అణ్వాయుధాలను ఒక దేశ శక్తి సంపన్నతకు కొలమానాలుగా భావించిన కాలం అంతరించింది. ఆర్థిక సుస్థిరతే ప్రపంచస్థాయిలో దేశాల పలుకుబడికి సంకేతంగా మారిన కాలం ఆవిర్భవించింది. ఈ కోణంలో చూస్తే భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదానికి ఆధీనరేఖ వద్ద పాక్ సైనిక బలగాల మోహరింపు, దాని క్షిపణి ప్రయోగాల బూచి, భారత్ భూభాగంపై చైనీయుల ఆక్రమణ కారణాలు కానేకావు. గత పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా అడుగంటిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ అస్థిరతే అసలు ప్రమాద హేతువుగా మారుతోంది. సరిహద్దుల అవతల నుంచి కాకుండా దేశంలోపల పెరుగుతున్న ఈ ప్రమాదం అంతర్జాతీయంగా మన స్థాయిని దెబ్బతీయబోతోంది. పాలకులు తగు గుణపాఠాలు తీసుకోకపోతే మనపట్ల ప్రపంచ సదభిప్రాయం కరిగిపోయే అవకాశం తప్పదు.
భారతదేశం ప్రస్తుతం ఒక సరికొత్త వ్యూహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. ఇది భారత్–పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ వద్దకు పాకిస్తాన్ మరొక సైనిక బ్రిగేడ్ తరలించడం కాదు. నాటకీయ ఫక్కీలో అది మరొక క్షిపణి ప్రయోగం చేయడం కాదు. భారత భూభాగంలో చైనీ యులు సరికొత్త ఆక్రమణ చేపట్టడం అంతకంటే కాదు. ఈ మూడు అంశాలు వ్యూహాత్మక ప్రమాదానికి కారణాలు కావు. మన సాంప్రదాయిక శత్రువుల నుంచి ఈ ప్రమాదం కలగలేదు. ఇది దేశం లోపలనుంచే పుట్టుకొస్తోంది.
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గుడ్‌విల్ కలిగిన, ముంబైపై ఉగ్రవాద దాడుల తర్వాత ‘ఎదుగుతున్న మంచబ్బాయి’లా పేరు పొందుతున్న మన అతి గొప్ప సంపదను ఈ సరికొత్త ప్రమాదం ధ్వంసం చేయనుంది. అదేమిటో కాదు అడుగంటిపోతున్న మన ఆర్థిక శక్తి. దేశ సుస్థిరతకంటే, ప్రజాస్వామ్యం కంటే భారత్‌ను సమున్నతంగా నిలుపుతూ వచ్చిన ఆర్థిక సంపన్నత క్షీణతే మనం ఎదుర్కొనబోతున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదం.
సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా చూద్దాం. మీ ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేక ఆపై స్థాయిలో పెరుగుతున్నప్పుడు, ఏడు హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. అదే 7 శాతం వృద్ది జరుగుతున్నప్పుడు 5 హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. కానీ మీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయినప్పుడు మీరు ప్రమాదకరమైన జోన్‌లో ఉన్నట్లే లెక్క. ఆర్థిక సంస్కరణలు 1991 వేసవిలో ప్రారంభమైనది మొదలు గత పాతికేళ్లుగా పాశ్చాత్యదేశాలు, తూర్పు, మధ్యప్రాచ్యం తేడా లేకుండా యావత్ ప్రపంచానికీ ప్రీతిపాత్రమైన దేశంగా భారత్ ఎదుగుతూ వచ్చింది.
ప్రపంచంలోని పలుదేశాలు అనేక కారణాలతో సంఘర్షించుకుంటున్న తరుణంలో భారత్ తన విశిష్టమైన సామాజిక–రాజకీయ లక్షణాలతో వైవిధ్యపూరితమైన సంస్కృతితో, ప్రజాస్వామిక, వ్యూహాత్మక దన్నుతో ప్రపంచంలో తనదైన గుర్తింపును పెంచుకుంటూ వచ్చింది. కార్గిల్ యుద్ధం, పార్లమెంట్‌పై దాడి, ముంబైపై ఉగ్రవాద దాడి సందర్భంగా ప్రపంచ దేశాలనుంచి భారత్ పొందిన మద్దతులో ఈ గుర్తింపును చూడవచ్చు.
వీటన్నింటికంటే భారత్‌కున్న అతి పెద్ద శక్తి ఆర్థికమే. యావత్ ప్రపంచం ఒక మోస్తరు వేగంతో పెరుగుతున్నప్పుడు, భారత్ అతివేగంగా ఎదుగుతున్న రెండో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతూ వచ్చింది. పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆవిష్కరణలు, విదేశీ పెట్టుబడుల పట్ల సానుకూలత, సుస్థిర మార్కెట్లు, సరళమైన పన్నుల వ్యవస్థ కారణంగా అది.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి సులువుగా బయటపడిన భారతపై యావత్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది.
ఈ కాలం పొడవునా సంక్షుభిత ప్రపంచంలో ఒక స్నేహపూర్వకమైన, సుస్ధిరమైన ఉపఖండంలాగా భారత్ ఎదుగుతూ వచ్చింది. అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియోలు, ప్రత్యక్ష మదుపులను అది అయస్కాంతంలా ఆకర్షించింది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్ధిరత, భద్రతను చూసి చైనాతో సహా బడా ఆర్థిక శక్తులు, వాటి కార్పొరేషన్లు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడ్డాయి. భారత్ తన సైన్యంపై పెట్టే వ్యయం స్తంభించిపోయినప్పుడు, దాని ఆధునికీకరణ దశ తప్పినప్పుడు, ఆసక్తి కలిగించే దాని ఆర్థికవ్యవస్థే భారత్‌ని అతి గొప్ప వ్యూహాత్మక శక్తిగా మార్చింది.
భారీ స్థాయి అణ్వాయుధాల కంటే పెరుగుతున్న జీడీపీనే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా లెక్కిస్తున్నారు. ఏ ఇతర ఆర్థిక వ్యవస్థలోనూ లేనివిధంగా అసంఖ్యాక దిగుమతులను చేసుకునే భారత్ సామర్థ్యంపై చైనా ఆధారపడుతోందంటే అది భారత్‌కు వ్యూహాత్మక సంపదగా మారినట్లే. ప్రత్యేకించి కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదదాడి వంటి సందర్భాల్లో భారత్–పాక్ మధ్య యుద్ధ సంక్షోభం నెలకొన్నప్పుడు చైనా స్పందనలను గమనించండి.
2009లో దలైలామా తవాంగ్ సందర్శన సమయంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని బలహీన ప్రభుత్వం సైతం చైనాకు ఎదురొడ్డగలగడమే కాకుండా దాని అసంతృప్తిని సునాయాసంగా చల్చార్చింది కూడా. ఇక మోదీ తొలి దఫా పాలనకేసి చూస్తే, ఆర్థిక వృద్ధి కొనసాగడమే కాకుండా 2012–14 నాటి స్తబ్దతను అధిగమించింది. ఇది భారత్‌కు, మోదీకి కూడా ఉపకరించింది. ప్రపంచ నేతల్లో మోదీ ప్రతిష్ట, పలుకుబడి గొప్పగా పెరుగుతూ వచ్చింది. కానీ తన ఈ ప్రతిష్టను పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ స్వయంగా దెబ్బతీసుకున్నారు. నాటినుంచే మన ఆర్థికవృద్ధి పతనమవుతూ వచ్చింది.
మోదీ హయాలో ఆర్థిక వ్యవస్థ గత నాలుగు త్రైమాసికాల్లోనే భారీ పతనం చవిచూసింది. ఈరోజు అది కోలుకునే ఆశలు కనిపిం చడం లేదు. ఇదే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దెబ్బతీస్తోంది. ఆర్టికల్ 370 రద్దుపై వస్తున్న అనేక స్పందనల్లో ఇది ప్రతి బింబిస్తోంది. 1971 నాటి యుద్ధం ప్రారంభం నాటి నుంచి భారత్ ఏ రూపంలోనైనా సరే పాక్‌కు వ్యతిరేకంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యల్లో ఇదే అతిపెద్దది. నిజానికి ఇది కశ్మీర్‌కు సంబంధించి పెద్ద మూలమలుపు. అయితే మన ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక క్షీణతకు తొలి సూచన ఆర్టికల్ 370 రద్దుకు ముందే ట్రంప్ చేసిన ప్రకటనలో వ్యక్తమైంది. ఇమ్రాన్ సమక్షంలో.. భారత్–పాక్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ య«థాలాప ప్రకటన చేశారు.
ఒక విషయం మాత్రం నిజం. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నపుడు ట్రంప్ ఇలాంటి చొరవ చేసి ఉండటం సాధ్యపడి ఉండేది కాదు. అమెరికన్ కంపెనీలు అమెరికాలో కాకుండా భారత్‌లో పెట్టుబడులు, పరి శ్రమలు పెట్టి లాభాలు దండుకుంటున్నాయన్నది ట్రంప్ తొలినుంచే చేస్తూ వస్తున్న ఆరోపణ. భారత్‌లో అమెరికన్ దిగుమతులపై అధిక పన్నులు విధిస్తున్నారనీ ట్రంప్ ఆరోపించేవారు. అలాంటిది.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పడం ఆషామాషీ ప్రకటనగా భావించలేం.
చివరకు బలహీనమైన బ్రిటన్ టోరీ ప్రభుత్వం కూడా కశ్మీర్‌పై భారత్ వ్యవహారంపై విమర్శలు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత వ్యతిరేక ధోరణిని కూడా ప్రదర్శించింది. భారత ఆర్థిక వ్యవస్థ వికసిస్తున్నప్పుడు 2002–13 కాలంలో ఆరుగురు బ్రిటన్ ప్రధానులు భారత్‌ను సందర్శించారని మర్చిపోరాదు. భారతీయ కంపెనీ టాటా.. జాగ్వార్ లాండ్ రోవర్ అండ్ కోరస్ కంపెనీని 14.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటన్‌లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద కంపెనీగా అవతరించిన కాలంలో బ్రిటన్ రాజకీయనేతలు పార్టీలకతీతంగా భారత్ పట్ల సానుకూల దృష్టిని ప్రదర్శించేవారు.
ఈ రోజు కశ్మీర్‌లో పరిస్థితి ఘోరంగా కనబడుతుండవచ్చు కానీ ఇంతకంటే ఘోరంగా మారిన పరిస్థితులను మనం గతంలోనే చూశాం. గూగుల్ ప్రపంచాన్ని ఆవరించకముందు నెలకొన్న మన గతాన్ని మర్చిపోవడానికి మనం అలవాటు పడ్డాం. 1991–94 కాలంలో కశ్మీర్‌లో ప్రజాగ్రహం, రాజ్య నిర్బంధం, అణచివేత, హింస అంత్యంత ఘోరమైన స్థితికి చేరుకుంది. చిత్రహింసల కేంద్రాలు పెరుగుతూపోయాయి. విదేశీ జర్నలిస్టులను నిషేధించారు. ఎన్ కౌంటర్ హత్యలు సాధారణ విషయం అయిపోయాయి. ప్రతిరోజూ కశ్మీర్‌లో హత్యలు జరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది కూడా.
దీనికి అంతర్జాతీయ ప్రతిస్పందన కూడా తోడైంది. ప్రపంచ స్థాయిలో భారత్ స్నేహితులు దూరమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. మన ఏకైక మిత్రదేశం సోవియట్ యూనియన్ ప్రపంచ చిత్రపటంలోంచి అదృశ్యమైంది. మానవ హక్కుల సంస్థలు, స్వచ్చంద సంస్థలచే ప్రభావితమైన బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం భారత్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకునేది. ప్రపంచంలో ఏ మిత్ర దేశం తనను ఆదుకునే పరిస్థితి లేని ఆ కాలంలో పీవీ నరసింహారావు స్వదేశంలో కాస్త నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించేవారు.
తన తొలి దశపాలనలో బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న ప్రక్రియనే ప్రశ్నించిన దశను, ఉపఖండం మ్యాప్‌ను ఇక ఎంతమాత్రం రక్తతర్పణతో మార్చలేమని తన రెండో దఫా పాలనలో బిల్ క్లింటన్ చేసిన ప్రకటనను పోల్చి చూడండి. 1990లలో కూడా వేగంగా పెరుగుతూ వచ్చిన ఆర్థిక వ్యవస్థే నిర్ణయాత్మకమైన వ్యూహాత్మక సంపదగా ఉండేది. 2019లో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతీయ పాలనాయంత్రాంగం జవాబుదారీతనం సమస్యను ఎదుర్కొంటూండటాన్ని మనం తప్పక ఆలోచించాల్సిందే.
వ్యాసకర్త: శేఖర్ గుప్తా,
ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment