చేతిలో ‘చెయ్యి’ అయ్యేనా నాంది? | shekhar gupta opinion on congress, cpm alliance in west bengal | Sakshi
Sakshi News home page

చేతిలో ‘చెయ్యి’ అయ్యేనా నాంది?

Published Sat, Apr 30 2016 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చేతిలో ‘చెయ్యి’ అయ్యేనా నాంది? - Sakshi

చేతిలో ‘చెయ్యి’ అయ్యేనా నాంది?

జాతిహితం

బెంగాల్‌లో మమత వ్యతిరేక కూటమిని కట్టిన సీపీఎం, కాంగ్రెస్‌లకు ఉమ్మడి ప్రణాళిక లేకపోవచ్చు. కానీ, ఆచరణసాధ్యం కాని తన సైద్ధాంతికత  నుంచి సీపీఎం వెనక్కు తగ్గడాన్ని గమనించవచ్చు. వామపక్షాలు సైద్ధాంతిక శుద్ధత నుంచి రాజకీయ వాస్తవికతకూ, మధ్యేవాద వామపక్ష వైఖరికి మార్పు చెందుతున్నాయని చెప్పొచ్చు. వామపక్షాలు మధ్యేవాద దిశగా జరుగుతున్నంతగానూ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వామపక్ష దిశకు మొగ్గుతోంది. ఈ పునరేకీకరణే బెంగాల్ రాజకీయ సందేశం.

ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో ఒక్క ముక్క బెంగాలీ తెలియ కుండా ప్రయాణిస్తున్నాగానీ గోడల మీద ఏమి రాసి ఉన్నాయో మీరు చదివే యగలరు. అవి అసాధారణమైన లిపులలో ఉండటమే కాదు, అవి వేరే వేరే రంగుల్లో కూడా కనిపిస్తాయి. కొల్‌కతా ప్రధాన రహదారుల వెంబడి ఉండే విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన లక్షలాది చిన్న చిన్న లెడ్ లైట్లతో అవి రాసి ఉంటాయి. వినిల్ కాగితంతో, బట్టతో తయారుచేసిన జెండాలు ఒకే చెట్టును, ఇంటి కప్పునే కాదు, బట్టలారేసే తీగను కూడా సంతోషంగా పంచుకుంటూ ఎగరడం కనిపిస్తుంది. సంప్రదాయకమైన సిరా, న్యూస్‌ప్రింట్‌లతో రాసిన రాతలు కూడా కొన్ని కనబడతాయనుకోండి.

వివిధ లిపులలో రాసి ఉన్న ఈ రాతలు 9.3 కోట్ల మంది బెంగాలీలు మాత్రమే రచించగలిగిన ఎంతో సంక్లిష్టమైన, నాటకీయమైన రాజకీయ మార్పును కళ్లకు కడతాయి. పరి బొర్తన్‌ను (మార్పును) తెస్తామనే వాగ్దానాన్ని నమ్మి బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, వామపక్షాలను అధికారం నుంచి పారదోలేలా చేశారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వారు తాము విశ్వసించిన మార్పు వచ్చిందా లేదా అనేది తేల్చుకోవాల్సి ఉంది. అధికారం పట్ల వెంపర్లాట ఇసుమంతైనా మారలేదని ఆ లెడ్ లైట్లే చెబుతాయి. వామపక్షాలు కేవలం ఎర్ర జెండాలతోనే నగరాన్ని నింపేసేవి, పార్టీ నినాదాలతో, భారీ సుత్తీ-కొడవళ్లతో గోడలన్నిటినీ వికృతం చేసేవి.  కాగా మమతా తృణమూల్ రాజధాని నగరాన్నంతటినీ తమ పార్టీ రంగులైన నీలం, తెల్ల రంగులతో నింపేసింది.
 
అదే రాత్రిపూట ప్రధాన రహదారుల గుండా డ్రైవింగ్ చేస్తూ పోతుంటే ఇరువైపులా వేలాడుతున్న  విద్యుద్దీపాల తోరణాలు కూడా అదే రాజకీయ రంగుల్లో కనిపిస్తాయి. అలవాటుగా నేను రాత్రి నడకకు బయల్దేరి కొన్నిమీటర్లు వెళ్లేసరికే నీలం-తెలుపు సముద్రంలో మునిగిపోయాను.
 
వామపక్షాలు కూడా ‘విజేతకే అన్నీ’ అనే ఇవే రాజకీయాలలో పరి పూర్ణతను ప్రదర్శించాయి. అయితే వాటికి వ్యక్తి పూజ ఉండేది కాదు. కాగా టీఎంసీవి పూర్తిగా వ్యక్తి కేంద్రక ప్రభుత్వం, రాజకీయాలు. ఆ పార్టీ సీనియర్ నేతలలో చాలా మంది మమతను అధినేత్రిగా (సుప్రిమో) చెబుతుంటారు. ఈ సుప్రిమో లేదా అధినేత/అధినేత్రి అనే ఈ పద ప్రయోగాన్ని  భారత రాజ కీయాల్లోనే మొట్టమొదటిసారిగా నేను 1993 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచా రంలో జయప్రద (చంద్రబాబునుద్దేశించి) వాడగా విన్నాను. అప్పటి నుంచి ఆ పదం కొన్ని రాష్ట్రాల రాజకీయాలనే నిర్వచించేదిగా మారింది.  తమిళనాడు (జయలలిత), ఉత్తరప్రదేశ్ (మాయావతి), మూడోదిగా బెంగాల్  వాటిలో ప్రముఖమైనవి.
 
హింసాత్మక రాజకీయాల్లో గొప్ప మార్పు
కేడర్ పునాదిగా గల పార్టీ నుంచి అధినేత్రి నేతృత్వంలోని పార్టీకి అధికారం మారినంత మాత్రాన రాజకీయాల స్వభావంగానీ, ధోరణిగానీ లేదా ప్రత్య ర్థుల ప్రచారాల సరళిగానీ మారలేదు. అయితే, వీధి రాజకీయాలకు ఉండే హింసాత్మక స్వభావం విషయంలో అపారమైన మార్పు వచ్చింది. బట్టమీద, వినిల్ మీద రాసి ఉన్న రాతలే ఆ విషయాన్ని తెలుపుతాయి. మొదటిసారిగా ఒకే చెట్టు మీద, ఒకే ఇంటి మీద సీపీఎం, కాంగ్రెస్ జెండాలను చూసి నేను నివ్వెరపోయాను. గతంలో ఇది ఊహించ సాధ్యంకానిది.

గతంలోనైతే ఒక కాంగ్రెస్ పార్టీ మనిషి తమ జెండాను సీపీఎం ఇంటిపై పెట్టడంగానీ లేదా కాంగ్రెస్ ఇంటిపై సీపీఎం జెండాను పెట్టినా రక్తసిక్త పోరాటానికి దారి తీసేదనేది వాస్తవం. మమత మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అమిత్  మిత్రా  మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా సుప్రసిద్ధుడు.1972-2009 మధ్య దాదాపు 57,000 మంది రాజకీయ హింసకు బలైపోయారని  ఆయన చెప్పారు. ‘‘నా నియోజకవర్గానికి రండి. షహీద్ వెదిలను (అమరుల స్మృతి చిహ్నాలు) మీకు చూపిస్తాను.’’ ఒకటి సీపీఎం చంపిన కాంగ్రెస్ మనిషిదైతే, మరొకటి కాంగ్రెస్ చంపిన సీపీఎం మనిషిదిగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. అయితే ఇప్పుడు వివాదాస్పదమైన సింగూర్‌లో సైతం సీపీఎం, కాంగ్రెస్‌లతో  టీ ఎంసీ ఒకే స్థలాన్ని పంచుకోగలుగుతోందనేది వాస్తవం.
 
మొత్తంగా ఒక నివాస ప్రాంతాన్ని కాకపోయినా మొత్తంగా గోడలను పార్టీలు ‘‘ఈ గోడ ఫలానా పార్టీ వారి కోసం రిజర్వు చేసినది’’ అని నెలల ముందే రాసిపెట్టుకునే రాష్ట్రంలో ఈ పరిణామం చాలా ముఖ్యమైనదే. అలాంటి ఆధీన రేఖను అతిక్రమించడం అంటే నిర్దాక్షిణ్యమైన శిక్షను ఆహ్వా నించడంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు వాళ్లంతా ఒకే స్థలాలను పంచుకో వడం రెండు విషయాలను తెలుపుతోంది. ఒకటి, బెంగాల్ రాజకీయాలు కొంత తక్కువ హింసాత్మకంగా మారాయి (ఈ ఎన్నికల ప్రచారంలో ఇంత వరకు ‘‘ఒక్కటే’’ హత్య నమోదైందని మమత సగర్వంగా మనకు చెబుతు న్నారు). ఇక రెండవది, ఐదేళ్లపాటు స్నేహపూర్వకంగా ఉండే పోలీసుల అండ లేకుండా ఉన్న సీపీఎం తన దాదాగిరీ రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది.   
 
విచ్చుకత్తుల పొత్తు నిలిచేనా?
మమతా వ్యతిరేక ఫ్రంట్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న సీపీఎం నేత సూర్జ్య కాంత మిశ్రా, రాష్ట్ర కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురీతో కలసి ఇటీవల ఒకే బహిరంగ సభ వేదికపై నుంచి మాట్లాడారు. ఆ తర్వాత, సీపీఎం పార్టీ ఏ గుణపాఠాలను నేర్చుకున్నదని మిశ్రాను అడిగితే... ‘‘పరిపాలనలో పార్టీ క్యాడర్ల జోక్యాన్ని అనుమతించడం తప్పు’’ అని చెప్పారు. ఇక మీదట అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యకర్తలకు అతీతంగా ఉంచుతామన్నారు. ఆయన తన వాగ్దానాన్ని నిలుపుకుంటారనిగానీ, వారి కూటమి ఎంతో కాలం నిలుస్తుందనిగానీ చాలా మంది నమ్మడం లేదు. ‘‘దశాబ్దాలుగా వారు ఒకరిని ఒకరు చంపుకోవడం చూశాం. ఇప్పుడు వారు మమతను గద్దె దింపాలని మాత్రమే చేతులు కలిపారు. ఆ లక్ష్యం నెరవేరిందే అనుకుంటే ఇక వారిని కలిపి ఉంచేది ఏముంటుంది?’’ అని పేరు చెప్పడానికి సిద్ధపడని ఒక వ్యాపారి అన్నారు.
 
అయితే వారలా అనివార్యంగా విడిపోవడమనేది 2016 నాటి బెంగాల్ రాజకీయ గోడలపై లిఖించి లేదు. అధికారానికి దూరంగా మరో ఐదేళ్ల పాటూ అంధకారంలో గడపడం తమ పార్టీని నాశనం చేసేస్తుందని సీపీఎంకు తెలుసు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే పెద్దగా లెక్కలో లేనిదిగా మారిపోయింది. కాబట్టి ఆ రెండూ పార్టీలకు కలసి ఉండటం తప్ప గత్యం తరం లేదు. వాటికి ఉమ్మడి ప్రణాళిక లేకపోయి ఉండవచ్చు కానీ, సీపీఎం   ఆచరణసాధ్యం కాని తన రాజకీయ ఆర్థిక ైసైద్ధాంతికత  నుంచి వెనక్కు తగ్గడాన్ని ఇప్పటికే మీరు గమనించవచ్చు.

2008 తర్వాత తమ పార్టీ క్షీణి స్తోందని ఆ పార్టీ నేతలు ఇప్పడు అంగీకరిస్తున్నారు. భారత వామపక్షాల విషయంలో ఇలాంటి మార్పంటే, బ్రహ్మాండమైన భూ పలకాల స్థాన చలనం వంటి గొప్ప  పరివర్తనే. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కాంగ్రెస్, తదితర ‘‘లౌకికవాద’’ పార్టీలకు మద్దతునిస్తున్నామని చెప్పడం సాధారణంగా వామ పక్షాలకు అలవాటు. బెంగాల్‌లో, వారి కూటమి నిజమైన లౌకికవాద ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన   పూర్తి రాజకీయ కూటమి.  
 
మధ్యేవాద దిశగా వామపక్షాలు
కేరళలో సాంప్రదాయకవాది అయిన  వీఎస్ అచ్యుతానందన్ ఇంకా సీపీఎంకు నేతృత్వం వహిస్తుండగా నేనిలా అనడం గుడ్డి విశ్వాసం కావచ్చునేమో. కానీ భారత వామపక్షాలు సైద్ధాంతిక శుద్ధత నుంచి రాజకీయ వాస్తవికతకూ, కమ్యూనిజం నుంచి దాదాగిరీ లేని సోషల్-డెమోక్రటిక్, మధ్యేవాద వామ పక్ష వైఖరికి మార్పు చెందడాన్ని మనం చూస్తున్నామని చెప్పే సాహసం చేయ వచ్చనుకుంటాను. బెంగాలీ మాట్లాడే మరో రాష్ట్రమైన త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఈ విధమైన పరివర్తన వారికి చాలా చక్కటి ఫలితాల నిచ్చింది.
 
గోర్బచెవ్, డెంగ్‌లు సంస్కరణలను చేపడుతుండగా భారత కమ్యూని స్టులు ఆ మార్పును ప్రతిఘటిస్తున్నారెందుకు? అనే  అంశంపై నా మొదటి రాజకీయ కథనాన్ని రాయడం కోసం 1988లో ఎప్పుడోగానీ ఇక్కడికి వచ్చాను. ఆ కథనంలో నాటి బెంగాల్ సీపీఎం పార్టీ నేత సరోజ్ ముఖర్జీ సగ ర్వంగా ‘‘డెంగ్, గోర్బచేవ్‌ల దానికంటే మా కమ్యూనిజం మరింత పరిశుద్ధమై నది కాబట్టి’’ అని చెప్పడం కూడా కనబడుతుంది. నేనా విషయాన్ని ప్రస్తా విస్తూ, వామపక్షాలు మన్మోహన్‌తో అంటకాగడం ఏమిటని పదే పదే దాడి చేస్తున్నందుకు ఒక సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ నన్ను మందలిం చారు.‘‘రాజకీయ చరిత్ర నుంచి నేర్చుకో. భారత వామపక్షాలు మారకుండా ఏం లేవు. స్వాతంత్య్రం సమయంలో వారు ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిం చారు. ఇప్పుడు వారిలో చాలా మంది ఎన్నికల పోరాటంలోకి దిగారు. మరింత మార్పు వస్తుంది. వారికి సమయం ఇవ్వాలి’’ అన్నారాయన.
 
రామ్‌నాథ్ గోయంకా హయాం నాటి ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తర్వాత  అంతగా ఎన్నికల సమయంలో రాజకీయ పక్షపాత వైఖరిని చూపుతున్న ప్రధాన బెంగాలీ పత్రిక అవీక్ సర్కార్‌కు చెందిన ‘అమృత బజార్ పత్రిక’  (ఏబీపీ) గ్రూపే. మమతా, ఆమె పార్టీ వారు అవీక్‌కు ఎన్నయినా చెడు ఉద్దేశాలను ఆపాదించవచ్చు. కానీ ఆయన భారతదేశంలోని అత్యంత ధైర్యవంతుడైన పత్రిక యజమాని (మమతా, మోదీలు ఇద్దరితో ఒకేసారి తలపడగల వెర్రివాడు కూడా). బెంగాల్ రాజకీయ గోడలపై రాసి ఉన్న అనివార్య రాజకీయ పరివర్తనను మీరు మొదటి చూపులో గ్రహించకపోయి ఉండవచ్చు. అది ఆయన పత్రిక మొదటి పేజీలోని ప్రధాన శీర్షికలోనే ‘‘చేతిలో చెయ్యి’’ అని రాసి ఉంది. ప్రతి ‘‘చెయ్యి’’నీ సీపీఎం, కాంగ్రెస్ రంగుల్లో అదే వరుసలో చూపారు. ఇది భారత వామపక్షాలలోని  మధ్యేవాద మార్పును సూచించినంతగా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వామపక్ష దిశగా మొగ్గడాన్ని కూడా సూచిస్తుంది. ఈ రాజకీయ పునరేకీకరణే బెంగాల్ ఎన్నికల రాజకీయ సందేశం.      
వ్యాసకర్త: శేఖర్ గుప్తా
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement