
గతంపై సవారీ.. ఓటమికి దారి
జాతిహితం
పంజాబ్‌ను పూర్తి మతవాద దృష్టితో చూడటం ఆప్ చేసిన ఘోర తప్పిదమనేది స్పష్టమే. తమకు కావాల్సింది సిక్కు ఓట్లేనని భావిస్తే, తదనుగణంగా అది తన రాజకీయ ఆకర్షణను మలచుకోవాల్సిందే. కాబట్టి ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిర హత్యానంతరం సాగిన సిక్కుల ఊచకోత వంటి పాత గాయాలను తిరిగి రేకెత్తించ యత్నించింది. దీంతో ఖలిస్తానీలు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆప్‌ను వాడుకుంటున్నారని ప్రజలు భావించారు. ఆ భయంతో సిక్కులు, హిందువులు ఆప్‌ను ఓడిస్తారనుకున్న పార్టీకి ఓటు చేశారు.
ఓటమి అనాథ అనేది మానవజాతి చరిత్రలోకెల్లా అతి పురాతనమైన నానుడి. ఇప్పుడది నా మదిలో మెదలడానికి కారణం బహుశా మైరా మెక్ డొనాల్డ్ అనే బ్రిటిష్ పాత్రికేయురాలు అదే పేరుతో (డిఫీట్ ఈజ్ ఎన్ ఆర్ఫన్) ఇటీవలి కాలపు పాకిస్తాన్ చరిత్రపై రాసిన పుస్తకం చదువుతుండటమే కారణం కావచ్చు. పంజాబ్, గోవాలలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు దెబ్బ తినడం గురించి ఆలోచిస్తుండటం కూడా అందుకు కార ణం. ఆ రెండు రాష్ట్రాలూ ఆమ్ ఆద్మీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకున్నవే. మెరుపు వేగంతో బలగాలను కేంద్రీకరించి. కోటను పట్టేసుకోవడంగా ఇప్పటికే మనకు సుపరిచితమైన ఆ పద్ధతి నిజ స్వభావానికి తగ్గట్టే... సానుకూల ‘అంతర్గత’ సర్వేల ఆధారంగా ఆ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు తథ్యమని ప్రకటించేసింది. గోవాలో దాని పోరాటానికి అడ్డుకట్టపడిందనేది స్పష్టమే. పంజాబ్‌లో ఆ పార్టీ ప్రత్యర్థులు, విమర్శకులు (ఈ రచయిత సహా) సైతం అది ఇంత కంటే చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.
నేనైతే అది మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందన్నాను. 40 సీట్ల కంటే ఎక్కువ సంఖ్యాబలంతో అది బలమైన రెండవ పార్టీగా అవతరిస్తుందే తప్ప అంత కంటే తీసిపోదని అనుకున్నాను. అది రెండో స్థానంలోనే నిలిచింది. కేరళలో వలే రాజకీయంగా రెండుగా చీలిపోయి ఉన్న రాష్ట్రంలో ఒక ‘బయటి’, యువ పార్టీకి అది చెప్పుకోదగిన విజయమే. కానీ దానికి లభించినది కేవలం 20 సీట్లే. ప్రత్యేకించి ముందే విజయోత్సవాలు జరిపేసుకున్న దృష్ట్యా ఆ పార్టీకి ఇది అవమానకరమనే అనిపిస్తుంది. ఈ ఎన్నికల తర్వాత ఆప్ వ్యవహారాలు సాగుతున్న తీరు గురించి ఎన్నో కఠినమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇక ఇప్పుడు అరవింద కేజ్రీవాల్ భారత క్రికెట్‌లో వినోద్‌కాంబ్లీలాగా మిగలవచ్చు... అలా మెరుపులా మెరిసి, జగజ్జేతగా నిలుస్తానని నమ్మించి, ఆ తర్వాత తుస్సుమని పోవచ్చు. ఓటమి ఎంతైనా అనాథే కదా.
ఎదురు లేదనిపించి...
ఆప్ ఎందుకు ఓడిపోయింది, అది చేసిన తప్పు ఏమిటి? అని ఇప్పటికే చాలా రాశారు. అయితే అది చేయాల్సిన ప్రతి సరైన పనిని చేసిందని విస్మరిం చరాదు. పంజాబ్ క్షీణత, నిరుద్యోగం, రాజకీయమైన విసుగు, స్వాభిమానం గల ప్రజల సామూహిక అహం దెబ్బతినడం వంటి సరైన సమస్యలనన్ని టిపైనా అది దృష్టిని కేంద్రీకరించింది. రెండు, విస్తృత ప్రజానీకం దోషులుగా చూస్తున్న శిరోమణి అకాలీదళ్‌ను అందుకు తప్పుపట్టి, దానిపైకే ఎక్కు పెట్టింది. శిరోమణి ఆకాలీదళ్ లేదా మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే బాదల్ కుటుంబీకులు సమంజసమైనంత ప్రజాస్వామిక ‘పాంథివాద’ (సిక్కు గురు వుల మతపరమైన, దాదాపు గ్రంథాల పంథాను అనుసరించేవారు) పార్టీని భూస్వామ్యపు కలుగు స్థాయికి దిగజార్చారు.
పంజాబ్‌లో ఆప్ ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించింది. సామాజిక మాధ్యమాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంది. పంజాబ్‌లో జనాదరణ పొందిన సాంస్కృతిక యువ స్టార్ కళాకారులందరినీ పార్టీలోకి చేర్చుకుంది. ప్రశంసార్హమైన జనాకర్షణను సాధించింది. భావజాలరంగంలోని రెండు కొస లైన అతివాద, మితవాదాల మధ్య ఉన్న సకల ధోరణులకు చెందిన ఆగ్రహ వేశపరులందరితో కలసి వినూత్న కూటమిని సైతం నిర్మించింది. సంప్రదా యకంగా హిందీ మాట్లాడే ప్రధాన భారతంలోని దళితులు, జాట్ సిక్కులను అణచివేతదారులుగా కాకున్నా పెత్తనం చలాయించేవారుగా చూస్తూ, వారికి విరుద్ధంగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండేవారు. దేశంలోకెల్లా దళిత ఓటర్ల శాతం అత్యధికంగా, 33.4 శాతం ఉన్నది పంజాబ్‌లోనే. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ తమ రాష్ట్రానికి చెందినవాడే అయినా పంజాబీ దళితులు ఎన్నడూ ఆ పార్టీని ఆదరించలేదు. వారు సైతం పంజాబ్ లోని ఆప్‌ను ఆసక్తికరమైన ప్రత్యామ్నాయం అవుతుందేమోనని చూశారు. కేజ్రీవాల్ భారీ ఎత్తున ప్రజలను ఆకర్షించడాన్ని, గత పార్లమెంటు ఎన్నికల్లో 33 అసెంబ్లీ స్థానాలకు సమానమైన విజయాన్నిSసాధించడాన్ని చూస్తే ఆ పార్టీ ఉధృతిని దెబ్బ తీయగలిగినది ఏదీ లేదనే అనిపించింది.
అత్యంత విద్యావంతులు, తెలివితేటలు గల యువతీయువకులతో కూడిన బృందం ఆప్‌కు నేతృత్వం వహించింది. వారిలో చాలామంది ప్రజా స్వామిక కార్యకర్తలు, నిర్దిష్టంగా చెప్పాలంటే సమాచార హక్కు కార్యకర్తలు. ఆ çసమాచారమే కేజ్రీవాల్ ఏం మాట్లాడటానికైనా సాధికారతను కల్పించేది. ఎన్నికల గురించిన వార్తా కథనాన్ని రాస్తూ నేను చెప్పినట్టుగానే ఆప్.. అవి నీతి (కరప్షన్), ప్రతీకారం (రివెంజ్), యువత(వై) అనే మూడు అ„ý రాల ‘క్రై’ (సీఆర్‌వై) ఫార్ములా చుట్టూ తన రాజకీయాలను కేంద్రీకరించింది. ఆ ఫార్ములా ఢిల్లీలో అద్భుతంగా పనిచేసింది. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల తదుపరి నరేంద్రమోదీకి ఉన్న ఉధృత ఉరవడిని అది ఢిల్లీలో దెబ్బ తీయగలి గింది. ఆ తర్వాత పంజాబ్‌లో ఆకట్టుకునే కోలాహలాన్ని రేకెత్తించింది. అయినా అసలు లెక్కలోకి వచ్చే ఫిబ్రవరి 4న తగినంతగా ఫలితాలను సాధిం చడంలో అది విఫలమైంది. ఆప్‌లోని కుశాగ్రబుద్ధులంతా దీని గురించి యోచిస్తే... ‘మాయ’ ఓటింగ్ యంత్రాలకంటే మరింత అర్థవంతమైన కార ణాలు చాలానే కనిపిస్తాయి.
మతవాద దృష్టితో దారి తప్పింది
పంజాబ్‌ను పూర్తి మతవాద దృష్టితో చూడటం ఆప్ చేసిన ఘోర తప్పిదమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేను మాటల్ని జాగ్రత్తగా ఎంచుకునే వాడుతున్నాను. పంజాబ్ ప్రధాన సాంస్కృతిక చిహ్నాలు సిక్కుల తలపాగా, భాంగ్రా, భల్లె–భల్లె, స్వర్ణదేవాలయం. అది కేవలం సిక్కుల రాష్ట్రం కాదు. రాష్ట్ర జనాభాలో 43%గా ఉన్న హిందువులు కూడా అదే సంస్కృతిని అను సరిస్తారు, అదే గురుద్వారాలలో వారంతటి భక్తితోనే ప్రార్థనలు చేస్తారు. పంజాబీలు బయటి ప్రదేశాలకు పోయే ప్రజలు, బయటి వారిని హృదయా నికి హత్తుకునే వారు. తమ అస్తిత్వం పట్ల ఆత్మన్యూనత గలవారు మాత్రం కారు. బయటి నుంచి వచ్చిన వారు పంజాబీలను ఆకట్టుకోవడానికి చేయగల పనులలో చిట్టచివరిది తలపాగాను ధరించి దర్పంగా సిక్కులా నటించడమే. అది వారిని వినోదపరస్తుంది, చికాకూ పెడుతుంది. ‘‘నాకు ఇతను బయటి వాడని తెలుసు, అయినా ఇష్టమే. అయినా ఈ వెర్రి వేషంతో ఆకట్టుకోవా లనుకోవడం దేనికి?’’ అనేదే దీనికి పంజాబీల ప్రతి స్పందన అని చెప్పొచ్చు.
అనుకోకుండానే ఖలిస్తానీ భయాన్ని రేకెత్తించింది
పంజాబ్‌లో తమకు కావాల్సింది సిక్కు ఓట్లేనని ఆప్ భావించినట్టయితే, తదనుగుణంగా అది తన రాజకీయ ఆకర్షణను పెంపొందించుకోవాల్సింది. ఇక ఆ తర్వాతి తప్పు సహజంగానే జరిగిపోతుంది. అది, ఆపరేషన్ బ్లూస్టా ర్‌లో సిక్కుల అత్యంత పవిత్ర స్థలాలను ‘అపవిత్రం’ చేయడం, ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో వారిపై సాగిన ఊచకోత వంటి 1980ల నాటి బాధల గాయాలను తిరిగి రేకెత్తించడమే. 1984 నాటి హత్యలపై న్యాయం కోసం పోరాడిన ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్యకర్త, న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కాన్‌ను అది అక్కడికి దించింది. పంజాబ్‌లో దాదాపు ఎవరికీ ఆయన తెలియదు. అయినా ఆయనను స్థానిక నేతగా చూపింది. ఖలిస్తాన్ కాలపు శిథిలాల మధ్య మనగలిగి, ఆ కష్టకాలపు జ్ఞాపకాలను అçపురూపమైనవిగా మిగుల్చుక్నునవారితో కూటమిని ఏర్పరచింది. తద్వారా ఆపరేషన్ బ్లూస్టార్ వల్ల సిక్కులలో కలిగిన ఏకాకితనాన్ని, ప్రతీకారాన్ని పునరుజ్జీవింపజేయాలని భావించింది. అందుకు మరింత మద్దతు, ఆర్థబలం, అంగబలం ఎన్‌ఆర్‌ఐ సిక్కుల నుంచి, ప్రత్యేకించి కెనడా వారి నుంచి లభించాయి. ఇవన్నీ కలసి సిక్కు ఓట్లను సమీకరించి ఆప్‌కు అందిస్తాయని భావించారు. ఆచరణలో ఇది అకాలీల ఓట్లన్నింటినీ ఊడ్చిపారేయడమే అవుతుంది. మిగతా ఓట్లు భావ జాలపరమైన వామపక్షానికి బలమైనది, తిరుగుబాటు తత్వంగలది అయిన మాల్వా మెట ్టప్రాంతం నుంచి వస్తాయనుకున్నారు. ఇలా యుద్ధ విజయాన్ని పదిలం చేసేసుకున్నామని ధీమాగా ఉన్నారు. ఢిల్లీలో ఇలాగే కాంగ్రెస్ ఓట్లన్నీ ఆప్‌కు లభించి, భారీ విజయం లభించింది.
నిద్రాణంగా ఉన్న తిరుగుబాటువాదులతో ఆప్‌కు ఉన్న ఈ ప్రమాదకర సంబంధాలను మొదట నేను 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గుర్తిం చాను. ఆనాడు ఆప్ అభ్యర్థులుగా నిలిపిన సుచాసింగ్ చోటేపూర్, హరిందర్ సింగ్ ఖల్సాలు ఒకప్పటి తిరుగుబాటువాదులే. 24 ఏళ్ల వయసులో భింద్రన్ వాలే ఆంతరంగికుల బృందంలో ఒకరుగా ఉన్న జర్నయిల్‌సింగ్‌ను సైతం నేను కలిశాను. ఆప్‌కు మద్దతునిస్తానని వాగ్దానం చేసిన ఆయన నాతో స్వేచ్ఛగా మాట్లాడారు. ఇలామొదలైన కెనడియన్ సిక్కుల దిగుమతి హిందు వులను భయపెట్టి, వారు ఆప్‌ను ఓడించే ఆవకాశం ఉన్నదనుకున్న పార్టీకి ఓటు చేసేట్టు చేసింది.
2014లో ఆప్‌లో ఉన్న యోగేంద్ర యాదప్, పాత తిరుగుబాటువాదు లను ప్రధాన స్రవంతిలోకి తెచ్చి, వారి అసంతృప్తికి అహింసాత్మక, ప్రజా స్వామిక మార్గాలను తెరిచేందుకు ఇదే మార్గమని వాదించారు. 1979–94 దశలో బాధలకు గురైన హిందూ, సిక్కు పంజాబీలకు అంత ఓపిక లేదు. ఈ ఖలిస్తానీలకు (ప్రత్యేకించి కెనడియన్‌లకు) పంజాబ్‌లో కావాల్సింది ఏమిటి, ప్రభుత్వమేనా? అనే మాట వ్యాపించిపోయింది. బయటి పార్టీ అయిన ఆప్‌ను వాడుకుని వాళ్లు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారనే భావన కలిగింది. ఒక్కసారి గురుద్వారాలు చేతికి చిక్కాక వాళ్లు... తాము అప్పటికే చూసిన పాత విషాదాంత సినిమాను తిరిగి చూపడం మొదలెడతారని భావించారు. పంజాబ్‌లో ఏ ఒక్కరికీ, ప్రత్యేకించి సిక్కులకు అది రుచించేది కాదు. ఆ కష్టకాలం నుంచి కోలుకుని, తిరిగి ముందుకుసాగడానికి రాష్ట్రానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. కాంగ్రెస్ ఆ తర్వాత మూడుసార్లు ఎన్నికైంది. అకాలీల నుంచి విడివడ్డ గ్రూపులు గత 25 ఏళ్లుగా డిపాజిట్లు కోల్పోతున్నాయి. ఎవరూ అంత వెనక్కు పోవాలని కోరు కోవడం లేదు. గతం గురించి అతిగా మాట్లాడేకంటే ఆప్ మంచి భవిష్యత్తును వాగ్దానం చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితాలను సాదించగలిగేది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta