ఢిల్లీ వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. కాకపోతే, ఇంతవరకు అందరు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయని గుర్తించాలి. ఉదాహరణకు, ఈ సమస్యతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించడా నికి డీజెల్ పైన, ట్రక్కులపైన వసూలు చేస్తున్న వందల కోట్ల సెస్‌లో కొంత భాగాన్ని మళ్లించవచ్చు. అంతేగానీ ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పరిష్కారం చేయలేరు.
మాకు టెడ్డీ అనే లాసా జాతి టిబెటన్ బొచ్చు కుక్క ఉండేది. అదెన్నడూ ఆహారం కోసం వెతుక్కునేది కాదు. అలమారా దిగువ అరల్లోని పుస్తకాలకు తప్ప మరెవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు సాయంత్రం ఓ ఎలుక దారి తప్పి మా వంట గదిలోకి చొరబడింది. అది చూసిన వెంటనే టెడ్డీ దాని వెంట పడింది. బెంబేలెత్తిపోయిన ఎలుక వంటగ్యాస్ సిలిండర్‌కు వెనుక ఇరుక్కు పోయింది. మొట్టమొదటిసారిగా తను వేటాడిన జంతువును మా టెడ్డీ కొద్ది సేపు పట్టుకుని చూసింది. ఆ తర్వాత దాన్ని అది వదిలిపెట్టేసింది. భయంతో ఎలుక పరుగు తీసింది. అది దానికి అవమానకరం అని మాకు అనిపించింది. మొదట్లో మా అతిథులకు వినోదం కల్పించడం కోసం మేం ‘ఎలుక’ అని అరిస్తే చాలు... మా ‘వేటగాడు’ పరుగందుకుని తక్షణమే గ్యాస్ సిలిండర్ వెనక్కు వెళ్లేవాడు. ఆ తర్వాత క్రమంగా అది ఓ కథగా మాత్రమే మిగిలి పోయింది. ఎప్పుడు ఎవరు అలాంటి మూర్ఖపు, అమాయకపు స్వాభావిక స్పందనలను కనబర చినా మేం ఇప్పుడు... ఒకసారి ఎలుక కనిపించిందని అక్కడే ప్రతిసారీ వెతక్కు అంటుంటాం.
ఆత్మవంచన, పరవంచనే పరిష్కారమా?
ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, సరి–బేసి పథకాన్ని మన మీద రుద్ది, మొట్టమొద టిసారిగా వంటింటి ఎలుకను పట్టడానికి కృషి చేసింది. అందులో సైతం అది విజయవంతం కాలేకపోయింది. ఈ పద్ధతి వల్ల ఢిల్లీ గాలి నాణ్యతలో చెప్పు కోదగిన మెరుగుదలేమీ కనబడలేదని గణాంకాలన్నీ తేల్చాయి. అయితేనేం అది రాజకీయంగా విజయవంతమైంది. చాలా మంది ఢిల్లీ పౌరులు, ప్రత్యే కించి సంపన్న పౌరులు (పలు వాహనాల యజమానులు) కనీసం ఈ సమస్య గురించి ఏదో ఒకటి చేస్తున్నారని, అందులో తాము కూడా భాగస్వా ములం అవుతున్నామని నమ్మేట్టు చేస్తోంది. అంతకు ముందు దీపావళి టపాసుల నిషేధపు ప్రహసనాన్ని కూడా ఇలాగే ప్రదర్శించారు. ఈ చర్యల పట్ల మైత్రీ పూర్వకంగా ఉండే టీవీ చానళ్లు వాటికి మద్దతుగా నిలిచాయి. గొప్ప ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మన వాయు నాణ్యతను మెరుగుపరుస్తు న్నదని ఊపిరి సలపకుండా ప్రశంసించాయి. హైబ్రిడ్ కార్లు, ఇంటిలో వాడే ఎయిర్–ప్యూరిఫయర్ల తయారీదారుల నుంచి ఈ ప్రశంసా కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రసారం చేయడానికి స్పాన్సర్‌షిప్‌లను సైతం అది సంపా దించి పెట్టింది. ఆ కార్లను, ప్యూరిఫయర్లను కొనగలిగేది సంపన్న వంతులే. రెండు చలి కాలాల తర్వాత, ఆప్ ప్రభుత్వం వంటింటి ఎలుక వెంటబడి తిరిగి పరుగులు తీస్తూనే ఉంది.
మమతా బెనర్జీతో పోటీపడుతూ ఆమ్ ఆద్మీ మన దేశంలోకెల్లా అత్యంత ప్రజాకర్షక పార్టీగా మారింది. అయితే జనాకర్షక నిరంకుశ పార్టీలకు భిన్నంగా ఆ పార్టీలో అభిప్రాయాలలో, వివేకంలో వైవి«ధ్యానికి తావు ఉంది. ఇక దాని బలహీనతకు వస్తే, అది ఈ వారం ఆ పార్టీ పంజాబ్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నోటి నుంచి వెలువడింది. గడ్డిని కాలబెట్టే ‘కార్యక్రమాని’కి అధ్యక్షత వహిస్తూ ఆయన... గడ్డిని స్వయంగా కోసి శుభ్రం చేయడానికి ప్రభుత్వం రైతులకు నెలకు రూ. 5,000 చెల్లించే వరకు దీన్ని కొనసాగించాల్సిందేనని బోధించారు. ఇందుకు మీరు నవ్వండి, ఏడ్వండి, కోపగించండి. లేదంటే, మీ అతిశయాన్ని దింగమింగి, ఆ ఇన్హేలర్‌ను అందుకుని, అందులోంచి వచ్చే ఆ దరిద్రగొట్టు కార్టిసోన్‌ను పీల్చండి.
ఢిల్లీ గాలి మాత్రమే కలుషితమై పోయిందా? అనేది మంచి ప్రశ్న. లేదు, దేశమంతటా గాలి కలుషితం అయిపోయిందనేదే సమాధానం. మరి ఢిల్లీ వాయు కాలుష్యం గురించే ఎందుకీ వెర్రి?
వాయుకాలుష్యం ఢిల్లీకే పరిమితమా?
మంచి ప్రశ్న. ప్రధాని సహా దేశంలోకెల్లా అత్యంత శక్తివంతులైన రాజకీయ వేత్తలు, పర్యావరణ శాఖ కార్యదర్శి సహా ఉన్నత ప్రభుత్వాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు, మీడియా దాదాలు అంతా ఉండేది అక్కడే. వారు తమ కలుషితమైన గాలి, మరణిస్తున్న నదులు, కాలుష్యంతో నురగలు కక్కుతున్న సరస్సులు, కూలుతున్న పర్వతాల సమస్యనే పరిష్కరించుకోలేకపోతే... ఇక మిగతా దేశం గురించి ఏమైనా చేసే అవకాశం ఏం ఉంటుంది? వారంతా ఏమీ ప్రయ త్నించడం లేదని కాదు. కాకపోతే, మా చిన్నారి లాసాలాగా ఆ ఎలుక కోసం వంటగదిలో వెతకడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనమంతా నవ్వు కోవాల్సి వస్తోంది. ఇకపోతే గౌరవనీయులైన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఉంది. వారు ఢిల్లీ నగరం పట్ల చూపుతున్న ఉద్వేగాన్ని, దాని కోసం చేస్తున్న కృషిని, నగర కాలుష్యంపై ప్రదర్శిస్తున్న ఆగ్రహాన్ని చూస్తుంటే... దాని పేరును దేశ రాజధాని ప్రాంత హరిత ట్రిబ్యునల్‌గా మారిస్తే బావుంటుందని మనవి చేసుకుంటున్నాను. అది భారీ ఎత్తున జారీ చేసే ఫర్మానాలను (ఆదేశాలు) చూసి తుగ్లక్ ఎంతగానో గర్విస్తాడు. కాబట్టి ఆ సంస్థకు ఓ భవనాన్ని కేటాయించి, దానికి తుగ్లక్ భవన్ అని పేరు పెట్టాలని సూచిస్తున్నాను. ప్రజల అసమ్మతి ప్రాంతంగా ఉండే జంతర్ మంతర్‌లోని ఓ చిన్న ప్రాంతాన్ని.. పాలకుల చెవులకు మీ గోల విన రాకుండా, సుదూరంలోని మరో ప్రాంతానికి తరలించాలని అది తాజాగా మరో ఫర్మానాను జారీ చేసింది. నిరసన తెలపడం ఉద్దేశమే పాలకులకు మీ మాట వినిపించేట్టు చేయడం. అయితేనేం, ఢిల్లీ నగరంలోని ఆ సామ్రాజ్యాధికారానికి వ్యతిరేకంగా వాదించే వారు, ప్రత్యేకించి సదుద్దేశాలతో వాదించే వారు ఎవరున్నారు?
ఢిల్లీలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎన్‌జీటీ తాజాగా పతాక శీర్షికలకు ఎక్కింది. మంచి ఆలోచన అంటారు మీరు. ఆర్థిక కార్య కలాపాల్ని నిలిపివేయడం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడే పద్ధతి కాలేదు నిజమే. పైగా, ఈ ఆదేశం వల్ల నిర్మాణ పనులు ఆగిపోతాయిగానీ, కాంట్రా క్టర్లు కార్మికులకు వేతనాలను చెల్లిస్తూనే ఉండాలి. ఈ ఆదేశాన్ని అమలుపరచే ఒక్క కాంట్రాక్టర్‌ను చూపండి, ఎన్‌జీటీ అంతకు ముందు ఆదేశించినట్టు గడ్డిని కాల్చడం ఆపేసిన రైతును చూపిస్తా. జాతీయ మానవ హక్కుల కమి షన్ సైతం బోలెడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సహకారంతో దుష్కృ త్యాలకు పాల్పడుతున్న గో రక్షకుల వెంట పడటం కంటే ఈ పని సురక్షిత మైనది. ఇకపోతే సుప్రీం కోర్టు, ఢిల్లీ వాయు నాణ్యత అధ్వానంగా మార డంతో ఆ సమస్య పరిష్కారానికి భూరేలాల్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిటీ తొలి రోజుల్లో గణనీయమైన తేడాను తేగలిగింది. రాజధానిలోని ప్రజా రవాణా వ్యవస్థను అది సీఎన్‌జీకి పరివర్తన చెందించింది. కాలుష్యానికి ప్రధాన కారణమైన డీజెల్‌పైనా, ట్రక్కులపైనా కూడా పడతారని ఆశించారు. కానీ ఇçప్పుడున్న ఉపద్రవకరమైన పరిస్థితుల్లో సైతం ప్రతి ప్రముఖ వ్యక్తి వంటింట్లోనూ ఎలుక (డీజెల్ వాహనాలు) ఉంది. కాబట్టి అది జరగలేదు.
పరిష్కారాలు లేకపోలేదు కానీ...
రంకెలు వేయడం పరిష్కారం కాదు. కానీ కొన్ని పరిష్కారాలు లేక పోలేదు. కాకపోతే, దీపావళి నుంచి మొదలయ్యే రెండు నెలల పతాక శీర్షికల కాలాన్ని వదులుకోవాలి. మిగతా పది నెలలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఒకటి, అసలు సమస్యంటూ గుర్తించాలి. రెండు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు, కార్య కర్తలు ఇలా ప్రతి ఒక్కరు ప్రయత్నించిన పరిష్కారాలూ పని చేయడం లేదు. మూడు, వెక్కిరింతలకు లేదా రాజకీయం చేయడానికి దిగకూడదు. అప్పుడు వాస్తవాలను తిరగేయండి. వాటిలో మొదటిది ఆప్ నేత అతిషి మార్లెనా తయారు చేసిన ఉత్తర భారత కాలుష్యపు పొగ మేఘాల మ్యాప్. దాన్ని పరి శీలిస్తే ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, మొత్తం ఆ ప్రాంతమంతా కాలుష్యంతో ఊపిరి సలపకుండా ఉందని అర్థమౌతుంది. ఈ కాలుష్యం పొగ కాలంలో వెలువడ్డ మొట్టమొదటి అర్థవంతమైన ప్రకటన ఇది. ఈ మ్యాప్‌ను మీరు మరింత పశ్చిమానికి విస్తరిస్తే, పాకిస్తాన్‌లోని విశాల ప్రాంతాలు కూడా అలాగే కనిపిస్తాయి.
కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు పాకిస్తాన్ విషయంలో ఏమీ చేయలేని మాట నిజమే. కానీ ఈ సమస్యతో సంబంధం ఉన్న ఢిల్లీ, హరి యాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ముఖ్యమంత్రులు నలుగురితో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరవచ్చు. బాధ్యతను వేరొకరి మీదకు నెట్టే యడం అనే వెటకారాన్ని ఇక మర్చిపోండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించే మార్గాన్ని అన్వేషించండి. సుప్రీంకోర్టు, ఎన్‌జీటీల ఆదేశాల ప్రకారం డీజిల్, ట్రక్కుల మీద వందల కోట్ల సెస్‌ను వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న నిధులలో కొంత భాగాన్ని ఇందుకు మళ్లించేలా అంతా కూర్చుని నిర్ణయం చేయవచ్చు. బ్రాంకి యోటిస్ వల్ల వచ్చే దగ్గు తెరలకు పరిష్కారంగా మింట్ మాత్రలను చప్పరించడం లేదా అగర్‌బత్తీలను వెలిగించుకోవడం.. అవి పతంజలి తయారీవే అయినా.. ఎలాగో, అలాగే ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పోరాడాలని అను కోవడం కూడా అంతే భ్రమాత్మకమైనది.
ఇప్పుడిక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఈపీసీఏ నివేదికలను చూడండి. ఢిల్లీలోని కాలుష్యపు తెరలకు దుమ్ము 38 శాతం కారణం. పై నుంచి నీళ్లు చల్లడం లేదా ఫైర్ బ్రిగేడ్లతో చెట్లకు స్నానం చేయించడంలాంటి వెర్రి ఆలోచనలను మరచిపోండి. 2016లో వాగ్దానం చేసినట్టుగా ఢిల్లీ రోడ్లను శుభ్రం చేయడానికి వాక్యూం స్వీపింగ్ మిషన్లను కొనమని ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి. కనీసం వందల కొద్దీ మరణావస్థలో ఉన్న పాత డీటీసీ బస్సుల స్థానంలో కొత్త వాటిని కొనమనండి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదం టారా? ఢిల్లీ ఓటర్లకు సబ్సిడీకి విద్యుత్తును, ఉచితంగా తాగునీటిని పంచి పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండాల్సింది.
ఈ చర్యలేవీ, బేసి–సరి పద్ధతి కంటే లేదా నిషేధాల కంటే ఆకర్షణీ యమైనవిగా ఉండవు. కానీ ఉపయోగపడేవి. ఈ పొగ కాలంలో చేసిన మిగతా పనులన్నీ హాస్యాస్పదమైనవి మాత్రమే కాదు. మనలో కోట్లాదిమం దిని సామూహికంగా వంచించి చేసిన అఘాయిత్యం. సినిమా వాళ్లకు ఉండే స్వాతంత్య్రం పాత్రికేయులకు ఉండదు. కాబట్టి, ఇష్కియా సినిమాలో విద్యా బాలన్ అతి తరచుగా వాడిన మూర్ఖత్వం అనే అర్థాన్నిచ్చే ఆ ముతక మాటను వాడలేను. కాబట్టి దీన్ని సరి–బేసి గంధక ధూమం అంటాను.
- శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment