విభేదిస్తే మరణ శిక్ష తప్పదా? | Shekhar Gupta write article on Gauri Lankesh Murder | Sakshi
Sakshi News home page

విభేదిస్తే మరణ శిక్ష తప్పదా?

Published Sat, Sep 9 2017 1:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

విభేదిస్తే మరణ శిక్ష తప్పదా? - Sakshi

విభేదిస్తే మరణ శిక్ష తప్పదా?

జాతిహితం
గౌరి హత్య, రాజకీయ నేరాల దర్యాప్తు, విచారణ రాజకీయ జోక్యానికి అతీతంగా ఉండా లని, సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడానికి హామీని కల్పించాలని చెబు తోంది. మన మధ్య విభజన రేఖ ఎక్కడ ఉన్నది ఆనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అందరికీ ఉన్నదని గుర్తించాలి. ఉదారవాదం అంటే ‘ఎదుటి పక్షం’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణలపై నుంచి తిరిగి నాగరికత సరిహద్దుల్లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది.

గౌరీ లంకేశ్‌ గురించి, ఆమె హత్య లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే ఆమెను తుదముట్టించడం గురించి మనకు కచ్చితంగా తెలిసిన సంగతులు చాలానే ఉన్నాయి. ఒకటి, ఆమె సుస్పష్టమైన కొన్ని అభిప్రాయాలకు శక్తివం తమైన నాయకురాలు, సునిశితమైన వామపక్ష ఉదారవాద పక్షంలోని  భయ మెరుగని హేతువాది. రెండు, ఆమె తన ఆలోచనలను బహిరంగంగా మాట్లాడే, అలవాటుగా వచ్చే బెదిరింపులకు వెరవని ధైర్యశాలి. మూడు, రెండుగా బాగా చీలిపోయి ఉన్న చర్చలో నిర్దిష్టంగా ఒక వైఖరిని తీసుకున్న వారి విషయంలో అనివార్యంగా జరిగేట్టే... ఆమెతో ఏకీభవించేవారు ఆమెను మహోద్వేగంతో సమర్థించేవారు. ప్రత్యర్థి పక్షాన నిలిచేవారు లేదా భావ జాలపరమైన గోదాలో అటువైపున ఉండేవారు కూడా అంతే ఉద్వేగభరి
తంగా ప్రతిస్పందించేవారు. వీరిలో కొందరు విమర్శకులు... గత దశాబ్ద కాలంగా రివాజుగా మారినట్టు... ఆమె చర్యలకు ఉద్దేశాలను ఆపాదించే వారు. కొందరు నీచమైన, బెదిరించే వ్యాఖ్యలు చేసేవారు.

భావాల కారణంగా హింస సహించరానిది
ఇక ఆ తర్వాత మనం సహేతుకంగా కచ్చితంగా చెప్పగలిగినది, ఇది రాజ కీయ హత్యని. దీనికి బా«ధ్యతను మనకు ఇష్టమైన అనుమానితులపైకి నెట్టేసి సరిపెట్టుకోవడానికి మనం సోషల్‌ మీడియా విదూషక యోధులమో లేదా రాజకీయ దురభిమానులమో కాము. అలా చేయడం వల్ల పలు ప్రమాదాలు న్నాయి. రాజకీయ హత్యల విషయంలో తరచుగా జరిగేట్టు కేసు రాజకీ యాలు పులుముకున్న పోలీసు–కోర్టు ‘‘కక్ష్య’’లో పరిభ్రమిస్తూ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎటంటే అటు వంగుతుంటుంది. సంఝోతా ఎక్స్‌ప్రెస్, మాలెగావ్, అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ కేసులు పథకం ప్రకారం ఎలాంటి మలుపులు తిరిగాయో చూశాం.

ఈ చర్చకు కేంద్ర బిందువు చాలా సరళమైనదే. అభిప్రాయాలను కలిగి ఉండటానికి, వాటిని ప్రచారం చేసుకోవడానికి, ప్రజాస్వామ్యం అనుమతించే రూపాలలో కార్యాచరణకు దిగడానికి, ఒప్పించడానికి, నిరసన తెలుపడానికి   ఎవరికైనా హక్కు ఉంది. వారు హింసాత్మక చర్యల్లో పాల్గొనడం లేదా ప్రేరే పించడం చేయనంత కాలం ఆ హక్కు ఉంటుంది.  అలాగే, విభేదించేవారు సైతం ఎంతగట్టిగానైనా ఆ పనులను  శాంతియుతంగా చేయవచ్చు. అభిప్రా యాలు లేదా విశ్వాసాల కారణంగా ఆమెపై హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. దేశ పౌరులలో ఒకరైన ఆమె అభిప్రాయాల కారణంగా చావడానికి ‘‘అర్హురాలు’’ అనడాన్ని ఏ పౌర సమాజమూ ఆమోదించలేదు. ఒకరి అభి ప్రాయాల కారణంగా వారి ప్రాణాలను హరించడం... మన నాగరిక, రాజ్యాంగయుత జాతీయ దేశాన్ని ఒక విధమైన భయానక స్థలిగా మారు స్తుంది. కాబట్టి, అభిప్రాయాల కారణంగా ఎవరిని హతమార్చడానికీ వీల్లేద నేదే చర్చకు ఉత్తమమైన కేంద్ర బిందువు అవుతుంది.

దశాబ్దం క్రితం సామాజిక మాధ్యమాలు అప్పుడే మన జీవితాల్లోకి ప్రవేశించనప్పుడు మాలాంటి పాత సజ్జు బాపతు వాళ్లం దాన్ని హేళన చేశాం, ఇలా వచ్చి అలా పోయే వెర్రి అని  తీసిపారేశాం. కానీ నేడు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కోట్లాది మంది ఫాలోయర్స్‌తో... వాటిని ప్రజ లతో ప్రత్యక్ష సంబంధాలను నెరిపే సాధనాలుగా వాడుతున్నాయి. ఇక, క్రమంగా అది ప్రజాభిప్రాయాన్ని ‘‘హైజాక్‌’’ చేసే, హింసను ప్రేరేపించే మీడి యాగా మారడమూ జరుగుతుంది. ఆ హింస సాంప్రదాయకమైనదైనా లేక సోషల్‌ మీడియా పరమైనదైనా నేరమే.

మహాత్మాగాంధీతో ప్రారంభించి మన దేశం అప్రతిష్టాకరమైన రాజ కీయ హత్యల చరిత్రను పోగుచేసుకుంది. ఆ హత్యలకు కారణం రాజకీయ వైరాలు లేదా ప్రతీకారం తీర్చుకోడం (ప్రతాప్‌ సింగ్‌ కైరాన్, లలిత్‌ నారా యణ్‌ మిశ్రా, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ), భావాలూ కావచ్చు. భావ జాలపరంగా బాగా చీలిపోయి ఉన్న ప్రాంతాల్లో, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, బిహార్‌లో వామపక్షం, మితవాద పక్షం కూడా ఇతరుల నోళ్లను మూయించడానికి హత్యలకు పాల్పడ్డాయి. ఏపీలో నక్సల్స్‌ జరిపిన దాడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తండ్రిని రాజకీయ ప్రత్యర్థులు ఆయన కారుపై బాంబు దాడి చేసి హతమార్చారు. 1974–94 మధ్య పంజాబ్‌లో వేలాది మందిని హతమార్చారు, వారిలో పలువురిని కేవలం వారి భావాల కారణం గానే చంపారు. పంజాబ్‌ కేసరి మీడియా సంస్థల వ్యవస్థాపకుడు లాలా జగత్‌ నారాయణ్‌ను, ఆయన కుమారుడినే కాదు, ఆ సంస్థల్లో పనిచేసేవారని, పత్రి కలు అమ్మేవారిని సైతం హతమార్చారు. జర్నైల్‌ సింగ్‌ బింద్ర¯Œ వాలా పద్ధతి చాలా సరళమైనది. స్వర్ణ దేవాలయంలో ఆయన కోర్టును నిర్వహించే వారు. ఎవరైనా లేచి ఏ రాజకీయవేత్తనో లేదా మేధావినో వంచకుడని లేక దైవ దూషకుడని ఆరోపించేవారు. ఆయనే వారికి ఏం శిక్ష విధించాలో అడిగే వాడు. ఇక ఆ తర్వాతి పనిని తుపాకీ ముగించేసేది.

ముద్రలు వేసేయడం హత్యలకు లైసెన్సా?
ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎవరినైనా లక్ష్యం చేసుకుని తుదముట్టిం చేయ డానికి దాన్ని సమర్థించుకోడానికి ‘‘మాట’’ చాలు. గతంలో ఇలా మాట్లాడిన వ్యక్తి, తన మతానికి సంబంధించిన అత్యున్నత ఆధ్యాత్మికతకు ఇహలోక పీఠంపై ఉన్నవారు. నేడు, ఆ గురు పీఠంపై ఉన్నది సామాజిక మాధ్యమాలు. వాటిని ఉపయోగించుకోవడానికి మీరు ఒక సాధువు లేదా బాబా, సంత్, లేదా మౌలానా కావాల్సిన అవసరం సైతం లేదు. వ్యక్తులకు జాతి వ్యతి రేకులు, దేశద్రోహులు, మతాన్ని ధిక్కరించేవారు, విదేశీ ఏజెంట్లు అని పేర్లు పెట్టేసి తిట్టిపోస్తూ మీరొక ట్వీట్ల దుమారాన్ని రేకెత్తించేస్తే సరి పోతుంది. ఎవరైనా ఒకరిని తుపాకీతో కాల్చి చంపేయడానికి, లేదా మూకు మ్మడిగా చావబాది హతమార్చడానికి అదే సమర్థనను కల్పిస్తుంది.

ఒక వ్యక్తి లేదా ఒక బృందం ఒక ప్రాణాన్ని హరించడానికి నైతిక సమం జసత్వంతో సాయుధమైతే చాలు, వారి చేతికి ఎలాగోలా తుపాకీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలాగూ రాజకీయాలు ఆ కేసును హస్తగతం చేసుకుని, న్యాయ క్రమాన్ని ఇష్టానుసారం మెలి తిప్పగలుగుతుందని సైతం వారు ఆశిస్తారు.  ప్రత్యర్థులు అప్పుడిక నేర రాజకీయాలపై కొట్లాడుకుంటారు. మీ మట్టుకు మీరు ఆ హత్య కేసు నుంచి తప్పించుకు పోవచ్చు. పోల్చడానికి వీల్లేనిదే అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 1978లో ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం అరెస్టు చేసినందుకు నిరసనగా లక్నో నుంచి ఢిల్లీ వెళు తున్న విమానాన్ని పాండే, అతని మిత్రులు హైజాక్‌ చేయడం గుర్తుకు తెచ్చు కోవాలి. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతోనే ప్రాసిక్యూషన్‌ కేసు గాల్లో కొట్టుకుపోయింది. రాజకీయ నేరాలకు పాల్పడేవారు వెంటనే తమ చర్యలను రాజకీయం చేస్తారు.

గౌరి హత్య నేర్పే గుణపాఠాలు
గౌరీ లంకేశ్‌ హత్య నుంచి సరళమైన, విజ్ఞతాయుతమైన గుణపాఠాలను తీయవచ్చు. ఒకటి, నేర దర్యాప్తులు, న్యాయ క్రమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈ కేసును వెంటనే సీబీఐ లేదా ఎన్‌ఐఏ లేదా మరేదైనా పొట్టి పేరు సంస్థకు అప్పగించాలని హడావుడిగా చేసే డిమాండ్లను తోసి పుచ్చాలి. ఏదైనా ఒక కోర్టు ఆ కేసు పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించడం ఉత్తమం. మన కోర్టులు ఇప్పడు అలాంటి బాధ్యతలను నిర్వరిస్తున్నాయన డానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాజకీయ హత్యకు అలాంటి జోక్యాన్ని కోరడానికి తగినంత ప్రాధాన్యం ఉన్నది. లేకపోతే ఇది కమాం డో–కామిక్‌ చానళ్లకూ, గౌరీ లంకేశ్‌తో వైరం ఉన్న ఆమె సోదరుడు ముందు నిలవగా నూతనోత్తేజంతో సోషల్‌ మీడియా హ్యండిల్స్‌ (ఖాతాలు) సృష్టించే కొత్త పౌరాణిక కథలకూ లేదా గౌరీ లంకేశ్‌ జీవించి ఉండి వుంటే హేళన చేసేలా ఆమె మరణాన్ని సొమ్ముచేసుకుంటూ ఆమెకు వలసవాద సంకేతమైన 21 తుపాకుల వందనాన్ని సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రికీ మధ్యా ఇరుక్కుపోతుంది. కర్ణాటక హేతువాదులను ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోయిందో లేక వారి హంతకులను ఎందుకు పట్టుకోలేక పోయిందో సమాధానం చెప్పాల్సి ఉంది.

గౌరీ లంకేశ్‌ తన మరణంతో, సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై చర్చను ముగించి ఉండవచ్చు. ఇటు నుంచి వీళ్లు, అటు నుంచి వాళ్లు సందర్భశుద్ధి లేకుండా అలవాటుగా ఇష్టానుసారం చర్చలు సాగించడానికి వీల్లేదు. సామాజిక మాధ్యమాల్లోని విద్వేషపూరితమైన వ్యాఖ్యల విషయంలో చట్టం అందరికీ సమానంగానే వర్తించాలి.  సాంప్రదా యకమైన రీతిలోనే అది సామాజిక మాధ్యమాల ద్వారా హింసను ప్రేరేపిం చడంతో కూడా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాలను  రాజకీయ వర్గం చావబాదే గుంపులను ప్రయోగించడానికి వాడుకోవాలనే ఉబలాటాన్ని విడ నాడాలి. అవతలి పక్షం కూడా ఇదే చేస్తున్నదనేది ఇందుకు సమర్థన కాజా లదు. వారి లక్ష్యం  దుమ్మెత్తిపోసే విభ్రాంతికరమైన దాడితో తమ విమర్శకుల నోళ్లను మూయించాలనేదే. దాన్ని అనుసరించి భౌతిక హింస కూడా వస్తుంది. ప్రధాని ఈ కీలక విషయాన్ని గ్రహించాలి.

ఎవరినో ఒకరిని సామా జిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నంత (ఫాలో) మాత్రాన వారి అభి ప్రాయా లకు ఆమోదం తెలపడం కాదనే వాదన... ఆ వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్న వారైనా, వారి ప్రత్యర్థి అయినా వారి తప్పును తుడిచేయలేదు. మీ పేరిట ఇత రులను తిట్టిపోసేవారిని మీరు అనుసరించడం అంటే మీరు వారి అభిప్రా యాలకు అంగీకరిస్తున్నట్టే.

ఇక చివరిగా, మీడియాకు చెందిన మనమూ, ఉదారవాదులుగా చెప్పు కునేవారూ నేర్చుకోవాల్సిన గుణపాఠం: మన మధ్య ఉండే విభజన రేఖ ఎక్కడ ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అంద రికీ ఉన్నదే. ఆగ్రహంతో రెండు శిబిరాలుగా చీలిపోయి ఉన్న స్థితిలో ఈ స్వేచ్ఛల పరిరక్షణ నిర్ద్వంద్వమైనది.  ఉదారవాదం అంటే  ‘‘ఎదుటి పక్షం’’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని మూర్ఖమైనదిగానో లేక అనైతికమనో కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణల నుంచి తిరిగి నాగరికత సరిహద్దులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement