భారత్‌తో వెయ్యేళ్ల పవిత్రయుద్ధాన్ని కొనసాగిస్తానని నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రకటించి 50 ఏళ్లు గడిచాయి. ఈ యాభై ఏళ్లలోనే పాక్ తన సైనిక బలాన్ని మినహాయిస్తే ఉజ్వల గతాన్ని కోల్పోయింది. జనాభా పెరుగుదలలో తప్పిస్తే ఏ రంగంలోనూ భారత్‌తో పోటీ పడే స్థాయి పాక్‌కు లేదు. పుల్వామా ఘటన తర్వాత పాక్ భూభాగంపై భారత్ యుద్ధ విమానాలు దాడి చేసినా అరబ్ దేశాలతో సహా యావత్ ప్రపంచం భారత్‌నే బలపర్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను పక్కనబెట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కొత్త అడుగు వేయకపోతే పాక్ ఒక జాతిగా, దేశంగా మరింత దిగజారిపోవడం ఖాయం. ఇమ్రాన్‌కు ఆ శక్తి ఉందా అన్నదే కీలకం.
నేటి పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు సవాళ్లు ఎదురవుతాయి. పాక్ చరిత్ర, దాని భూభాగం లేదా రాజకీయాలపై లేక ఆ దేశం గురించిన ఏ అంశంమీద అయినా సరే మాట్లాడాలని ఉన్నా ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నదే ప్రశ్న. ఇప్పుడు వింగ్ కమాం డర్ అభినందన్ వర్థమాన్ భారత్‌కి తిరిగి వచ్చే క్షణాల కోసం మనందరం వేచి ఉంటున్నాము. గతంలోకి వస్తే పాక్‌పై చర్చకు నేను 2009, 1999, 1989, 1979 సంవత్సరాలను కూడా ఎంచుకునేవాడిని. అయితే వీటన్నిటికీ బదులుగా నేను మిమ్మల్ని ఇప్పుడు 1969 సంవత్సరంలోకి తీసుకువెళుతున్నాను. కలవరపడవద్దు. మీరు వర్తమానంలోకి త్వరలోనే తిరిగివస్తారు.
ముస్లిం దేశాలపై 1967లో సాగించిన ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుత విజయం సాధించిన తర్వాత ముస్లిం దేశాలు 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ)ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నాయి. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ సదస్సుకు దూరంగా ఉండటానికి బదులుగా తన మంత్రి పక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ (తదువరి భారత రాష్ట్రపతి)ని భారత ప్రతినిధి బృందం అధిపతిగా పంపించాలని నిర్ణయించారు. కానీ ఆమె ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఆనాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కల దేశం (పాక్) ప్రాతినిధ్యం లేకుండా ఓఐసీ ఉనికిలోకి రావడం అసాధ్యమన్న తర్కాన్ని ఇస్లామిక్ ప్రపంచం అంగీకరించింది కూడా. ఆనాటికి పాకిస్తాన్‌ను రెండుగా విడిపోలేదని గుర్తుంచుకోవాలి. దీంతో భారత్ రాకను ఓఐసీ తిరస్కరించింది. భారత్‌కు అవమానమే మిగిలింది.
సరిగ్గా 50 ఏళ్ల ముందుకెళ్లి చూడండి. నాలుగో ఇస్లామిక్ దేశాల సమితి సదస్సులో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గౌరవనీయ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా కలి గిన మూడో దేశంగా భారత్‌ను ఎత్తిపడుతూ ఆమె ఆ సదస్సులో అద్భుతంగా ప్రసంగించారు. ముస్లింలు భారతీయ వైవిధ్యతలో భాగమని, భారతీయ ముస్లింలలో కేవలం 100 మంది మాత్రమే ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆమె తెలిపారు.
అయితే ఈ అంశానికి సంబంధించి చాలా భిన్నమైన, సరైన వాదనలు కూడా ఉన్నాయనుకోండి. భారత జాతీయ స్రవంతిలో ఉన్న ముస్లింలను సుష్మా స్వరాజ్ పార్టీ వేరుగా చూడడం, జాతి మొత్తం నుంచి వారిని దూరంగా ఉంచడం, కశ్మీర్‌లను రాక్షసులుగా చిత్రీకరించడంపై చాలా వ్యతిరేకత కూడా ఉంటోంది. కానీ ఒక మతవాద హిందూ జాతీయ మూలాలున్న భారత ప్రభుత్వానికి చెందిన ఒక అత్యున్నత మహిళా నేత ప్రపంచ ముస్లింలకు తన దేశ ముస్లింల గురించి ఇలా చెప్పడంలోని ప్రాధాన్యతను తక్కువ చేసి చూడవద్దు. పైగా భారత్‌ను ఆతిథ్య దేశంగా ఆహ్వానించారన్న దుగ్ధతో పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల కూటమి సదస్సుకు గైర్హాజర్ కావడాన్ని మనం విస్మరించకూడదు.
సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే పాక్ ఇస్లామిక్ దేశాల కూటమిలో భారత్ చేరికనే వీటో చేయగలిగేటంతటి శక్తిని కలిగి ఉండేది. ఈరోజు భారత్‌కు ఆహ్వానం పట్ల తీవ్ర వ్యతరేకతతో సరిపెట్టుకోవడమే కాకుండా అవమానకరంగా ఆ సదస్సునే పాక్ బహిష్కరించే స్థితిలో పడిపోయింది. తన అణ్వాయుధాలతో, క్షిపణులతో, 20 కోట్లమంది ముస్లిం జనాభాతో ఇస్లామిక్ దుర్గంగా తన్ను తాను పిలుచుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ఎలాంటి విషాద స్థితిలోకి కూరుకుపోయిందో ఆలోచించాల్సిందే.
1979లో సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్‌ను దురాక్రమించిన తర్వాత పాకిస్తాన్ ఉన్నట్లుండి అమెరికాకు, దాని మిత్ర దేశాలకు, సౌదీ ఆరేబియా, చైనాలకు కూడా ఆప్తమిత్రురాలైపోయింది. 1971 యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఉంటున్న పాకిస్తాన్‌కు దీంతో తన సైన్యాన్ని సాయుధం చేయడం సులభమైపోయింది. ఉన్నట్లుండి పాక్ నియంత జియా ఉల్ హక్ జిహాదీల నిజమైన నేతగా అవతరించేశారు. ఆప్ఘనిస్తాన్‌లో ప్రచ్చన్నయుద్ధం ప్రభావంతో పాకిస్తాన్ సాధించిన ఈ కొత్త శక్తి జియాకు పూర్తిగా తలకెక్కేసింది. సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యంపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తమకు భారత్‌తో యుద్ధం చేయడం ఒక లెక్కా అనేంత గర్వం జాతీయస్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాతే భారత్‌లోని పంజాబ్‌లో 1981లో తీవ్రవాదం మొదలైంది.
పాక్ ఆధిపత్యం శిఖరస్థాయిలో ఉన్న ఈ దశలోనే నేను పాక్‌లో తొలిసారిగా పర్యటించాను. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సిక్కు తీవ్రవాదులపై పాక్‌లో జరుగుతున్న విచారణను నివేదించడానికి 1985 వేసవిలో పాక్ వెళ్లాను. అక్కడి ప్రజల సంపద, జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన టెలికామ్ సర్వీసులు వంటి అంశాల్లో సగటు పాకిస్తానీయులు 1985లో సగటు భారతీయులకంటే ఎంతో మిన్నగా జీవించేవారు. ఎందుకంటే పాక్ తలసరి ఆదాయం అప్పట్లో భారత్ కంటే 60 శాతం అధికంగా ఉండేది.
మళ్లీ ఇప్పుడు 2019కి వద్దాం. నేడు సగటు భారతీయుడు పాకిస్తానీయుల కంటే 25 శాతం అధికంగా సంపాదిస్తున్నాడు. ప్రచ్చన్నయుద్ధ విజయం ద్వారా సరికొత్త భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యత సాధించిన పాకిస్తాన్ 60 శాతం సంపదను పొగొట్టుకుని భారత్ కంటే చాలా వెనుకబడిపోయింది. ప్రతియేటా ఈ అంతరం 5 శాతం మేరకు పెరిగిపోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు పాక్ కంటే 3 శాతం అధిక పాయిం ట్లతో ముందుకెళుతోంది. పాక్‌ను దాటి మనం ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం. 50 ఏళ్ల క్రితం నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో భారత్‌పై వెయ్యేళ్ల యుద్ధానికి పిలుపిచ్చారు. అయితే 1969 తర్వాత గడచిన 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను ఎంతగా కోల్పోయిందంటే, ఇస్లామిక్ దేశాల కూటమి సైతం భారత్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. మరీ ముఖ్యంగా జిహాద్‌ను జీవనంగా మార్చుకున్న గత 40 ఏళ్ల కాలంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయింది. భారత్‌తో శాశ్వత రక్తపాత ఘర్షణలకు గాను పాక్ చెల్లించాల్సి వచ్చింది దీంతోనే ముగియలేదు.
1989లో ఓటమిని అంగీకరించిన సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిచేందుకు చర్చలు ప్రారంభించింది. దాంతో విజయోన్మాదం తలకెక్కిన పాక్ పాలనా యంత్రాంగం తన దృష్టిని తూర్పువైపు మళ్లించింది. ఆ తర్వాత మూడేళ్లపాటు కశ్మీర్, పంజాబ్ రక్తమోడాయి. వేలాది మంది శవాలుగా మిగిలారు. ఆ తర్వాత పాక్‌లో అంతర్గత మార్పులు సంభవించి నవాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎంపికై 1999 జనవరిలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయితో శాంతి చర్చలను ప్రారంభించారు.
అదే సమయంలో ఆయన సైన్యం కార్గిల్‌లో యుద్ధరంగాన్ని సృష్టించింది. పాక్ ఆ యుద్ధాన్ని కోల్పోయింది. దాంతోపాటు రెండు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే అభిప్రాయం ప్రపంచ స్థాయిలో ముగిసిపోయింది. ఆధీన రేఖ వాస్తవ సరిహద్దుగా ఉంటుం దని, దాన్ని ఇరుదేశాలూ గౌరవించాలనే అభిప్రాయం బలపడింది. పెర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా నవాజ్ షరీప్‌ను దించేశారు. దీంతో పాక్ ప్రజాస్వామ్యం మళ్లీ కనుమరుగైంది. ఆ పదేళ్ల కాలంలో పాకిస్తాన్ కశ్మీర్‌పై తన నైతికాధికారాన్ని చేజార్చుకుని సైనిక పాలనన కౌగలించుకుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం. స్వీయ విధ్వంసకరమైన ఆలోచనా తత్వం.
అప్పటినుంచి మనం చాలా దూరం వచ్చేశాం. 2008 ముంబైలో ఉగ్రవాద దాడి ఉన్మాదంతో పాకిస్తాన్ గ్లోబల్ జిహాద్ కేంద్రంగా తన స్థానాన్ని చక్కగా పదిలిపర్చుకుంది. భారత్ విషయానికి వస్తే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించకుండా సంయమనం పాటించిన భారత్ తక్కిన ప్రపంచాన్ని తనవైపునకు లాక్కుంది. ఫలితంగా ఈరోజు పుల్వామా దాడి తర్వాత పాక్‌పై ఎదురుదాడి చేసినప్పటికీ సౌదీ అరేబియా, యూఏఈతో సహా యావత్ ప్రపంచ మద్దతును భారత్ పొందుతోంది.
ఈ మొత్తం చరిత్రను అవలోకిద్దాం. కేవలం 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాధాన్యతను కోల్పోయింది. అరబ్ దేశాలు దాన్ని నిరోధిస్తున్నాయి. ఇరాన్ శత్రుపూరితంగా ఉంది. గత 40 ఏళ్ల కాలంలో పాక్ తలసరి ఆదాయం భారత్‌తో పోలిస్తే 90 శాతం లోటుతో కునారిల్లుతోంది. ఈ అంతరం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. గత 30 ఏళ్ల గతాన్ని చూస్తే పంజాబ్, కశ్మీర్‌లో తన సైనిక కేంపెయిన్లను పాక్ కోల్పోయింది. అదే సమయంలో పాక్ నగరాలు, వ్యవస్థలు శాశ్వతంగా జిహాద్ దుర్గాలుగా మారాయి. గత 20 ఏళ్ల కాలంలో ఆధీనరేఖ కశ్మీరులో వాస్తవ సరిహద్దుగా మారిపోయింది. ఉగ్రవాదాన్ని ఒక విధానంగా కొనసాగించడాన్ని ఏ ఒక్కరూ ఇప్పుడు సహించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంపై భారత్ వైమానిక దాడులు చేసినప్పటికీ ఏ ఒక్క దేశమూ దాన్ని ఖండించిన పాపాన పోలేదు. పైగా పాక్ పదే పదే ప్రదర్శిస్తున్న అణు బూచిని భారత్, ప్రపంచం కూడా లెక్కచేయడం లేదు.
ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత పాలకుల విధానాలనే కొనసాగించవచ్చు లేక సరికొత్త ఆలోచనలతో నూతన ఇన్నింగ్స్‌ని ప్రారంభించవచ్చు. ఇమ్రాన్ సాహసంగా అడుగులేస్తే అది ప్రమాదకరమే కానీ దానివల్ల పాకిస్తాన్ విజయపథంలో నడిచే అవకాశం ఉంది. ఇమ్రాన్ అలా చేయలేకపోతే, రెండు విషయాలు మాత్ర పక్కాగా జరుగితీరుతాయి. వ్యక్తిగా ఇమ్రాన్ వైఫల్యం. ప్రతిభావంతులైన ప్రజలు, బలమైన జాతీయవాదం, భౌగోళిక సంపన్నత, బలమైన సైన్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఒక జాతిగా దిగజారిపోవడం కొనసాగుతుంది. పాక్ భవిష్యత్తుకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఇదే మరి.
వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment