సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఐరోపా పార్లమెంట్‌కు చెందిన 27 మంది సభ్యులు వ్యక్తిగత హోదాలో మంగళవారం నాడు పర్యటిస్తున్నారు. కశ్మీర్ భారత్ అంతర్గత సమస్య అంటూ మొదటి నుంచి చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఐరోపా బందాన్ని కశ్మీర్‌లోకి ఎందుకు అనుమతిస్తున్నారో అర్థంకాని స్థానిక రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను కొట్టివేయడమే కాకుండా కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన ఆగస్టు ఐదవ తేదీ నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెల్సిందే.
అనాటి నుంచి కశ్మీర్‌లోకి జాతీయ, అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులను అనుమతించని స్థానిక ప్రభుత్వం ఇప్పుడు జాతీయ పత్రికల జర్నలిస్ట్ ప్రతినిధులను కొంత అనుమతిస్తోంది. అంతర్జాతీయ రిపోర్టర్లను ఇప్పటివరకు అనుమతించలేదు. ఈ రోజు ఐరోపా పార్లమెంట్ సభ్యుల పర్యటన కవరేజీకి కూడా అనుమతించకుండా ఢిల్లీ నుంచి ఎంపిక చేసిన కొంతమంది జర్నలిస్టులను మాత్రమే అనుమతించిందని తెలుస్తోంది. మొదట్లో టెలికమ్యూనికేషన్లను, విద్యాసంస్థలను పూర్తిగా మూసి వేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యాసంస్థలను తెరవడంతోపాటు టెలిఫోన్, మొబైల్ సర్వీసులను పునరుద్ధరించింది. ఇప్పటికీ ఇంటర్నెట్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించలేదు. నేటికి కశ్మీర్‌లోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరచుకోలేదు. రోడ్లపై ప్రజల సందడి అంతంత మాత్రంగానే ఉంది.
ఇప్పటికీ ఖాళీ రోడ్లపై భద్రతా దళాల మోహరింపు ఎప్పటిలాగే కొనసాగుతోంది. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులే కొనసాగుతున్నాయని వాదిస్తూ వస్తోన్న కేంద్రం, ప్రతిపక్షాల ప్రత్యక్ష పర్యటనను అడ్డుకుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందాన్ని కూడా కశ్మీర్ పర్యటనకు అనుమతించలేదు. మరోపక్క ‘దక్షిణాసియా శాంతి పరిస్థితుల’పై జరిగిన చర్చలో భాగంగా అమెరికా పార్లమెంట్‌లో మొన్న కొంతమంది సభ్యులు కశ్మీర్ పరిస్థితిపై భారత ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇప్పుడు ఐరోపా పార్లమెంట్ బృందాన్ని అనుమతించింది. ఈ సందర్భంగా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు గత రెండు రోజులుగా స్థానిక అధికారులు తెగ హైరానా పడుతున్నారు. దాదాపు మూడు నెలలుగా సాధ్యంకాని సాధారణ పరిస్థితులు రెండు రోజుల్లో ఎలా సాధ్యం అవుతాయి? ఈ ఐరోపా బృందం పర్యటన విషయమై సోమవారం నాడు సమావేశమైన నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. షరతులూ విధించారు. ఐరోపా పార్లమెంట్ బృందాన్ని అధికార ప్రతినిధి బృందంగా కాకుండా వ్యక్తిగత స్థాయిలో రావాల్సిందిగా ఆహ్వానించారు. 27మంది సభ్యులను కూడా మోదీ బృందమే ఎంపిక చేసింది. బ్రిటన్‌లోని బ్రెక్సిట్ పార్టీ, ఫ్రాన్స్‌లోని నేషనల్ ర్యాలీ, పోలాండ్‌లోని లా అండ్ జస్టిస్, స్పెయిన్‌లోని వోక్స్, ఫ్లెమిష్ నేషనల్ పార్టీల సభ్యులను ఎంపిక చేశారు. ఈ పార్టీలన్నీ బీజేపీ తరహాలో మైనారిటీ వ్యతిరేక, వలసల వ్యతిరేక, నియంతృత్వ పార్టీలే. అంతర్జాతీయ మీడియాను కూడా అనుమతించడం లేదు కనుక ఆ ప్రతినిధి బృందం భారత్‌కు అనుకూలంగానే నివేదిక ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంతకుముందు అజిత్ దోవా పర్యటించినప్పుడు చేసిన ఏర్పాట్లే ఇప్పుడు చేయవచ్చు. నాడు ప్రజల సందడి కనిపించడం కోసం పలుచోట్ల మూసిన షట్టర్ల ముందు తక్కువ డబ్బులకు పసందైన భోజనాన్ని పెట్టించారు. నేడు కూడా అలాంటి తంతు ఉండవచ్చు. ఏర్పాట్లలో ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఐరోపా పార్లమెంట్ బందం సభ్యులలో మన సుబ్రమణియన్ స్వామి లాంటి నాయకుడుంటే కశ్మీర్ అసలు పరిస్థితిని బయట పెట్టరా? అప్పుడు మన పరువు పోతుంది గదా! అన్న ఆందోళనలో బీజేపీ మేధావులు ఉన్నారు. కశ్మీర్ అంతర్గత సమస్యని గట్టిగా వాదిస్తున్నప్పుడు ఆ వాదనకే కట్టుబడి వ్యవహరిస్తే ఈ తిప్పలు తప్పేవి గదా! అని వారు అభిప్రాయపడుతున్నారు.
‘కశ్మీర్’లో పరువు పోతుందా !?
Published Tue, Oct 29 2019 2:26 PM | Last Updated on Tue, Oct 29 2019 2:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment