడా గస్తీ ముమ్మరం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టాం.
ఎన్.వేణుగోపాలరావు, రాజాం టౌన్ సీఐ
దొంగ అనుకుని కట్టేశారు
బూర్జ : మండలంలోని వైకంఠపురం పంచాయతీ పరిధిలోని బొడ్లపాడు గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. దొంగ అనుకొని స్తంభానికి కట్టేశారు. పోలీసులు సమాచారమిచ్చి వివరాలే సేకరించేందుకు ప్రయత్నించినా.. ఎంతకీ వివరాలు తెలియకపోవడంతో దాడి చేశారు. పోలీసులు వచ్చి అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. వెంటనే ఆ వ్యకికి వైద్యం చేయించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment