ఉగ్రవాదులకు పీవీ బిర్యానీ పెట్టించారా?
'ముంబైలో మారణహోమం సృష్టించి, పోలీసులకు పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్.. జైలులో బిర్యానీ కావాలని గొడవచేసేవాడని విన్నాం. ఈ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించే ప్రక్రియ ఇప్పటిదికాదు.. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు సైతం టెర్రరిస్టులకు బిర్యానీ తినిపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటువాదం కశ్మీర్ ను తీవ్రంగా వణికిస్తున్న రోజులవి. ఎడతెగని ఆందోళనలనలను అదుపుచేసే క్రమంలో పీవీ సర్కారు.. ఉగ్రవాదుల(వేర్పాటువాదుల)తో చర్చలు జరపాలని నిర్ణయించింది. 1993లో శ్రీనగర్ లోని ప్రఖ్యాత హజ్రత్ బాల్ దర్గా వేదికగా చర్చలు జరిగాయి. గంటలపాటు జరిగిన నాటి చర్చల్లో భోజనవిరామం అనివార్యమైంది. కానీ చివరికి చర్చలు విఫలమయ్యాయి. 'చేతికి చిక్కిన టెర్రరిస్టు నాయకులను చంపకుడా.. పీవీ నర్సింహారావు వాళ్లకు బిర్యానీ పెట్టి పంపించారు' అని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. మీడియా సంస్థలు సైతం పీవీ బిర్యానీని హైలెల్ చేశాయి.
అసలేం జరిగింది?
నిజానికి కసబ్ బిర్యానీ అడగనేలేదని, అతనిపై జడ్జీలకు, ప్రజలకు కోపం పెరగాలని(!) తానే బిర్యానీ థియరీని సృష్టించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తర్వాతికాలంలో (కసబ్ ఉరితీత అనంతరం) వెల్లడించారు. అలానే పీవీ టెర్రరిస్టులకు బిర్యానీ వడ్డించారన్నది కూడా పచ్చి అవాస్తవం. అప్పటి చర్చల్లో భోజనం తిన్నది నిజమే, అయితే అది సీఆర్పీఎఫ్ క్యాంప్ నుంచి తెప్పించిన సాధారణ భోజనం. కశ్మీరీ రచయిత బషారత్ పీర్ వివరణ ప్రకారం అసలు కశ్మీరీలు బిర్యానీని పెద్దగా ఇష్టపడరు. ఈ రెండు సందర్భాల్లోనూ కనీస నిజనిర్ధారణ లేకుండా వార్తా సంస్థలు చర్చలు చేశాయి.
అలాంటివి ఎన్నో..
2014లో బదౌన్ కు చెందిన ఇద్దరు దళిత యువతులపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతం కూడా అలాంటిదే. ఆ ఘటనపై టీవీ చర్చల్లో నాయకులు ఆవేశపూరితంగా మాట్లాడు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. నిజానికి అది అత్యాచారహత్య కాదు.. ఆత్మహత్య అని తర్వాత తెలిశాక.. టీవీల చర్చలను 'పెద్ద జోక్'గా వీక్షకుడు భావించడా? రోహతక్ అక్కచెల్లెళ్లు తమను బస్సులో వేధించిన ఆకతాయిని తన్ని పతాక శీర్షికల్లో చోటుచేసుకున్నారు. వారి సాహసాన్ని మెచ్చుకుంటూ ప్రభుత్వం వారికి రివార్డులు కూడా ప్రకటించింది. కానీ ఆ తెగింపు దృశ్యాలన్నీ నాటకమని, తన్నులు తిన్నది వాళ్ల మనిషేఅని తెలిసిన తర్వాత మనం ముక్కున వేలేసుకున్నాం. ఈ సందర్భంలోనూ టీవీ చర్చలు కామెడీ షోలయ్యాయి. నాగాలాండ్ లో ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆక్రోశంతో జనం.. జైలు గొడలు బద్దలుకొట్టిమరీ లోపలున్న యువకుణ్ని బైటికి ఈడ్చుకొచ్చి కొట్టి చంపారు. అసలు ఆ యువకుడికీ, రేప్ కు సంబంధమేలేదని, నిజానికి అతడో అమర సైనికుడి సోదరుడని తేలిసింది. కోల్ కతాలో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిపై రేప్ కేసులో పట్టుబడ్డ యువకులదీ ఇలాంటి గాధే. విషయం తెలిసిన వెంటనే.. టీవీ చానెళ్లు దానిపైన విస్తృత చర్చ మొదలుపెడతాయి. అభిప్రాయ ప్రకటనలో వక్తలు ఆవేశాగ్రహాలు వ్యక్తచేస్తారు. కానీ అందులోని నిజానిజాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు.'
ఇది.. టీవీ చానెళ్ల తీరుతెన్నులు, వార్తల వెనుక వాస్తవాలను క్రోడీకరిస్తూ ఇటీవలే విడుదలైన 'More News is Good News : Untold Stories from 25 Years of Television: ' అనే పుస్తకంలో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వెలిబుచ్చిన అభిప్రాయం. 'What Kasab's Biryani In Jail Says About News TV' శీర్షికతో ఆయన రాసిన ఒపీనియన్.. నేటి చానెళ్ల లేదా టీవీ చర్చల వింత పోకడను సులువుగా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో అభిప్రాయల సంకలనమైన 'More News is Good News' పుస్తకాన్ని హూపర్ కొలిన్స్ సంస్థ ప్రచురించింది. ఎమ్మార్పీ ధర రూ.799. అమెజాన్ లో రూ.543కే లభిస్తుంది.