ప్రస్తుతం దేశంలో నిజమైన జాతీయ పార్టీ ఏదీ ఇప్పుడు లేదని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతంలో జాతీయపార్టీలుగా పేరొందిన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోయాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనబడుతున్నాయి. వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం తన నిజమైన వారసుడిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ఏపీలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. 20 మంది శక్తిమంతులైన ప్రాంతీయ నేతలతో భారత్ నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. 2019 సార్పత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణం తప్పదు.
భారతదేశాన్ని అవలోకించడానికి రెండు మార్గాలున్నాయని మీరు అర్థం చేసుకోదలిచినట్లయితే, మీరు తరచుగా దేశరాజధాని ఢిల్లీని వదిలి బయటకు రావాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే లోపలినుంచి బయటకు చూడటం.. అంటే ఢిల్లీ, దేశ ప్రధాన భూభాగం నుంచి వెలుపలకు తొంగి చూడటం లేక వెలుపలినుంచి లోపలికి చూడటం. అంటే దేశ ప్రధాన భూభాగాన్ని సుదూరం నుంచి చూడటం. మీరు లోపలి నుంచి బయటకు చూస్తున్నప్పుడు, జాతీయ పార్టీ, జాతీయ నాయకుల కోణం నుంచి మాత్రమే దర్శించే కోణాన్నే మీకు అందిస్తుంది. అలా కాకుండా సుదూరం నుంచి దాపరికం లేకుండా మీరు చూసినట్లయితే ఈ నూతన భారత్‌లో జరిగిన, జరుగుతున్న మార్పును మీరు చూడవచ్చు. అదేమిటంటే జాతీయపార్టీలుగా ఇన్నాళ్లుగా మనకు తెలిసిన పార్టీలు క్షీణించిపోతున్నాయి. మహా జాతీయ నేత అనే భావన ఇందిరాగాంధీతోనే ముగిసిపోయింది.
భారత మహా రాజకీయ చిత్రపటంపై కొత్త చిత్రణలు ఈ వారం ఇద్దరు బలమైన రాష్ట్ర నాయకుల గురించి వివరించాయి. ఒకరు తెలంగాణలో తిరుగులేని నేత కె. చంద్రశేఖరరావు (టీఆర్‌ఎస్), రెండు. అంధ్రప్రదేశ్‌లో వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి (వైఎస్సార్ సీపీ). భారత్‌లో నిజమైన జాతీయ పార్టీ ఇప్పుడు ఏదీ లేదని ఈ ఇద్దరు నేతలూ తమ శైలిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా వర్ణించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనపడుతున్నాయి. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీని జాతీయపార్టీగా ఎందుకు చెప్పలేం. ఢిల్లీలో కూర్చున్న మనం దేశం అంటే హిందీ ప్రాబల్యం ఉండే భూభాగం అని అయోమయానికి గురవుతున్నాం.
ఉదాహరణకు 2014లో బీజేపీ సాధించిన 282 స్థానాల్లో మెజారిటీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హరి యాణా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ (190 స్థానాలు) రాష్ట్రాల నుంచే వచ్చాయి. బీజేపీ సాధించిన మిగతా సీట్లలో 49 స్థానాలు పశ్చిమప్రాంతమైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. అంటే ఈ అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 299 సీట్లలో 239 స్థానాలను బీజేపీ సాధిం చింది. అంటే 80 శాతం స్థానాలు ఇక్కడినుంచే వచ్చాయి. మిగిలిన దేశ మంతటా మొత్తం దక్షిణప్రాంతం (కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు), తూర్పున (పశ్చిమబెంగాల్, ఒడిశా), ఉత్తరాన జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని 244 సీట్ల నుంచి బీజేపీ 43 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంటే 17 శాతం మాత్రమే అన్నమాట. ఈ వ్యత్యాసాన్ని పరిశీలిస్తే బీజేపీని దేశమంతటా పునాది ఉన్న జాతీయ పార్టీగా గుర్తించలేం. అది కేవలం పది రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన పార్టీగా కనిపిస్తుంది.
మరి జాతీయ నాయకుల మాటో? నరేంద్రమోదీ ఒక్కరు మాత్రమే ఆ స్థాయిని ఇవాళ ప్రకటించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన తెలుసు. కానీ ఈ పది రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ప్రజలు తనకు అధికంగా ఓట్లు వేసేలా మోదీ మ్యాజిక్ చేయగలరా? బీజేపీకి మెజారిటీనిచ్చిన ఈ పది రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలు, స్థానిక నేతల నుంచే మోదీకి సవాల్ ఎదురైంది. బిహార్‌లో లాలూ ప్రసాద్, నితిశ్ కుమార్‌లు సరిసమాన స్థాయి నాయకులు. ఈ ఇద్దరిలో చెరొకరితో కాంగ్రెస్, బీజేపీ జూనియర్ భాగస్వామి స్థాయిలో పొత్తు కట్టాయి. పంజాబ్‌లో బీజేపీ అకాలీదళ్‌తో పొత్తుకలిపి ఉంది. హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ స్థానిక భాగస్వామికోసం గాలిస్తున్నాయి. చివరకు అసాధారణమైన వాగ్ధాటి కలిగిన మోదీ సైతం ఏడు రాష్ట్రాలకు మించి ఇతరత్రా తన పార్టీకి మెజారిటీ తీసుకువచ్చే పరిస్థితిలో లేరు.
బీజేపీ 7 నుంచి 9 రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీ స్థాయిలో ఉండగా, కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీగా ఉంటోంది. అది కూడా చాలా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే. అవేమిటంటే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పంజాబ్, కర్ణాటక. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. అందుకనే ఓటర్ దేవుళ్లు ఎంత కరుణిం చినా కాంగ్రెస్ గురిపెట్టగల స్థానాలు 150 మాత్రమే. ఇవి కూడా వచ్చే అవకాశం లేదని నాకు తెలుసు. మహా అయితే 100 స్థానాలను అది లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే బీజేపీ అర్థ జాతీయ పార్టీగా తన్నుతాను నిరూపించుకుంటూండగా, కాంగ్రెస్ మూడిట ఒక వంతు కూడా జాతీయ పార్టీ స్థాయిని కలిగిలేదు.
నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలుపు సాధించగలిగిన నిజమైన చివరి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే. ఆమె తదనంతరం 1984 డిసెంబర్‌లో జరిగిన అసాధారణ ఎన్నికలను మినహాయిస్తే నిజమైన జాతీయనాయకులు కానీ, పార్టీలు కానీ ఆవిర్భవించలేదు. రాజకీయపరమైన ఈ ఖాళీని ప్రజాకర్షణ కలిగిన శక్తిమంతులైన రాష్ట్రాల, కులాల నాయకులు భర్తీ చేశారు. వీరిలో ఏ ఒక్కరినీ ప్రాంతీయ స్థాయి నేత అని వర్ణించినా అది అపప్రయోగమే అవుతుంది. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు 1952–77 కాలంలో కేవలం 4 శాతం ఓట్ల శాతాన్ని మాత్రమే సాధించగా, 2002–2018 కాలంలో అది 34 శాతానికి పెరిగింది. ఈ వేసవిలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. తమకు వస్తున్న ఓటింగ్ శాతం ప్రకారం వీరు మరిన్ని స్థానాలను పొందగలరు కూడా. ఇవాళ 34 శాతం ఓటుతో ఈ పార్టీలన్నీ లోక్‌సభ స్థానాల్లో 34 శాతం గెల్చుకోగలవు. ప్రతి అదనపు ఒక శాతం ఓట్లకు గానూ వీరు 11 స్థానాలను అధికంగా పొందనుండగా, జాతీయ పార్టీలు మాత్రం ఒక శాతం అదనపు ఓట్లతో కేవలం 7 స్థానాలు మాత్రమే పొందగలవు. ప్రణబ్ రాయ్, దొరబ్ సోపరివాలా పొందుపర్చిన ది వర్డిక్ట్ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా నేను ఇలా చెబుతున్నాను.
విభజన పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వాటా సాంప్రదాయికంగానే 40 శాతం మేరకు ఉండేది. కానీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి పడిపోయింది. మోదీ మెజారిటీతో ఉన్నా, అమిత్‌షా బీజేపీ సభ్యత్వాన్ని 10 కోట్లకు పెంచినా అసోం, త్రిపుర మినహాయిస్తే, కొత్త ప్రాంతాల్లో ఈ పార్టీ ఎక్కడా గెలుపొందలేదు. వాస్తవానికి దేశంలోని ఒక పరిమిత భూభాగంలో లేక రాజకీయ జనసంఖ్యలో ఇవాళ దేశంలో 20 మంది నాయకులు చాలా బలంగా ఉంటున్నారు. మోదీతో సహా ఏ జాతీయ స్థాయి నేత కూడా వీరి ఓట్లను కొల్లగొట్టలేరు. వీరిలో చాలామందికి పాలనాపరమైన, రాజకీయ పరమైన అనుభవం ఉంది. వీరందరికీ విభిన్న భావజాలాలు, అభిప్రాయాలు ఉండవచ్చు కానీ జాతీయ పార్టీల ఆధిపత్యం పట్ల ఏవగింపును ప్రకటించడంలో వీరందరూ ఐక్యత కలిగి ఉంటున్నారు. హిందీ ప్రాంతాలకు, ఢిల్లీకి బయట ఉన్న విశాలమైన ప్రగతిశీల ప్రపంచం మన ప్రముఖుల అభ్రదత అంశాన్ని ఈ ఎన్నికల సీజన్‌లో పట్టించుకోవడం లేదు. మోదీ గెలవకపోతే ‘కలగూరగంపే’ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దక్షిణాదిలోగానీ, తూర్పునగానీ మోదీ గెలవకపోతే ఎవరు అనే ప్రశ్నేలేదు.
మూడు దశాబ్దాల తర్వాత, కాంగ్రెస్ ఓటమి తర్వాత భారతదేశం నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ ఆధిక్యం కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో ఒక్క చోటా అసలైన ప్రాంతీయ నాయకుడు లేకపోవడం. యూపీ, బీహార్‌లలో లాలూ, నితీశ్, మాయావతి, అఖిలేశ్ బలమైన నాయకులు. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. బీజేపీ వారిని ఎదిరించడం లేదంటే కలుపుకుపోవడం ద్వారా విజయాన్ని పంచుకుంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒక రకంగా కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో వారికి బలమైన నాయకులు లేకపోయినా జాతీయ పార్టీలదే ఇప్పటికీ హవా. మరో కారణం బలమైన రాష్ట్ర నాయకులు ఎదగడానికి జాతీయ పార్టీలు సుముఖంగా లేకపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో తన నిజమైన వారసుడు వైఎస్ జగన్‌ని ఎదగనీయడానికి బదులుగా కాంగ్రెస్ సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. సీఎం పదవిని ఆశించినందుకు ఆగ్రహిం చిన కాంగ్రెస్ పార్టీ, హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం లేదు.
శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్‌లను ఇప్పటికే అది పక్కన పెట్టేసింది. దీంతో భారతదేశపు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశకు చేరుకున్నాయి. హిందీ ప్రాంతానికి బయట నిజానికి జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ ఏర్పడే అవకాశం లేదు. సంకీర్ణ ప్రభుత్వాల పట్ల అభద్రతా భావం కూడా తగ్గుముఖం పడుతోంది. 2014 ఫలితాల్లో వలే పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో 200 స్థానాలు సాధించినా సరే.. పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడే సూచనలు ప్రస్తుతం లేవు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయడానికేమీ లేదు. ఇవి ఎవరికైనా గాలివాటం ఎన్నికలే. 2014లో వలే కాకుండా 2004లో లాగా ఇవి రాష్ట్రాలవారీ ఎన్నికలని ఇప్పుడు మనం గట్టిగా చెప్పొచ్చు. తదుపరి సంకీర్ణానికి ఎవరు నాయకత్వం వహిస్తారని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలీదు. తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించినా రాం విలాస్ పాశ్వాన్ లాంటి వాడు కూడా నోరు తెరవగలిగే మంత్రివర్గం ఏర్పడుతుందని మాత్రమే నేను మీకు చెప్పగలను.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
Comments
Please login to add a commentAdd a comment