న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.
‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది.
ఢిల్లీలో మళ్లీ GRAP-3
ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment