
ఉదారవాదం, దూకుడైన లౌకికవాదాలతో పాటూ మృదువైన జాతీయవాదాన్ని, మతవాదాన్ని ప్రదర్శించగలిగిన శక్తి కాంగ్రెస్‌కు ఉంది. బీజేపీది రాజ్యాంగపరంగా కట్టుబడక తప్పని లౌకికవాదాన్ని ధరించిన కరడుగట్టిన హిందుత్వవాదం, కఠిన జాతీయవాదం, ఏ జంకూలేని బహిరంగ మతాచరణవాదం. అవతలి పక్షం బలాల విషయంలో ఏ పక్షమూ సురక్షితం కాదు. ఏ ఉన్మాదం ఆవహించి రాహుల్ బీజేపీకి బలమైన అంశాలపైనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా? అని ఆశ్చర్యం కలుగక తప్పదు.
నేటి ‘యువ’తరం మనకు ఎన్నటికీ అంతుపట్టే బాపతు కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన, తన మతాచరణపై చీల్చి పోగులు పెట్టే (త్రెడ్‌బేర్ ఇంగ్లిష్ పద ప్రయోగంతో జంధ్యం ధరించడం అనే శ్లేషార్థాన్ని వాడారు). చర్చను కోరుకుంటారో లేదో, లేకపోతే అది ఇçప్పుడే ఆయన చేజారిపోయిన చర్చేమో కచ్చితంగా చెప్పలేం. ఎలా జరిగినా ఆయన , ఆయన పార్టీ రాజ కీయాల్లోని తదుపరి అధ్యాయం ఇప్పుడే తయారైంది. కొంత కాలంపాటూ నిలిచేదిగానే ఈ అధ్యాయాన్ని రచించారు. ఆయన జంధ్యం ధరించి, కాల కృత్యాలను తీర్చుకునే సమయంలో ఎలా పద్ధతి ప్రకారం దాన్ని చెవికి చుట్టుకుంటారో తెలిపే ఫొటోలను సోషల్ మీడియాలో ప్రదర్శించినంత మాత్రాన లేదా తన మత స్వీకారం జరిగే రోజును ప్రకటించి, ఫొటోల సాక్ష్యా ధారాలను చూపినంత మాత్రాన నాటకీయంగా ఇది ముగిసిపోయేది కాదు. లేదంటే సోమనాథ్ దేవాలయం సందర్శకుల రిజిస్టర్‌లోని సంతకాలను ప్రదర్శించడం లాంటి బీజేపీ జిత్తులతో రుజువు చేసుకోవడంతో సమసి పోయేదీ కాదు.
రాహుల్ కొత్త రాజకీయ క్రీడ
ఈ కథ అంతత్వరగా, నాటకీయంగా ముగిసేది కాకపోవడానికి కారణం సరళమైనదే: రాహుల్ మతం లేదా మతాచరణ ఎన్నడూ జాతీయ రాజకీ యాల్లో చర్చనీయాంశం కాలేదు. ఆయన తల్లి విదేశీ పుట్టుక కారణంగా, ఆమె విషయంలో కొంతవరకు ఇలాంటి సమస్య తలెత్తింది. మరి రాహుల్ మాటేమిటి? ఆయన ఏ దేవుడ్ని ప్రార్థిస్తాడని గానీ, లేదా అసలు ప్రార్థన చేస్తాడా అనిగానీ, ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? లౌకికవాదానికి స్థిరమైన, సైద్ధాంతిక నిర్వచనం లేదనేది సమంజసమైన వాదనే. నెహ్రూ అజ్ఞేయవాదం (దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేమనే వాదం) నుంచి వాజ్‌పేయి మృదువైన, వ్యక్తిగతమైన, భావజాల రహితమైన, అన్నిశాఖలనూ కలుపుకుని పోయే విశాల మతవాదం వరకూ, మోదీలాగా రాజ్యాంగపరమైన పరిమితుల వల్ల నామమాత్రంగా లౌకికవాదానికి కనీస ఆమోదాన్ని తెలపడం వరకూ లౌకిక వాదం రకరకాలుగా ఉండొచ్చు. తనదైన సొంత లౌకికవాదంతో పూర్తి హిందుత్వకు సయోధ్యను సాధించడం కోసం మోదీ నిరంతరం విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. మీరు కచ్చితమైన నాస్తికులు అయ్యేట్టయితే లౌకికవాదం మీ కోసం కాదు. కాబట్టే లౌకికవాదంపై చర్చను మత విశ్వాసులకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. భారతీయుల్లో 98 నుంచి 99 శాతం వరకు మత విశ్వా సులేనని ప్రజాభిప్రాయ సేకరణల్లో పదే పదే తేలింది.
ఇంతవరకు మన జాతీయ రాజకీయాల్లో మతం గురించి వచ్చిన వాదనలు ఇవి: మీరు మీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోగలరా/ వాడుకుం టారా, లేదా? అన్ని మతాల అనుయాయులను మీరు సమానంగా చూస్తారా? ఏదో ఒకదానికి కట్టుబడాల్సి వచ్చినప్పుడు మీరు ప్రాధాన్యమి చ్చేది... రాజ్యాంగానికి కేంద్ర స్థానంలోని లౌకికవాదానికా లేక మీ మత భావ జాలానికా? మతం పేరిట మీరు ఓట్లు అడుగుతారా? అనేవే. అంతేగానీ, మీరు దేవుడ్ని నమ్ముతారా, లేదా? నమ్మేట్టయితే, ఎవర్ని నమ్ముతారు? ఎంత తరచుగా ప్రార్థనకు వెళతారు? మీ మతస్తులు పాటించాల్సిన ఆచారాలు, కర్మ కాండలు ఏవో మీకు తెలుసా/వాటిని పాటిస్తారా? పాటిస్తుంటే నాకు ఆధా రాలు చూపండి? అనేవి ఎన్నడూ పెద్ద ప్రశ్నలు కాలేదు. దేవుడు ఉన్నాడో లేడోననే నెహ్రూని, విగ్రహారాధనకు వ్యతిరేకులైన ద్రవిడ పార్టీలను, వామ పక్ష నాస్తికులను, అలాగే కాషాయాంబరధారులైన సాధువులు, మహంతులు, సిక్కు, ముస్లిం మత గురువులను పదే పదే ఎన్నోమార్లు ఎన్నుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మతం కీలకమైనదిగా మారింది. పంజాబ్‌లో అకాలీ దళ్‌కు సిక్కులు ఓటు బ్యాంక్ అయితే, కేరళలో ముస్లింలీగ్ ముస్లింలను, కాంగ్రెస్ క్రైస్తవులను ఓటుæ బ్యాంకులను చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని ఓ చిన్న ప్రాంతంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి కూడా ఇలాగే ఓటు బ్యాంకుంది. కానీ, ఎవరైనా ఎప్పుడైనా రాహుల్ మతం లేదా మతాచరణ గురించి పట్టిం చుకున్నారా? కొత్త ఆట బొమ్మ (సెల్‌ఫోన్)లో ట్వీటర్ ట్రాల్స్‌ను (ఉద్దేశ పూర్వక దూషణలతో కూడిన వ్యాఖ్యలు) చదివి, వాటిని సీరియస్‌గా పట్టిం చుకునే బాపతైతే తప్ప ఎవరూ పట్టించుకోలేదు.
ఏ సమరంలోనూ చేయకూడని తప్పు
సైనిక, రాజకీయ, క్రీడా రంగాల్లో సాగే ఏ సమరంలోనైనా... ప్రత్యర్థికి బలమైన అంశాలుగా ఉన్నవాటితో పోరాటానికి దిగకండి, మీ బలమైన అంశాలేవో వాటితోనే పోరాడండి అనేది ప్రథమ నియమం. కాంగ్రెస్, బీజే పీల మధ్య ఈ సమీకరణం తగినంత స్పష్టంగానే ఉంది. ఒకరిది ఉదార వాదం, దూకుడైన లౌకికవాదాలతో పాటూ తేలికపాటి జాతీయవాదాన్ని, అలాగే మతవాదాన్ని కూడా బహిరంగంగా ప్రదర్శించగలిగిన శక్తి. మరొకరిది రాజ్యాంగపరంగా కట్టుబడక తప్పని లౌకికవాదాన్ని ధరించిన కరడుగట్టిన హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, ఏ జంకూ లేని, బహిరంగ మతా చరణవాదం. అవతలి పక్షం బలాల విషయంలో వీటిలో ఏ పక్షమూ సుర క్షితం కాదు. ఏ ఉన్మాదం ఆవహించి రాహుల్ గాంధీ, ఆయన సలహాదారులు బీజేపీకి బలమైన అంశాలపైనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా? అని మీకు ఆశ్చర్యం కలుగక తప్పదు. కర్మికజె (రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ యుద్ధ విమానాల ఆత్మాహుతి దాడులు) రోమాంచకమైన సాహస చర్యే. మీ సాహసం గురించి ప్రజలు తరతరాలు చెప్పుకుంటారు. కానీ, అది జరిగేది మీరు యుద్ధంలో ఓడిపోయాక, మీరు పోయాక.
2014 తర్వాతి భారతంలో జాతీయవాదానికి ఇచ్చిన కొత్త నిర్వచనంలో మతాన్ని విజయవంతంగా కలగలిపేయగలిగారు. కాబట్టి రాహుల్ కొన్ని దేవాలయాలను సందర్శించడం వాస్తవికవాద దృష్టితో ఈ కొత్త నిజాన్ని అంగీకరించడంగా కనిపిస్తుంది. మీరు మాకు ఎన్నడూ ఓటు వేయనప్పుడు అధికారంలో వాటా కోసం మా వద్దకు ఎందుకు వస్తారు అనే వాదనతో మైనారిటీలను అధికారపు చట్రాలకు దూరంగా ఉంచారు. హిందూ ఓటర్లలో తగినంత ఎక్కువమందే దాన్ని ఆమోదించారు. కాబట్టి నేనూ హిందువునే అని ప్రకటించుకోవడం తప్ప మీరు మరేం చేయగలరు?
ఎందుకీ బహిరంగ మతాచరణ?
సమస్య ఇప్పటికే ఆలయాల సందర్శనను లేదా సోమనాధ దేవాలయ రిజిస్టర్లో సంతకం చేయడాన్ని మించిపోయింది. ఆలయ సందర్శన రాజకీయమైనదైనా ఫర్వాలేదు. అదిప్పుడు చిన్న అంశంగా మారిపోయింది. నేను మత విశ్వాసిని గనుక అన్ని ఆరాధనాస్థలాలకు వెళతాను. మీ మతం మీ వ్యక్తిగత విశ్వాసమని నమ్ముతాను, అలాగే హిందూ మతమూ నాకు అంతే, ఇతరుల్లా నేను దాన్ని బహిరంగంగా ప్రదర్శించను అని రాహుల్ అని ఉంటే ఈ చర్చ మరో దిశకు మళ్లేది. 22 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తన మతాచరణను ఒక ప్రచారాం శాన్ని చేయాలనుకోవడం చవకబారు, దిక్కుతోచక చేసిన ట్రిక్కు.
మరోపక్క, రాహుల్ మతం గురించి ప్రశ్నించినందుకు ఆగ్రహోదగ్రు డైన రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా... ఆయన బ్రాహ్మణుడే కాదు, జంధ్యం ధరిం చినవాడు అని చెప్పాడు. అంటే జంధ్యం ధరించడం మిమ్మల్ని సరైన హిందు వును చేస్తుందా? బ్రాహ్మణ కర్మకాండలనన్నిటినీ పాటిస్తూ, మత సంకే తాలను ధరించిన హిందువులనే మన దేవతలు కటాక్షిస్తారా? ఇదే గనుక హిందు మతానికి అర్హత అయ్యేట్టయితే, మన దేశంలోని కోట్లకు కోట్ల ప్రజలు మతానికి బాహ్యులై మతభ్రష్టులవుతారు. సిక్కు, ఇస్లాం తదితర మతాలకు భిన్నంగా హిందూమతం ఎలాంటి మత చిహ్నాలను ధరించమనీ పట్టు బట్టదు.
ఇందిరా గాంధీ 1977లో ఓటమి పాలయ్యే వరకు వారి వంశం తమ మతాచరణను ప్రైవేటు వ్యవహారానికే పరిమితం చేసింది. ఆ ఓటమి, అంతకు మించిన విషాదకరమైన ఘటన సంజయ్ గాంధీ మరణం కలసి ఆమె వైఖరిలో మార్పును తెచ్చాయి. రుద్రాక్ష మరింత స్పష్టంగా కనిపించ సాగింది. ఆమెలోని అభద్రతలపై కొందరు తాంత్రికులు పట్టుసాధించారు. అయినాగానీ ఆమె ఎన్నడూ తన కొత్త మతాచరణను బహిరంగంగా ప్రద ర్శించలేదు, ఆమెను ఎవరూ ఎలాంటి ప్రశ్నలూ అడగనూ లేదు. రాజీవ్ గాంధీ హయాంలోనే పెద్ద మార్పు వచ్చింది. మౌల్వీల ఒత్తిడికి లొంగి షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు నెట్టి, చట్టాన్ని సవరించడం ఆయన చేసిన మొట్టమొదటి తప్పు. మధ్యే మార్గాన్ని అను సరించే హిందువులకు అది దిగ్భ్రాంతి కలిగించింది. లోక్‌సభలో రెండు సీట్లకు క్షీణించిన బీజేపీకి కొత్త ఊపిరి పోసింది. ముస్లింలను సంతృప్తిపరచడం అనే వాదనకు విస్తృతంగా ఆదరణ లభించింది. బహుశా దీనికి ప్రతిచర్యగానే కావచ్చు రాజీవ్ ఆ తర్వాత వరుసగా తప్పులు చేశారు. బాబ్రీ మసీదు– రామజన్మభూమి స్థలం తాళాలను తెరిపించారు. రామరాజ్యాన్ని తెస్తా నంటూ అక్కడి నుంచే 1989 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్ని కల్లో కాంగ్రెస్ 414 స్థానాల నుంచి సగం కంటే తక్కువకు దిగజారింది. ముస్లింల ప్రధాన ఓటు బ్యాంకును కోల్పోయి, బీజేపీకి ఎదురు చూస్తున్న అవకాశాన్ని అందించింది : కులం చీల్చిన వారిని ఐక్యం చేయడానికి మతాన్ని వాడటం అది ప్రారంభించింది.
ఆ ఓటమి నుంచి కాంగ్రెస్ ఇక ఎన్నడూ కోలుకోలేదు. ఆ సమయంలోనే ఎన్నో కేసులు రాజీవ్‌ను చుట్టుముట్టాయి. కానీ ఆయన చేసిన అసలు పాపం... షాబానో కేసులో చేసినదే. అదే ఆయనకు లౌకిక–ఉదారవాద మత బోధకుని స్థాయిని కట్టబెట్టింది. బెంబేలెత్తిపోయి ఆయన అతి దిద్దుబాటును చేపట్టి, ముస్లింల (అయోధ్యలో ముప్పును చూసిన) మద్దతును కోల్పో యారు. మధ్యేవాద మార్గ హిందువులను బీజేపీకి కానుకగా అందించారు. బీజేపీకి బలమైన అంశాలపైన పోరాటానికి దిగడమే ఆయన చేసిన ఘోర మైన తప్పు. రాహుల్ అదే తప్పు చేయదలచుకుంటే అదే చరిత్ర ఇప్పుడూ పునరా వృతం అవుతుంది. జంధ్యం ధరించడం తదితరాలన్నీ అయన స్వేచ్ఛగా చేయవచ్చు. ఆయన వయసు వచ్చిన వాడు, తన పార్టీకి అధిపతి.
- శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment