కమ్యూనికేషన్ నిబంధనలను ఎత్తివేయడంపై జాప్యం కొనసాగుతుండటం కశ్మీరీల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇది పరిస్థితులను అదుపు తప్పేలా చేస్తుంది. పైగా కశ్మీర్ స్థితిగతులను ప్రపంచం పరిశీలి స్తోంది కూడా. కానీ ప్రస్తుతం కశ్మీర్ గురించి ప్రపంచం పట్టించుకుంటోందా? కనీసం కశ్మీర్ గురించి ప్రపంచానికేమైనా తెలుసా? కశ్మీర్ ఉపఖండంలో భాగమని, దీనికోసమే భారత్, పాకిస్తాన్ లు అసంగతమైన స్థాయిలో పరస్పరం కలహించుకుంటున్నాయనీ. తరచుగా అణుయుద్ధ స్థాయికి కూడా దీన్ని తీసుకెళుతున్నాయని అర్థమైనప్పుడు మాత్రమే ప్రపంచం అట్లాస్‌లో కశ్మీర్ గురించి శోధిస్తోంది.
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కేటగిరీలో ఇమడక పోవచ్చు. ఉపఖండం గురించి అమెరికా అధికారులు తనకు వివరిస్తున్నప్పుడు బటన్, నిప్పిల్ అంటే ఏంటి (భూటాన్, నేపాల్ దేశాలు) అని ట్రంప్ ప్రశ్నించడం ఎవరూ ఇంకా మర్చిపోలేదు. చివరకు గత జూలైలో అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన ప్రెస్ కాన్ఫరెన్సులో ట్రంప్ కశ్మీర్‌ని ‘నిత్యం బాంబులు కురుస్తున్న ఆ సుందరమైన స్థలం’ అంటూ వర్ణించడం కూడా మన దృష్టి పథాన్ని దాటిపోలేదు.
ఇది మనకు ఏం చెబుతోంది అంటే.. భారత అత్యుత్తమ వ్యూహా త్మక, రాజకీయ ప్రయోజనాల రీత్యా చూస్తే కశ్మీర్‌పై బయటినుంచి వచ్చే ఏ వార్త కూడా మంచి వార్త కాదన్నట్లే.. కశ్మీర్‌లో తీవ్రవాదం ప్రారంభమైన తర్వాత గత 30 ఏళ్లలో 1991–94 మధ్య కాలంలో మాత్రమే కశ్మీర్ సమస్య ప్రపంచం దృష్టికి వచ్చింది. కశ్మీర్‌లో ఎవరూ క్షమించలేనటువంటి తీవ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే కశ్మీర్ సమస్య ప్రపంచానికి తెలియవచ్చింది. ప్రతి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థా అక్కడి అణచివేతను తొలిసారిగా పట్టించుకుంది. మొట్టమొదటిసారిగా క్లింటన్ పాలనా యంత్రాంగం భారత్‌పై మండిపడింది కూడా.
కానీ పీవీ నరసింహారావు ఈ సమస్యను అధిగమించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి కశ్మీర్‌లో అంతర్జాతీయ మీడియా ప్రవేశించడానికి అవకాశం కల్పించి ప్రపంచ అభిప్రాయాన్ని కాస్త చల్లబరిచారు. కానీ మానవ హక్కుల సంస్థలకు ప్రవేశం కల్పించలేదు. దానికి ప్రతిగా తన సొంత జాతీయ మానవ హక్కుల కమిషన్ ను 1993లో నెలకొల్పారు. ఆనాటి నుంచి కశ్మీర్ సమస్యను తెరవెనక్కి నెట్టడం పైనే పీవీ కేంద్రీకరించేవారు. 1994లో అమెరికా కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో కూడా కశ్మీర్ విషయాన్ని ఎంతో చతురతతో ప్రస్తావించారు. అయితే దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి టెక్సాస్‌ని కలిపేసుకున్న విధంగా చారిత్రక పోలికను తీసుకొచ్చారు.
మరోవైపున వ్యూహాత్మకంగా కశ్మీర్‌ను స్థాయిని పీవీ తగ్గించివేశారు. అప్పట్లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో కశ్మీర్ భవిష్యత్తును మీరెలా చూస్తున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు పీవీ సులువుగా తేల్చిపడేశారు. ‘భాయీ, వారు ఏదో ఒకటి చేస్తారు. మేము కూడా మరొకటి చేస్తాం. ఈ అటలోంచే దాని ఫలితం వస్తుంది’ అనేశారు. కశ్మీర్‌ను ఆయన ఆ స్థాయిలోనే చూశారు. సిమ్లా ఒప్పందం తర్వాత దశాబ్దాల పాటు ఏబీ వాజ్‌పేయితోసహా భారత ప్రధానులంతా కశ్మీర్ సమస్యను కుదించే వ్యూహాన్నే అవలంబించారు. కార్గిల్ వంటి దాదాపు యుద్ధం సంభవించిన స్థితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించే మాట్లాడసాగాం. అంతే తప్ప కశ్మీర్‌ను ఒక సమస్యగా చూపించడానికి భారత్ అనుమతించలేదు.
చాలాకాలం ఇది చక్కగా పనిచేసింది. 2001లో అమెరికాపై దాడులు జరిగాక పాకిస్తాన్ ని పెంచి పోషించడానికి అమెరికా పూనుకున్నప్పుడు కూడా పాక్ సైన్యం కశ్మీర్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే కశ్మీర్ పరిస్థితిని ఇంకా దిగజార్చాలని అమెరికా భావించలేదు. అదే సమయంలో భారత్ ఈ నూతన పరిస్థితిని చాలావరకు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో మూడు పరిణామాలు ఆవిర్భవించాయి. మొదటిది, భారత్–పాక్‌లు వ్యూహాత్మక సమతుల్య స్థితికి చేరుకున్నాయనీ, సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎత్తుడల స్థాయిలోనే ఉంటున్నాయని ప్రపంచం విశ్వసించసాగింది. రెండు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో పాక్, వికాసదశలో సాగుతున్న భారత్ యధాతథస్థితిలోనే తమకు కొత్త ప్రయోజనాలు ఉన్నట్లు గ్రహించాయి. మూడు, రెండు దేశాల కొత్త తరాలు ఆధీనరేఖే తమ సరిహద్దుగా ఆమోదించే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి.
ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం ప్రణాళికా రహితంగానే ఫలప్రదమయ్యే తన పూర్వ ప్రధానుల వైఖరినుంచి పక్కకు తప్పుకుని యధాతథ స్థితిని విచ్ఛిన్నపర్చే స్థాయికి చేరుకుంది. అయితే అలా పాత స్థితిని బ్రేక్ చేసిన మొదటి ప్రభుత్వం మోదీది కాదు. కశ్మీర్ సమస్య తన ప్రాధాన్యతను కోల్పోతోందని నిసృ్పహకు గురైన పాక్ తొలుత 2008లో, తర్వాత పఠాన్ కోఠ్‌లో, పులవామాలో యధాతథస్థితిని బద్దలు చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులకు పాల్పడింది స్థానికులే అని ఆరోపిస్తే సరిపోతుంది. కశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించడం, అణు ప్రమాదాన్ని రేకెత్తించడం, దీంతో ప్రపంచం భీతిల్లగానే ప్రధాన సమస్యవైపు దాని దృష్టిని మళ్లించడం అనేది ఇప్పుడు పాక్ వైఖరిగా మారింది.
ఒకవేళ పాక్ వ్యూహం పని చేయకపోతే, అది మరింత అసహనానికి లోనై మళ్లీ అదే పని చేస్తుందేమో తెలీదు. ప్రస్తుతానికి పాక్ వ్యూహం పనిచేయనందునే, రెండోసారి మెజారిటీ సాధించిన మోదీ నాయకత్వంలోని భారతదేశం యథాతథ స్థితిని నిర్ణయాత్మకంగా మార్చే ప్రయత్నం చేసిందని మనం అర్థం చేసుకుంటాం. పాక్ ఇప్పుడు కూడా యుద్ధ బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం దాన్ని కూడా వదిలేసింది. తన సైనిక పరిమితులను అది గ్రహించింది. దానికి ప్రపంచంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు కూడా. న్యూయార్క్‌లో ఇమ్రాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో భారత్‌పై దాడి చేయలేనప్పుడు మనం ఇంకేం చేయగలమని ఆయన అడిగిన తీరును చూపిస్తున్న వీడియో క్లిప్‌ను దయచేసి పరిశీలించండి.
ఇప్పటి వరకు బానేవుంది. ఇప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఒప్పకున్నా, ఒప్పకోకపోయినా అర్థశతాబ్దం తర్వాత ఇప్పుడు కశ్మీర్ సమస్య అంతర్జాతీయం అయ్యింది. ఇప్పుడు పాక్ కాదు, భారత్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాల్సి ఉంది. చైనా, టర్కీ తప్ప ఏ దేశమూ ఆగస్టు 5 తరువాత జరిగిన మార్పులు తన అంతర్గత అంశాలని చెబుతున్న భారత్ వైఖరిని ప్రశ్నించలేకపోవడం, అలాగే, ఆగస్టు 5కు ముందునాటి స్థితి కల్పించాలని డిమాండ్ చేయలేకపోవడం మనకు అనుకూలమే. అమెరికాతో సహా చాలా దేశాలు కశ్మీర్‌లో జరుగబోయే తదనంతర పరిణామాలపై ఆసక్తితో ఉన్నాయి. ఊచకోత సాగుతోందన్న ఇమ్రాన్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. అలాగని, శ్రీనగర్‌లో సాధారణ స్థితిని చూపుతున్న డ్రోన్ చిత్రాలపట్ల కూడా సంతృప్తిగా లేరు. కశ్మీర్‌లో అమానుషమైన నిర్బంధం కొనసాగుతోంది. వేలాదిమందిని ఎలాంటి ఆరోపణలు, విచారణ లేకుండా నిర్బంధించడంపట్ల ఆయా దేశాలు త్వరలోనే సహనాన్ని వీడొచ్చు.
ఐక్యరాజ్య సమితి సమావేశాలు ముగిసినట్టే. పాకిస్తాన్ ను ఏకాకిని చేసి మనం సాధించిన దౌత్య విజయంపై సంబరాలు చేసుకోవచ్చు. మోదీ న్యూయార్క్ నుంచి ప్రతికూల అంశాల కంటే ఎక్కువగా అనుకూల అంశాలతోనే, తిరిగి వస్తున్నారు. కశ్మీర్ మా అంతర్గత అంశం అన్న భారత్ పాతపాటను ఎవరూ సవాల్ చేయలేదు. మోదీతో వైట్ హౌస్‌లో జరిపిన సమావేశంలో సైతం కశ్మీర్‌లో సాధారణ స్థితిని నెలకొల్పాలనీ, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ట్రంప్ కోరారు. అంతేగానీ, అగస్టు 5కు ముందునాటి స్థితిని పునరుద్ధరించమని కోరలేదు. అయితే, ఇదే స్థితిని భారత్ భవి ష్యత్‌లో కూడా కొనసాగిస్తే బాధితులమంటూ పాకిస్తాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం కశ్మీర్ ఇస్తుంది.
న్యూయార్క్‌లో ఏడాది కోసారి తూతూమంత్రంగా సాగే భారత్, పాక్ సమావేశాల్లో కశ్మీర్ భారత అంతర్గత అంశంగా నిలబెట్టుకోవడం దౌత్య విజయం అనుకుంటే, కశ్మీర్ భవిష్యత్, భారత్ చెప్పుకునే జాతిహితం కూడా అందులో ఇమిడి ఉంటాయి. కశ్మీర్‌లో సమాచార నిషేధం విధించి మరో వారంలో రెండు నెలలు పూర్తవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ కశ్మీర్‌ల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. తగిన సమయంలో దాన్ని అదుపు చేయడం సవాల్‌గా మారుతుంది. సమయం దాటేకొద్దీ హింస, రక్తపాతం చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంది. కశ్మీర్ పట్ల ప్రపంచం వ్యతిరేకంగా స్పందించడం లేదు. కానీ, ఇప్పుడది సున్నిత సమస్యగా మారింది. ఆ విధంగా కశ్మీర్ అంశం అంతర్జాతీయం అయ్యింది. ఆగస్టు 5 నిర్బంధం తర్వాత పరిస్థితిని ఏంటని ఆలోచించడమే కొత్త యధాతథస్థితిగా ఉంటుంది.
వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment