
నిరాశ నిశిలో ఆశల ఆరాటం
తూర్పు యూపీ ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మోదీ మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా?
జాతిహితం
తూర్పు యూపీ ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మోదీ మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువకుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. అంత నిశ్శబ్ద ప్రతిస్పందనను చూసి ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అనుకుంటోందో అర్థం కాలేదనే.
అమెరికన్లు బేస్‌బాల్ క్రీడా మైదానాన్ని బాల్‌పార్క్ అన్నట్టే పనికిరాని బీడుభూములను బ్యాడ్‌ల్యాండ్స్ అనడం పరిపాటి. ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఆ వర్ణనకు సరిపోయేవిగా ఉంటాయి. బుందేల్‌ఖండ్‌లోని యమున, ఛంబల్ నదుల వెంబడే నిస్సారమైన, ఒరుసుకుపోయిన లోయల ప్రాంతం, ఇటావా సరిగ్గా ఆ అభివర్ణనకు సరిపోతాయి. బ్యాడ్‌ల్యాండ్స్ అనే దానికి ముక్కస్య ముక్క అర్థం చెప్పుకుని చెడ్డ భూములు అన్నా లేదా ప్రజా ప్రాచుర్యం పొందిన అరాచక ప్రాంతాలు అన్నా సరిగ్గా సరిపోతుంది. ఇంకా తూర్పునకు పోతే ప్రకృతి చిత్రం మారిపోతుంది. క్రమబద్ధమైన, సాధారణ నీటి కాలువలు, వాటి ఒడ్డున నీటితో తడిచి కళకళలాడే మరింత సారవంత మైన నేలలు కనిపిస్తాయి. కానీ జీవన నాణ్యతతో పాటే, అంతే వేగంగా చట్ట బద్ధపాలన కూడా క్షీణించిపోతుంది. ఏ కప్పూ లేక బహిరంగంగా, పొంగిపొర్లే మురుగునీటి కాలువలు, మురుగు నీటి గొట్టాలు, పైన వదులుగా వేలాడే వైర్లు, గాలిలోని శాశ్వత దుర్గంధం, గుంతలు, దురాక్రమణలు, గిడసబారిన పిల్లలు, దవడలు పీక్కుపోయిన పెద్దలు, వారిలో వందలాది మంది ఏటేటా జపనీస్ ఎన్‌సెఫాలిటిస్ శిక్షకు గురై బలైపోయేవారూ కనిపిస్తారు. రోడ్డు పక్క పాదచారుల బాటలు పూర్తిగా చెత్తతో నిండి పేవ్‌మెంట్ల అవతారమెత్తు తాయి. అర్థరాత్రి మాత్రం రోడ్లు మధ్యలో మాత్రం శుభ్రంగా తుడిచి ఉంటాయి. కనీసం గోరఖ్‌పూర్‌లోని ‘పోష్’ (విలాస) ప్రాంతాల్లో, ఆ చుట్టు పక్కలనైనా ఇది కనిపిస్తుంది.
మనం మరచిన యూపీ
గోరఖ్‌పూర్, యూపీలోని అత్యంత నిరాశాజనక ప్రాంతమైన తూర్పు యూపీకి దాదాపుగా రాజధాని వంటిదే. దానికి ఉత్తరాన నేపాల్‌తో నిర్ని బంధ సరిహద్దుంది. పశ్చిమ బిహార్‌ను ఆనుకుని మిట్టపల్లాలుగా ఉండే తూర్పు జిల్లాలున్నాయి (కుశీనగర్‌సహా బౌద్ధుల ముఖ్య ప్రాంతాలు ఉన్నది అక్కడే). దక్షిణాన ఉన్నవి మరింత గందరగోళంగా ఉండే దియోరియా, అజామ్‌గర్, బాలియా, జునాపుర్ తదితర జిల్లాలు. మన కంటికి కనిపించని, ఆలోచనల్లోకి రాని విస్మృత ప్రాంతంగా ఈశాన్య భారతాన్ని మనం ఎన్నడో ఆమోదించాం. తూర్పు యూపీకి, ప్రత్యేకించి గోరఖ్‌పూర్‌కు వచ్చి చూడండి. మీకు అలాంటి అనుభవమే కలుగుతుంది. మీరు ఎక్కడ చూస్తారనే దాన్ని బట్టి.. కిందికా, పైకా లేక నేల మీది నుంచా, ఆకాశం నుంచా అనే దాన్ని బట్టి.. గోరఖ్‌పూర్‌పై మీకు రెండు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. మీ కాళ్ల కింద చెత్త, బురద ఉంటే మీ దృష్టిని అక్కడి నుంచి పైకి, రోడ్ల కూడలి కుడి ఎడమలకు, ముందుకు చూడండి. ప్రైవేటు ఉన్నత విద్య, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు గత 15 ఏళ్లుగా దేశ ప్రధాన భూభాగంలో వేగంగా వృద్ధి చెందాయని గోడల మీది రాతలు చాటుతాయి.
1991 సంస్కరణల తర్వాత మన దేశంలోని చిన్న పట్టణాలలో విద్య అత్యంత జనా దరణగల వినియోగ వస్తువుగా మారింది. తూర్పు యూపీ లేదా పూర్వాం చల్‌లో అది పూర్తిగా విభిన్నమైన, అవాస్తవిక ప్రమాణాలకు హైదరాబాద్ లోని టాలీవుడ్ సినిమా హోర్డింగులంత పెద్ద ప్రకటనలు ఇక్కడికి సుదూ రంలో ఎక్కడో దొరికే ఉద్యోగానికి టికెట్‌ను అమ్మజూపుతుంటాయి. సివిల్ లైన్స్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కలా అర్ధరాత్రి నడకకుపోయి 200 హోర్డింగులను లెక్కించాను. వాటిలో 170కు పైగా విద్య, శిక్షణ, పోటీ పరీక్షలకు కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు సంబంధించినవే. ‘‘మీకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యం అక్కర్లేదని మీరు నిజంగానే అనుకుంటున్నారా?’’ అని పెద్ద పెద్ద అక్షరాలతో హిందీలో రాసి ఉన్న ప్రకటన మిమ్మల్ని వెక్కి రించేలా ఉంటుంది. పీఎంటీ కోచింగ్ సెంటర్ ద్వారా ‘‘గత 18 ఏళ్లలో 1,012 మంది డాక్టర్లను సృష్టించిన’’ డాక్టర్ రాహుల్ రాయ్‌ను మరో హోర్డింగ్ పరిచయం చేస్తుంది.
ఆశల దీవికి ఎగిరిపోవాలి
తక్కువ నిరాశాజనకమైన, అవకాశాలు కొన్నయినా ఉన్న ప్రాంతానికి వెళ్లగల గడానికి మించి పూర్వాంచలీ యువత కోరుకునేది ఏదీ లేదు. ఆకాంక్షా భరితమైన ఆ పోటీలో నెగ్గుకురాగలిగేది అతికొందరే. మిగతా వారంతా రిక్షాలు లాగుతూ, నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ, తోపుడు బళ్లపై పళ్లు, కూర గాయలు అమ్ముకుంటూ, చిన్న చాయ్ దుకాణాలు పెట్టుకుని కుళ్లిపోతున్న మన మెట్రో సబర్బన్, మురికివాడలను నింపుతారు. ఆరు కోట్ల భారతీయు లున్న ఈ విస్మృత ప్రాంతాన్ని ‘ఉడ్తా పూర్వాంచల్’ అని కీర్తించాలని ఏ సినీ నిర్మాతా అనుకోడు. అయినా అక్కడి యువతకంతటికీ ఉన్నది చాలా వరకు ఒకే ఒక్క ఆకాంక్ష: ఎక్కడికో ఎగిరిపోవాలి.
ప్రధాని నరేంద్ర మోదీకి శ్రోతలను కూడా తన ఉపన్యాసంలో భాగస్వా ములను చేయడంలో అసాధారణ ప్రతిభ ఉంది. దాన్ని వర్ణించడానికి ఆయనో అద్భుత వక్త అంటే సరిపోదు. శ్రోతలు ఏమి, ఎప్పుడు, ఏ స్థాయిలో వినాలని కోరుకుంటున్నారో ఆయనకు తెలుసు. సరైన సమయాన్ని ఎంచు కోవడం, మధ్యలో ఆగడం, హావభావ విన్యాసాలు, రెండు చేతులూ చాచి వలయంలా ఊపడం, ఏదైనా మంచి విషయం చెప్పానని అనుకున్నప్పుడు ఒక అరచేతిని మరో చేతిపై తడుతూ వేచి చూడటం తదితర విషయాల్లో ఆయనది సహజ చాతుర్యం. అందుల్లనే దాదాపు లోపరహితమైన ఆయన పకడ్బందీ ప్రచారంలో దియోరియాలోఒక అపస్వరం వినిపించడం ఆశ్చర్యం కలిగించింది.
రాహుల్ గాంధీ గత ప్రచార కార్యక్రమాల్లో దొర్లినట్టుగా అది స్థానిక పరిస్థితిని అర్థం చేసుకోవడంలోని పొరబాటు కావడం మరింత వైచిత్రి. 2012 రాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ లాగే నేడు మోదీ కూడా ఆ ప్రాంతపు ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువ కుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. ఆ స్పందన అంత నిశ్శబ్దంగా ఉన్నదేమని ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అను కుంటోందో అర్థం కాలేదనే. ఇక్కడ సమస్య కేవలం విద్యో, ఉద్యోగాలో కాదు. అభిలషణీయమైన దానికంటే తక్కువ స్థాయి నాణ్యతగల జీవితాలను అను భవించేలా శాపగ్రస్తులు కావడం. వర్షాకాలం వస్తే మురుగు కాలువలు పెద్ద కాలువలుగా మారిపోతాయి. గాలి దుమ్ముతో నిండి ఉంటుంది. ఇక దోమల సంగతి చెప్పనవసరమే లేదు. దారిన నడుస్తూ నడుస్తూ ఫోన్లో మాట్లాడితే కొన్ని దోమలను మీరు మింగేయనూవచ్చు. ప్రధాని సైతం ఆ ప్రాంతపు సామాజికాభివృద్ధి సూచికలు నిరుపేద ఆఫ్రికా దేశాల స్థాయిలో ఉన్నాయ న్నారు. అంటే అది పూర్వాంచల్ గురించి మాట్లాడటమే అవుతుంది.
ఆ ప్రాంతం ఇలా శాపగ్రస్తమైనది కావడానికి భౌగోళికత కొంతవరకు కారణం. ఎక్కడి నుంచి చూసినాగానీ గోరఖ్‌పూర్ మరీ సుదూర ప్రాంతం. దేశంలోని ప్రధాన రైలు లేదా రోడ్డు వ్యవస్థలతో అది అనుసంధానమై లేదు. ఇటీవలి వరకు అది మీటర్ గేజ్ రైల్వే లైన్ల ప్రాంతంగానే ఉండేది. ఆ ప్రాంత ప్రజలు ఎప్పడూ ప్రతిభావంతులు, కష్టించేవారు, తిరగబడేవారే. గోరఖ్‌పూర్ నుంచి దియోరియాకు మధ్య దారిలో చౌరీ చౌరా ఉంది. 1922లో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టి 23 మంది పోలీసులను హతమార్చినది అక్కడే. మార్షల్ లా విధించి బ్రిటిష్‌వారు అక్కడ సృష్టించిన భయోత్పాతానికి నిరసన తెలపడానికి అక్కడి వచ్చిన నెహ్రూను అరెస్టు చేశారు. ఆయన అంత దూరం ఎలా వచ్చారో 94 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరే ఊహించుకోండి. గోరఖ్‌పూర్ జైలులో ప్రముఖ విప్లవకారుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్‌ను ఉరితీశారు. అయినా ఆ ప్రాంతం ఇంకా అంత దూరంగానే ఉంది.
పూర్వాంచల్ దిశగా
నాటి విప్లవకారుల స్థానంలో మాఫియా సభ్యులు వచ్చారు. బ్రాహ్మణ, రాజ పుత్ర మాఫియాల మధ్య రక్తసిక్త ప్రతీకార హత్యాకాండలు నేడు లేవు. కానీ పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ముఠాలున్నాయి. నగరాలలో ఎప్పుడు సుపారీ హత్యలు జరిగినా సాధారణ అనుమానితులు ఇక్కడివారే అయి ఉంటారు. విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఇష్కియా’లో పారిపోతున్న నసీరుద్దీన్ షా, అర్షాద్ వార్సీలు గోరఖ్‌పూర్ దగ్గర్లోనే దాక్కుంటారు. ఆ సన్నివేశంలో వార్సీ, నసీరు ద్దీన్ షాతో మరువలేని ఈ మాటలంటాడు :‘‘కాలికి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెంటనే ఉడాయిద్దాం. మన భోపాల్‌లోనైతే షియాలు, సున్నీలే కొట్లాడుకుం టారు. ఇక్కడ బ్రాహ్మణులు, ఠాకూర్‌లు, యాదవ్‌లు, జాట్లు అందరికీ (ప్రైవేటు) సేనలున్నాయి.’’ కాబట్టి పూర్వాంచల్ కూడా బ్యాడ్‌ల్యాండ్స్ అనే పదబంధం జనప్రాచుర్యం పొందిన అర్థ పరీక్షలో నెగ్గుతుంది.
గోరఖ్‌పూర్‌లో రాజ్యం చలాయిస్తున్నది భూస్వాములో లేక సంప్రదా యక మాఫియా ముఠాలో కాదు. అంగబలం ఉండి, సుస్పష్టంగా మాట్లాడ గలిగిన, కాషాయాంబరధారి యోగీ ఆదిత్యనాథ్. శక్తివంతమైన గోరఖ్‌పూర్ మఠా నికి ఆయన వారసత్వ అధిపతి. ఆయన ఐదుసార్లు గెలిచారు. ఈసారి ఆయన బీజేపీకి ఆ జిల్లాలోని ఎక్కువ స్థానాలను సాధించిపెడతారని ఆశిస్తు న్నారు. ఆయన గుడి, మఠం రెండూ ఆ ప్రాంతానికి ప్రామాణిక చిహ్నాలు. అంతేకాదు అత్యంత పరిశుభ్రమైనవి కూడా. ఈ ఎన్నికల్లో బీజేపీ ముస్లింలను ఎవరినీ ఎందుకు నిలపలేదు? అని అడిగాం. గెలవడం మాత్రమే లెక్కలోకి వస్తుంది అని ఆయన అన్నారు. బీజేపీ జాబితాలో ముస్లింలు లేకపోతేనేం, ఇక్కడ ఎన్నడూ మత కల్లోలాలు జరగవు అన్నారు. ఎందుకని అడిగాం. ‘‘మేం అందించే మంచి పాలన, భయం’’. భయం ఎందుకు, ఎవరంటే భయం అని అడిగాం. మా ప్రశ్నను ఆయన పట్టించుకోలేదు.
యూపీని చిన్న రాష్ట్రాలుగా విభజించే విషయం ప్రస్తావనకు వచ్చిన ప్పుడు ఆయన కళ్లు వెలిగాయి. వాటిలో ఒకటి పూర్వాంచల్ అవుతుంది. ఈ ఎన్నికలు అందుకు సమయం కాదు. అయితే ఆ విషయాన్ని ఆయన ముందు ముందు పట్టించుకుంటారని, కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఆయన అనుకుంటున్నారనేది స్పష్టమే. జరగనున్న ఈ అనివార్య పరిణామం గోడ మీద కనిపిస్తుండగా ఇష్కియా చిత్రంలోని అర్షాద్ వార్సీ సలహాను ఎవరు మాత్రం పాటించరు? కాళ్లకు బుద్ధి చెప్పి వెంటనే ఇక్కడి నుంచి పలాయనం చిత్తగిద్దాం.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta