
ఆయనలో ఆమె జాడలు
జాతిహితం
రాజ్యపాలన, రాజకీయాలు, ఆర్థిక సిద్ధాంతం విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానం ఎలాంటిదో నోట్ల రద్దు వెనుక ఉన్న ఆకర్షణీయమైన, లోతైన ఒక అంశంలో ప్రతిబింబిస్తున్నదని అనుకోవచ్చు. 1971 నాటి భారత్–పాక్ యుద్ధం 45వ వార్షికోత్సవాన్ని దేశం జరుపుకుంటున్న ప్రస్తుత సందర్భంలో ఈ వారం రాస్తున్న వ్యాసంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందిరాగాంధీ నాయకత్వ ప్రాభవం మధ్యాహ్న మార్తాండునిలా వెలిగిన కాలమది..
ఇక్కడే ఒక విషయం ప్రస్తా వించాలి. నరేంద్ర మోదీతో పాటు, ఆయన మాతృసంస్థ ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్పథం యావత్తూ నెహ్రూ ఆజన్మాంతం ఆచరించిన విధానాల ఎడల బద్ధవైరంతో నిర్మితమైనవే. కానీ, ఇందిరాగాంధీ రాజకీయ ఆర్థిక విధానంతో పాటు; రాజకీయాలలో, వ్యవహార సరళిలో ఆమె శైలిని అనుసరించక తప్పని స్థితిలో ఒక ఆరాధనా భావం కూడా వారిలో కనిపిస్తుంది.
పోవర్టేరియనిజంకు మద్దతా?
ఈ విషయాన్ని మనం ప్రభుత్వం వారి అభిమాన ఆర్థికవేత్త ఆచార్య జగదీశ్ భగవతి ప్రస్తావనతో విశ్లేషించడం ఆరంభిద్దాం. నోట్ల రద్దు అంశాన్ని సమర్థించే పనిని కాస్త ఆలస్యంగా మొదలుపెట్టిన భగవతి గడచిన వారం ఒక విషయాన్ని మనందరికీ గుర్తు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగాన్ని చాలా ఏళ్లు బోధించిన వ్యక్తిగా ఒక అంశాన్ని కచ్చి తంగా చెప్పగలననీ, ప్రభుత్వం చలామణీ చేసే నోట్లు, నాణేల విషయంలో పౌరుల హక్కులను నిరాకరించడం ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదనీ ఆయన చెప్పారు. కొంత పరిహారం చెల్లించే అనుకోండి, ‘సామాజిక అవ సరాల’ కోసం పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం రాజ్యాం గానికి గతంలో జరిగిన కొన్ని సవరణల ద్వారా ప్రభుత్వానికి దఖలు పడిందని కూడా భగవతి చెప్పారు. లేకపోతే జమిందారీలు, రాజభరణాల రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండేదని కూడా ఆయన అన్నారు.
అయితే హోదా కోల్పోయిన రాజులకూ, జమిందార్లకూ ఎంత నష్ట పరిహారం ముట్టచెప్పారో మనం అడగడం లేదు. ఎందుకంటే ఆ అంశం సాధారణ ప్రజానీకానికి సంబంధించినది కాని, అసలు ప్రస్తుత సమస్య కాని కాదు. నిబద్ధత కలిగిన ఈ సంస్కరణల అనుకూల గౌరవ ఆర్థికవేత్త ఒక సోషలిస్ట్ సంస్కరణను కాంగ్రెస్ వారి, ముఖ్యంగా ఇందిరాగాంధీ పెంచి పోషించిన పోవర్టేరియనిజం (మిమ్మల్ని దారిద్య్రంలో ఉంచడం మా జన్మహక్కు)కు సాధికారిత కల్పించడానికీ, తాత్కాలికంగానే అయినా దేశాన్నీ, ఆర్థిక వ్యవస్థనీ అతలాకుతలం చేసిన రాజ్యపు పశుబలాన్ని సమ ర్థించే పనికిS ఉపయోగించడానికి సిద్ధపడుతున్నారు.
ఏమిటీ వైరుధ్యం
ఇది వ్యక్తిగత అంశం కాదు. అలాగే ఇది ఆచార్య భగవతి గురించి చెప్పడం కూడా కాదు. మనకి చరిత్ర తెలుసు. ఆచార్య భగవతి, ఆచార్య అమర్త్యసేన్ వంటి ఇద్దరు మహానుభావులు ఒక అంశం మీద మాట్లాడితే అందులో ఒకదానిని వ్యతిరేకించడానికి అవసరమైన అవగాహన మన ప్రజలకు వచ్చింది. ఇక్కడ కీలక అంశం ఏమిటి? ఆర్థిక సంస్కరణలు, వృద్ధి వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి, అవి గుజరాత్‌లో సాధించిన వ్యక్తిగా చరిత్ర ఉన్న నాయకుడూ; ఆయన ఎంతో ఆరాధించే ప్రపంచ ఆర్థికవేత్త కూడా ఇందిరాగాంధీని, ఆమె విధానాలను, ఇంకా ఆమె ఇతర మార్గాలను, మరీ ముఖ్యంగా విపత్కర ఆర్థిక విధానాలను అను సరించిన ఆ నాయకురాలి పట్ల ఆరాధనా భావం ఎలా ఏర్పరుచుకున్నారు? దీనినే మరో విధంగా చెబితే, తొలి సంస్కరణ చర్యగా ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసిన ప్రధానమంత్రి, బ్యాంకుల జాతీయకరణవల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన కేంద్రీకృత స్వభావాన్ని ఎలా మార్చగలరు?
మోదీలో ఇందిర కనిపించడం లేదా?
1971 యుద్ధ విజయం 45వ వార్షికోత్సవం ఈ వారమంతా అధికారికంగా జరుపుతున్నారు. అయితే ఇందులో ఇందిరాగాంధీ ప్రస్తావన అంతగా ఏమీ కనిపించడం లేదు. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే నరేంద్ర మోదీ రాజకీయాలను కనుక నిశితంగా పరిశీలిస్తే ఇందిర శైలితో సమాం తరంగా ఉండే కొన్ని లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి. నిరసన భావంతో కూడిన ఒక ఆరాధన కూడా కనిపిస్తుంది.
వ్యవస్థలను తమ వైపు తిప్పుకోవడంలోని ఆ ప్రతిభను చూడండి. పన్నుల శాఖలోని కింది స్థాయి ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయి విచక్షణా ధికారాలను దఖలు పరచడానికి ఉద్దేశించిన ఒక సవరణను ఆదాయపు పన్ను చట్టంలో తీసుకువచ్చారు. దీనితో పాతికేళ్ల సరళీకరణ ప్రయాణాన్ని దిగ్విజయంగా పాడుచేయవచ్చు. ఈ చట్ట సవరణ మీద ఒక్క వాక్యం కూడా చర్చ జరపకుండా, కేవలం మూజువాణీ ఓటుతో లోక్‌సభలో ఆమోదింపచేశారు. హైకోర్టు న్యాయ మూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించి పంపిన ప్రతిపాదనలలో సగానికి సగం తిప్పి పంపడం మరొకటి. ఇంతదాకా మీరు చేసిందేనంటూ విపక్షాన్ని శపిస్తూ గడచిన రెండు రోజులుగా పార్లమెంటును స్తంభింపచేయడానికి అధికార పక్షాన్నే ఉపయోగించుకోవడం మరొకటి.
రిజర్వు బ్యాంక్ గవర్నర్ స్థాయిని ఆర్థిక మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి స్థాయికి దిగజార్చడం ఇంకొకటి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఐఏఎస్ అధికారులు చేసే పని ఒక్కటే–కరెన్సీ విధానంలో వచ్చిన రోజువారీ మార్పుల గురించి నిరంతరాయంగా మాట్లాడడమే. మరోపక్కన ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒకరు ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతున్నదనీ, బడ్జెట్‌లో వడ్డీరేట్లను కూడా తగ్గించబోతున్నదనీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు.
బోధనలు, మాటలతో ఒప్పించడం సాధ్యం కాదంటూ ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడే ఒక గట్టి మద్దతుదారుడు లేదా సిద్ధాంతవేత్త అభి ప్రాయంలో ఇదంతా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం మార్పును తీసుకురావలసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే పశుబలాన్ని కూడా ప్రయోగించవలసిందే. విధివిధానాలలో లేదా వ్యవస్థలతో ప్రమాదం పొంచి ఉందా, అయితే–అసలు వ్యవస్థనే పూర్తిగా నిరాకరించాలి. ఇందిరా గాంధీ చేసిన పని సరిగ్గా ఇదే. 1967 నాటి ఎన్నికలలో ఎదురైన అపజయాలు ఇచ్చిన ప్రేరణ వల్ల అయి ఉండాలి, ఆమె వ్యవస్థను సర్వనాశనం చేసే ఒక బృహత్ ప్రణాళికను ఆరంభించారు. తన మంత్రిమండలితో పాటు, పార్టీ నాయకత్వాన్ని కూడా డూడూబసవన్నల స్థాయికి దింపేశారు. సామాజిక నిబద్ధత పేరుతో ఇతర వ్యవస్థలను, ఉద్యోగస్వామ్యాన్ని కూడా బలహీనం చేశారు. ఒకరకమైన అతి జాతీయవాద స్పృహను, పాశ్చాత్య వ్యతిరేకతను రగిలించారు. అతిశయాన్ని, నిజాయితీలేని సామ్యవాదాన్ని ఉనికిలోకి తెచ్చారు.
పరివార్ లక్ష్యం నెహ్రూయే
అయితే నెహ్రూ చింతనను, విధానాలను నిలదీసిన స్థాయిలో ఆరెస్సెస్ ఏనాడూ ఈ విధానాలలో చాలా వాటిని ప్రశ్నించలేదు. పైగా ఇందిర పట్ల వారి అభిమానమంతా వెల్లువెత్తినది 1969–77 మధ్యనే కావడం విశేషం. నిజానికి నెహ్రూ నిర్మించిన ప్రజాస్వామ్య సౌధాన్నీ, నైతిక–సర ళీకృత ప్రజాస్వామ్యాన్నీ, మిగిలిన అన్ని వ్యవస్థలనూ ఇందిరాగాంధీ ధ్వంసం చేసిన కాలం కూడా సరిగ్గా అదే. అయితే నెహ్రూ వారసత్వాన్ని ఆయన కూతురు కంటే ఎక్కువగా ధ్వంసం చేసినది వీరే. పౌరుల హక్కులను కాలరాయడం, ప్రతిపక్షాలను జైళ్లలో కుక్కడం వంటి వాటి ద్వారా ఇందిర అలాంటి స్థితికి చేరారు. నెహ్రూ ఇలాంటివి కలలో కూడా ఊహించలేదు. మోదీ, ఆరెస్సెస్ ఉద్దేశం కూడా కఠినమైన ప్రభుత్వం ఉండాలనే. అవసరమైనచోట ‘దండం’ ఉపయోగించడం కూడా. అంతేకానీ మీడియానీ, పౌర సమాజాన్నీ, నిపుణులు, ఆఖరికి న్యాయమూర్తులను పట్టించుకోవడం వారి ఉద్దేశం కాదు.
ఇప్పుడు గాని, మోదీ యుగానికి ముందు గాని ఇందిరాగాంధీ మీద బీజేపీ–ఆరెస్సెస్ సంధించిన విమర్శలు ఆమె రాజకీయ కార్యకలాపాలకు పరిమితమై మాత్రమే కనిపిస్తాయి. అంతే తప్ప ఆమె ఆర్థిక విధానాల గురించిన విమర్శలు కావు. ఆఖరికి 1977లో ఇందిరాగాంధీని ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సరళంగా లేని ఆమె రాజకీయ చట్టాలను, చర్యలను పక్కన పెట్టారేగానీ, ఆమె అనుసరించిన ఆర్థిక విధా నాలను వారు కూడా కొనసాగించారు. సోషలిస్ట్ సిద్ధాంతాలతో మమేకం కావడం ఇక్కడ ఎవరి ఉద్దేశమూ కాదు. అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒక దశలో ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరించే పని చేపట్టారు. అయితే దీనికి ఆరెస్సెస్ నుంచి వెనువెంటనే వ్యతిరేకత వచ్చింది. ఇదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ప్రచ్ఛన్న యుద్ధ అనంతర కాల రాజకీయ వ్యవస్థకు మార్గం సుగమం చేసింది. ఈ రెండు పరిణామాలకు కారకుడైన బ్రజేశ్ మిశ్రాను అమెరికా అనుకూల, పంచమాంగదళ సభ్యుడు అని ఆయన బృందంలోనే ముద్రవేశారు.
ఆలోచనలన్నీ ఆమెవే
నరేంద్ర మోదీ రాకతో కొన్ని ఆశలు వెల్లువెత్తాయి. గుజరాత్‌లో ఆయనకు ఉన్న పేరును బట్టి ఇందిర ఆర్థిక విధానాలకు (ఇందిరానోమిక్స్) మంగళం పాడతారని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన నెహ్రూ ప్రతి పాదించిన సరళ భావాలు, సెక్యులరిజమ్ వంటివాటిలో పెను మార్పులు తీసుకురావడానికే పరిమితమయ్యారని తేలుతోంది. ఇందిర అనుసరించిన అన్ని ఆర్థిక ఆలోచనలు బలోపేతం కావడం ఇప్పుడు చూస్తున్నాం.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta